పేదలకు ‘డబుల్’ ఇండ్లు ఇస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చి ఆరేండ్లు దాటినా పేదోడి సొంత ఇంటి కల నెరవేరలేదు. గ్రేటర్ పరిధిలోనే లక్ష డబుల్ ఇండ్లు కట్టిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ‘సిటీలో ఇరుకు గదుల్లో ఉండాల్సిన అవసరం లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయి’ అని చెప్పి పేద ప్రజల్లో ఆశలు రేపారు. కానీ మొన్న దసరాకు జియాగూడలో 2 వేల ఇండ్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం జనానికి ఊహించని షాక్ లాంటిది. గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడడంతో దీనినే హడావిడి చేసి.. ఇక లక్ష ఇండ్ల మాట మర్చిపోతారా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ప్రజలకు మాయ మాటలు చెప్పి.. ఎలక్షన్స్ టైమ్ లో పబ్బంగడుపుకొనే విధానాలు పక్కనబెట్టి మీరిచ్చిన మాట నిలబెట్టుకొని ఇండ్లు లేని ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూమ్ ఇంటిని ఇవ్వాలి.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సమయంలో మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల్లో మునిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ లోపే రూ.15,461 కోట్ల రుణం తీసుకుంది. అయినా సరే ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు కూడా సరిగా అందడం లేదు. 4 నెలల నుంచి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీం కింద ఒక్క చెక్కు కూడా విడుదల కాలేదు. రైతు రుణమాఫీ సంగతీ అలానే ఉంది. ఆసరా పెన్షన్ లబ్ధిదారుల వయసు 60 ఏళ్లకు తగ్గించినా.. కొత్త పెన్షనర్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 2014లో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రకటించిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు ఇప్పటికీ ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది.
సొంతింటి కల తీరేదెన్నటికి?
‘గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పిచ్చుక గూళ్లు, అగ్గి పెట్టెల్లాంటి ఇండ్లను నిర్మించి కొంత మంది పేదలకు ఇచ్చాయి. ఇవి ఏమాత్రం నివాసయోగ్యంగా లేవు. ఒక్క రూమ్ ఉన్న ఆ ఇండ్లకు బిడ్డ, అల్లుడు వస్తే నిద్రపోయేదెక్కడ? స్నానం చేసి బట్టలు మార్చుకునేదెక్కడ? ఈ కష్టాలన్నీ తీరుస్తాం. పేదోళ్ల ఆత్మగౌరవం నిలబెడతాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టిస్తాం’.. తెలంగాణ వచ్చిన కొత్తలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి. సీఎం మాటలకు పొంగిపోయి లక్షలాది మంది ఇండ్ల కోసం అర్జీలు పెట్టుకున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల శంకుస్థాపనలు చేసిన ప్రతి సారీ ఈ దసరాకు గృహ ప్రవేశాలు అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పుకుంటూ వచ్చారు. ఈ మాటలు విన్న జనం తమ సొంతింటి కల తీరబోతోందని ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ ఎన్ని దసరాలు, ఉగాదులు పోయినా ఇండ్లు మాత్రం పూర్తి కాలేదు.
కట్టినవీ ఇయ్యలే
రాష్ట్రంలో ఇండ్లు లేని ప్రతి పేదోడికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించారు. 2019 ఎన్నికల్లోపు లక్ష ఇండ్లు కట్టిస్తామని, లేదంటే ఓట్లు కూడా అడగబోమని చెప్పారు. ఆయన మాట నమ్మి సొంతింటి కల నెరవేర్చుకోవాలన్న ఆశతో లక్షలాది మంది అర్జీలు పెట్టుకున్నారు. అయితే సీఎం హామీ ఇచ్చి ఆరేండ్లు గడుస్తున్నా.. జనం ఆశలు ఇంకా నెరవేరలేదు. ప్రతి ఏటా నియోజకవర్గానికి వెయ్యి ఇండ్ల చొప్పున నిర్మాణం చేపట్టి లబ్ధిదారులకు అందజేస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే సీఎం కేసీఆర్ 2018 డిసెంబర్ లోనే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయానికే దాదాపు 20 వేలకు పైగా ఇండ్లు పూర్తయినప్పటికీ వాటిని లబ్ధిదారులకు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకడుగేసింది. ఎన్నికల్లోపు లక్ష ఇండ్లు ఇస్తామని చెప్పి.. అక్కడ కొన్ని అక్కడ కొన్ని మాత్రమే ఇస్తే లబ్ధిదారులై ఉండి కూడా ఇండ్లు రాని వాళ్లలో వ్యతిరేకత వస్తుందని పూర్తిగా నిలిపేసింది. రాజకీయాలు లెక్కేసుకుని.. రెడీగా ఇండ్లను కూడా ప్రజలకు అప్పగించకుండా అలానే అగ్గిపెట్టె లాంటి గదుల్లో బతకమని చెప్పడం ఎంత వరకు సబబు.
సగం ఇండ్లు కూడా పూర్తి కాలే
రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష, జిల్లాల్లో 1,84,257 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటికి అయ్యే ఖర్చు గట్టిగా రూ.12 వేల కోట్లకు లోపేనని సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వమే రిపోర్ట్ ఇచ్చింది. పేదల ఇండ్ల కోసం కేటాయించిన ఈ మొత్తాన్ని ఐదేళ్లలో కూడా ఖర్చు పెట్టలేకపోవడం దారుణం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 2,84,257 ఇండ్ల సాంక్షన్ కాగా, ఇప్పటి వరకు 45,942 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇందులో గ్రేటర్ లో పది వేల ఇండ్లు పూర్తయినవి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దాదాపు 1.8 లక్షల ఇండ్లు ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 50 వేల ఇండ్ల నిర్మాణం ఊగిసలాటలో ఉంది.వాటిని నిర్మిస్తారో, లేదో హౌసింగ్ బోర్డు ఆఫీసర్లకే తెలియడం లేదు. అయితే గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లో లక్ష ఇండ్ల ప్రచారం జోరు పెంచారు. కానీ ఇచ్చింది మాత్రం 2 వేల ఇండ్లే. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో కమీషన్ల కోసం తమకు కావాల్సిన వాళ్లకు ప్రాజెక్టులు అప్పజెప్పి అప్పులు తెచ్చి మరీ వేల కోట్లు తగలబోస్తున్న ప్రభుత్వం పేదల ఇండ్లకు డబ్బులేదన్నట్లు వ్యవహరిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తున్నాయని మొన్న జియాగూడలో 2 వేల ఇండ్లు ఇచ్చి హడావిడి చేయడం జనం అంతా చూశారు. మళ్లీ ఈ ఎన్నికలు అయిపోయాక ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మాట గాలికొదిలేస్తే ప్రజలు క్షమించరు. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ఏదో చేసేస్తున్నామన్న ప్రచారం చేసుకునే తీరు మార్చుకుని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే భవిష్యత్తులో ఏ ఎన్నికలొచ్చినా.. టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పి తీరుతారని గుర్తుంచుకోవాలి.
గ్రేటర్ లో 16 లక్షల కుటుంబాలకు సొంతిల్లు లేదు
రాష్ట్రంలో మొత్తంగా దాదాపు మూడున్నర కోట్ల జనాభా ఉంటే.. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే సుమారు 24 లక్షల కుటుంబాలు ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే అందులో సుమారు 16 లక్షల కుటుంబాలు కిరాయి ఇండ్లలోనే ఉంటున్నాయి. ఇలా అద్దె ఇండ్లలో ఉంటున్న వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని గతంలో ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి భారీగా ప్రకటనలు కూడా ఇచ్చారు. దీంతో నగరంలో ఇండ్లు లేని పేదలంతా తమకు సొంత ఇండ్లు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు దాదాపు ఆరు లక్షల మంది ఉన్నారు. రాజీవ్ గృహకల్పన కింద మరో 50 వేల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. – మన్నారం నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ లోక్ సత్తా పార్టీ.
Read more news
కళ్ల ముందే అద్భుతాలు.. త్వరలో అందుబాటులోకి ఏఆర్ టెక్నాలజీ