ఒక రూపాయి నాణెం ముద్రించడానికి అయ్యే ఖర్చెంతో చూడండి

ఒక రూపాయి నాణెం ముద్రించడానికి అయ్యే ఖర్చెంతో చూడండి

రూపాయి.. ఈ కాలం పిల్లలకు ఈ నాణెం విలువ తెలియకపోవచ్చు, కానీ ఓ పదిహేనేళ్లు వెనక్కి వెళ్తే దీని విలువ తెలుస్తుంది. రూపాయి ఇస్తేనే బడికెళ్తా అని మారం చేసే పిల్లలు మొదలు.. రూపాయి నాణెం కొట్లో ఇస్తే చేతికందే తినుబండారాల వరకూ అన్నీ మధుర జ్ఞాపకాలే. ప్రస్తుతానికి ఒక రూపాయి నాణేనికి పెద్దగా ద్రవ్య ప్రాముఖ్యత ఉండకపోవచ్చు, కానీ ఇప్పటికీ కొందరు ఇళ్లలో ఈ నాణెం ఒక సెంటిమెంట్. 

చెప్పుకోవడానికి ఈ నాణెం ఎంతో చరిత్ర కలిగివున్నా.. ఒక రూపాయి నాణెం ముద్రించడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా..! ఆలోచించరు. తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఇదే సందేహం ఒక వ్యక్తి మదిలో మెదలాగా.. సమాచార హక్కు చట్టం (RTI) ప్రకారం ఒక రూపాయి నాణెం ముద్రించడానికి ప్రభుత్వం ఎంత వెచ్చిస్తోంది అని లేఖ రాశాడు. ఆ RTI అభ్యర్థనకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రతిస్పందిస్తూ ఒక రూపాయి నాణెం తయారీకి సగటు ధర రూ. 1.11 అని వెల్లడించింది. ఇది దాని స్వంత విలువ కంటే ఎక్కువ.

1922 నుండి చెలామణిలో ఉన్న ఒక రూపాయి నాణేన్ని స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేస్తారు. ఇది 21.93 మిమీ వ్యాసం, 1.45 మిమీ మందం, 3.76 గ్రాముల బరువు ఉంటుంది. 

2018లో గణనీయంగా నాణేల ముద్రణ జరిగినట్లు ఆర్టీఐ ద్వారా తేలింది. 2015 నుంచి 2016 మధ్య కాలంలో అత్యధికంగా 2151 మిలియన్ నాణేలు చెలామణిలోకి వచ్చినట్లు వెల్లడైంది. ఇక గతేడాదితో పోల్చితే, ఈ ఏడాది తయారైన ఒక రూపాయి నాణేల సంఖ్య 903 మిలియన్ల నుంచి 630 మిలియన్లకు తగ్గింది. 

ఇంకో విషయం.. రెండు రూపాయల నాణెం, ఐదు రూపాయల నాణెం, 10 రూపాయల నాణెం తయారీకి ఖర్చ చాలా తక్కువ. 

  • రూ.2 నాణెం ముద్రణ ధర రూ.1.28,
  • రూ.5 నాణెం ముద్రణ ధర రూ.3.69,
  • రూ.10 నాణెం తయారీకి ఖర్చు రూ.5.54. 

ఒక రూపాయి నాణేలను ముంబై, హైదరాబాద్‌లోని ఇండియన్ గవర్నమెంట్ మింట్ (IGM) ముద్రిస్తుంది. 

కరెన్సీ నోటు తయారీ ఖర్చు ఎంత? 

కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ఖర్చు అనేది వాటి డినామినేషన్లపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, రూ. 2,000 కరెన్సీ నోటు ముద్రించడానికి రూ. 4 ఖర్చు అవుతుంది. అదే రూ. 10 విలువ యొక్క 1,000 నోట్లను ప్రింట్ చేయడానికి దాదాపు రూ. 960 ఖర్చవుతుంది.

  • 100 రూపాయల 1,000 నోట్లను ప్రింట్ చేయడానికి అయ్యే ఖర్చు 1,770 రూపాయలు.
  • 200 రూపాయల 1,000 నోట్లను ప్రింట్ చేయడానికి అయ్యే ఖర్చు 2,370 రూపాయలు.
  • 500 రూపాయల 1,000 నోట్లను ప్రింట్ చేయడానికి అయ్యే ఖర్చు 2,290 రూపాయలు.