కన్నడ విజయం తెలంగాణలో సాధ్యమా? : దిలీప్‌‌ రెడ్డి

‘మానవ జీవితమే.. అయితే సవరణల లేదంటే అనుకరణల సముచ్ఛయం’ అన్నాడో మహానుభావుడు. పొరుగురాష్ట్రం కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఎంత ఉంటుంది? ఎలా ఉంటుంది? అసలు ఉంటుందా, ఉండదా? ఇదీ, ఇప్పుడు తెలుగునాట జోరైన చర్చ! ఇక్కడ కాంగ్రెస్‌‌ పరిస్థితి ఏంటి? అన్నది ప్రధానాంశం. తెలంగాణ శాసనసభకు ఆరు మాసాల్లో ఎన్నికలుండటమే ఇందుకు కారణం కావొచ్చు. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వాతావరణంలో పోలికలున్నాయా? నాయకత్వ స్వభావంలో సామ్యాలు, -వైరుధ్యాలున్నాయా? ఇవన్నీ చర్చకు వస్తున్న అంశాలే! ఇక్కడా సిద్ధరామయ్యలు, డీకే శివకుమార్‌‌లు ఉన్నారా? ఉంటే, ఎవరు వారు? లేకుంటే, అదే పెద్ద లోపమా? ముఖ్యమంత్రి పదవికి నువ్వా, నేనా అన్న స్పర్ధ, కర్నాటకలో ఎన్నికల గెలుపు తర్వాత మొదలైంది. ఇక్కడ ఎన్నికలకు ముందే జరుగుతోంది, అదీ ప్రధానమైన తేడా!

విజయం వరకు ఐక్యంగా సాగి..

కర్నాటకలో పోలింగ్‌‌ రేపనగా ఒక సోషల్‌‌ మీడియా పోస్టు నన్ను ఆకట్టుకుంది. న్యాయశాస్త్రంలో, సామాజి క అవగాహనలో కాకలు తీరిన ఓ తెలుగాయన పెట్టా రా పోస్టు. ‘కర్నాటకలో కాంగ్రెస్‌‌ గెలుపును ఇక కాం గ్రెస్‌‌ నాయకులే ఆపలేరేమో!’ అని. వ్యంగ్యం ధ్వనించే ఆ పోస్టు చదివితే, కర్నాటకలో కాంగ్రెస్‌‌ ఐక్యత కన్నా, నాకు తెలంగాణ కాంగ్రెస్‌‌లో అనైక్యతే ఠక్కున గుర్తొచ్చింది. ఎందుకంటే, పార్టీని గెలిపించగలిగే వారికన్నా ఓడించగలిగిన నేతల సామర్థ్యమ్మీద జనాలకు నమ్మకం ఎక్కువ! మరి, కర్నాటక ఎన్నికల ఫలితాల నుంచి తెలంగాణ కాంగ్రెస్‌‌ పాఠమో, గుణపాఠమో ఏదైనా నేర్చుకోవాలనుకుంటే, ఐక్యతకు మించి ఏముంటుంది? నువ్వా, నేనా అన్నట్టు సాగిన కన్నడ ఎన్నికల సంగ్రామంలో కాంగ్రెస్‌‌ పార్టీ స్పష్టమైన, అబేధ్యమైన విజయం సాధించింది. పాలక బీజేపీ ఘోర పరాజయాన్నే మూటగట్టుకుంది. మరే పొరుగు రాష్ట్రానికీ తగ్గనంత జోరు అంతర్గత కుమ్ములాటలుండే కన్నడ కాంగ్రెస్‌‌లో ఈ సారి ఐక్యత సాధ్యమైంది. చివర్లో కాంగ్రెస్‌‌ అగ్రనేతల మధ్య పొరపొచ్చాలకు ప్రత్యర్థులు ఆస్కారం కలిగించినా.. ‘అదంతా దుష్ప్రచారమ’ని సదరు నేతలే ముక్తకంఠంతో ఖండించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం కోసం పంతాల బాటలో ఢిల్లీకి చేరి, మకాం వేశారు కానీ, ఎన్నికల ముందు ఏకత్వాన్ని చాటారు. అంతటి గెలుపు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్‌‌ పార్టీకి స్ఫూర్తినిచ్చి, కొత్త ఉత్సాహాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. ఎటొచ్చీ, రేపటి ఎన్ని కల్లో.. అందివచ్చే అవకాశాన్ని దొరకబుచ్చుకోవడానికి కాంగ్రెస్‌‌ సన్నద్ధంగా ఉందా? ఉంటుందా? అన్నది ప్రశ్న! తలోదారిగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌‌ నాయకులందరినీ ఏకతాటిపై నడిపేదెవరు? కాంగ్రెస్‌‌ ఢిల్లీ నాయకత్వం పోషించగల పాత్ర ఏంటి? ఐక్యతా రాగం పాడి, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రజలు వద్దనుకుంటే, తాము బలమైన ప్రత్యామ్నాయం అందించగలమని ప్రజల్లో తెలంగాణ కాంగ్రెస్‌‌ విశ్వాసం కలిగించగలదా? ఇవన్నీ సమాధానం అంత తేలిగ్గా లభించని జటిల ప్రశ్నలే!

భూమిక ఏర్పడితేనే....

తెలంగాణ ఏర్పడ్డాక వరుసగా రెండు పర్యాయాలు ఎన్నికై, పాలన సాగిస్తున్న బీఆర్‌‌ఎస్‌‌(అంతకు ముందు టీఆర్‌‌ఎస్‌‌) ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందనే ఓ రాజకీయ పరికల్పన ప్రచారంలో ఉంది. అదెంత వరకు నిజం? అన్నది సాపేక్షంగా నిర్ధారణ కావాల్సిన అంశం. ఎన్నికల ముందు అన్ని పార్టీలు జరిపే విస్తృత‌‌ ప్రచారాల క్రమంలో.. బీఆర్‌‌ఎస్‌‌ను ఎందుకు ఓడించాలి? కాంగ్రెస్‌‌నో, మరొకరినో ఎందుకు ఎన్నుకోవాలి? అన్న ప్రశ్నలు ప్రజాక్షేత్రంలో పుడతాయి. ఓ చర్చ జరుగుతుంది. వాటికి లభించే సమాధానాలు, సంతృప్తి, జనానికి కలిగే విశ్వాసం తదితరాంశాల్ని బట్టే ఎన్నికల ఫలితాలుంటాయి. దక్షిణాదిలో బీజేపీకి కీలక రాష్ట్రమైన కర్నాటకలో వారి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గడిచిన ఆరు మాసాల్లో జరిగిన దాదాపు డజన్‌‌ సర్వేల్లోనూ విస్పష్టంగా, నిలకడగా ఇది వ్యక్తమైంది. ఒక ప్రభుత్వాన్ని వద్దనుకున్నపుడు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌‌ పార్టీ మాత్రమే ప్రజలకు కనిపించింది. ప్రాంతీయ రాజకీయ శక్తిగా జేడీ(ఎస్‌‌) ఉన్నా.. గత అనుభవాల దృష్ట్యా ప్రజలు అటు మొగ్గలేదు. బీజేపీని ఓడించాలనే పట్టుదలే కాంగ్రెస్‌‌కు తిరుగులేని మెజారిటీ నిర్ధారించింది. అలాంటి పరిస్థితులు తెలంగాణలో, సన్నద్ధత కాంగ్రెస్‌‌ పార్టీలో ఉన్నాయా? అన్నది తెరపైకి వస్తోంది. పైగా కాంగ్రెస్‌‌ ఇక్కడ ఎదుర్కొనేది మరో జాతీయ ప్రధాన స్రవంతి పార్టీ బీజేపీని కాదు, బలమైన ప్రాంతీయ శక్తి బీఆర్‌‌ఎస్‌‌ను. సదరు బీఆర్‌‌ఎస్‌‌ను ఇక్కడ తనతో పాటు బీజేపీ ఎదుర్కొంటోంది. పైగా, బీఆర్‌‌ఎస్‌‌కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2019 లోక్‌‌సభ ఎన్నికలు, మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌ ఎన్నికల్లో.. బీజేపీయే మెరుగైన ఫలితాలు సాధించింది. కాబోయే ముఖ్యమంత్రిగా సగటున 40 శాతం మంది రాష్ట్ర ప్రజల ఆదరణ కలిగిన ఓ సిద్ధరా మయ్యనో, కేసులు ఎదుర్కొంటూ, సంస్థాగత నిర్వహణ వ్యయం భరిస్తూ పార్టీ శ్రేణుల్ని ఒక్కతాటిపై ముందుకు నడిపే ఓ డీకే శివకుమారో తెలంగాణ కాంగ్రెస్‌‌లో లేరు. రేపు గెలిపించినా, ఎమ్మెల్యేలు పార్టీలోనే ఉండి గట్టిగా నిలబడతారనే విశ్వాసం కూడా ప్రజల్లో లేదు! ఈ పరిస్థితుల్ని అధిగమించి, రాష్ట్రంలో ఒక భూమికను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌‌ పార్టీకి ఉంది.

-ఏ వర్గాలు కలిసొస్తాయి?

రాజకీయ సమీకరణాల్లో ఏయే సామాజిక వర్గాలు కాంగ్రెస్‌‌ పార్టీతో కలిసొస్తాయి? అన్నది కూడా కీలక ప్రశ్నే! దేశ వ్యాప్తంగా, ఉత్తరప్రదేశ్‌‌ వంటి ఒక‌‌టి రెండు చోట్ల మినహాయిస్తే, ప్రాంతీయ శక్తులు బలంగా ఉన్నచోట బీజేపీ పెద్దగా దూసుకుపోవట్లేదు. బీజేపీకి వ్యతిరేకంగా మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు ఆయా ప్రాంతీయ శక్తులతో ఉండటమే దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌‌ను కొంత బలహీనపరిచింది. ఇందుకు భిన్నంగా కర్నాటక తాజా ఎన్నికల్లో, జేడీ(ఎస్‌‌)ను కాదని ముస్లింలు కాంగ్రెస్‌‌తో కలిసి రావటం వారికి లాభించింది. తెలంగాణలో ముస్లింలు బీఆర్‌‌ఎస్‌‌ను కాదని కాంగ్రెస్‌‌ వైపు వస్తారా? ఇక్కడా ప్రజా వ్యతిరేకత బలంగా ఉండి బీఆర్‌‌ఎస్‌‌ చతికిల పడుతుందనో, బీజేపీ బాగా పుంజుకుంటుందనో అనుమానం కలిగితే ముస్లింలు తిరిగి కాంగ్రెస్‌‌ వైపు వచ్చే ఆస్కారముంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానో, ఇతరేతర కారణాలో ప్రస్తుతం బీఆర్‌‌ఎస్‌‌తో ఉన్న దళిత వర్గాల్లో మెజారిటీ ఎటు మొగ్గుతుందన్నదీ ప్రశ్నే! తెలంగాణలో టీడీపీ బలహీనపడ్డాక బీసీల్లో, ముఖ్యంగా కొత్త తరం స్థానిక నాయకులు-, కార్యకర్తల శ్రేణి బీజేపీ వైపు చూస్తోంది. నాయకత్వ పరమైన నిర్దిష్ట హామీతో వారిని కాంగ్రెస్‌‌ తన వైపు తిప్పుకునే ఆస్కారం ఉందా? వరంగల్‌‌ ‘వ్యవసాయ’ డిక్లరేషన్‌‌తో రైతాంగాన్ని, ఎల్బీనగర్‌‌ ‘యువ’ డిక్లరేషన్‌‌తో యువతరాన్ని కాంగ్రెస్‌‌ నిజంగా ఆకట్టుకోగలిగితే.. కర్నాటక బాటలో తెలంగాణలోనూ కాంగ్రెస్‌‌ బలపడే ఆస్కారం ఉంటుంది. అది రానున్న ఆరు మాసాల కాలం నిర్ణయిస్తుంది.

పౌర చేతన జత కూడేనా?

కేంద్రంలో, తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ అధికారంలో ఉన్నపుడు పౌరసమాజం కాస్త చైతన్యవంతంగా ఉంటుంది. ఆ పార్టీ కొంత ప్రజాస్వామ్య పంథాలో సాగటం కారణం కావచ్చు. లోక్‌‌నాయక్‌‌ జయప్రకాశ్‌‌ నారాయణ వంటి నాయకుల నుంచి అన్నా హజారే, వావిలాల గోపాలకృష్ణయ్య, రోషమ్మ, మల్లాది సుబ్బమ్మ వరకు లోగడ ఎందరెందరో సామాజిక చైతన్యాన్ని రగిల్చి ఆయా కాలాల్లోని కాంగ్రెస్‌‌ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జనాభిప్రాయాన్ని కూడగట్టారు. అది ప్రత్యర్థి పక్షాలకు రాజకీయంగా మేలైంది. అలాంటి ఓ కార్యాచరణే ఈ సారి విచిత్రంగా కర్నాటకలో చోటుచేసుకుంది. బీజేపీని దాని విధానాలను, దోరణులను వ్యతిరేకిస్తున్న వందకు పైగా ప్రజా సంస్థలు సంఘటితమై రాజకీయ వాతావరణాన్ని నిర్దేశించడంలో పౌరసమాజం గొప్ప భూమిక నిర్వహించింది. అది పరోక్షంగా కాంగ్రెస్‌‌కు లాభించింది. తెలంగాణలో ఇప్పుడు ప్రజాసంఘాలతో సమన్వయంగా పనిచేసే చొరవ కాంగ్రెస్‌‌లో లోపించింది. ఇప్పటికే బలహీనపడ్డ కమ్యూనిస్టులు పాలక బీఆర్‌‌ఎస్‌‌తో చేతులు కలిపినా, ఇంకా గట్టిగా కలిపే ఆస్కారం ఉన్న పరిస్థితుల్లో ఇతరేతర పౌరసమాజంతో ప్రత్యక్ష, పరోక్ష సమన్వయాన్ని పెంచుకోవడం టీపీసీసీకి ఓ రాజకీయ అవసరం. ఆశల కన్నా, ఆకాంక్షల కన్నా.. అవసరాలను గుర్తించి నడుచుకోవడంలోనే రాజకీయ పార్టీల తెలివి ఆధారపడి ఉంది. 
దాన్ని బట్టే ఫలితాలు!

-  దిలీప్‌‌ రెడ్డి, పొలిటికల్‌‌ ఎనలిస్ట్‌‌, పీపుల్స్‌‌ పల్స్‌‌ రీసెర్చ్‌‌ సంస్థ,