హైదరాబాద్‍ టూ మేడారం .. బస్సు చార్జీలు ఎంతంటే ?

 ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరపై టీఎస్‍ఆర్టీసీ స్పెషల్‍ ఫోకస్‍ పెట్టింది. 2022 జాతర సమయంలో కరోనా టెన్షన్‍తో 3,845 బస్సులు నడిపి సుమారు 25 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించింది. ఈసారి కరోనా లేకపోవడమే కాకుండా మహిళలకు ఫ్రీ జర్నీ అవకాశం ఉండడంతో కోటీ 30 లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 35 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేయడమే లక్ష్యంగా 6 వేల బస్సులను నడపనున్నట్టు ఆ సంస్థ ఎండీ వీసీ.సజ్జనార్‍ ప్రకటించారు. 

జాతర జరిగే ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు లక్షలాది మంది ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో 9 రీజియన్ల పరిధిలోని బస్సులను ఇటే నడిపించేలా ప్లాన్​ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‍, హైదరాబాద్‍, రంగారెడ్డి, కరీంనగర్‍, ఖమ్మం, ఆదిలాబాద్‍, నిజామాబాద్‍తో పాటు మహారాష్ట్ర నుంచి మొత్తం 51 పాయింట్ల ద్వారా ఈనెల 18 నుంచి పెంచిన ప్రత్యేక బస్సులను నడపనున్నారు. గ్రేటర్‍ హైదరాబాద్‍ పరిధిలో 2,650 బస్సులు నడుస్తుండగా..ఈ నెల 20 నుంచి 25 వరకు ఇందులోని 2200 బస్సులను మేడారం జాతరకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. 

రెండేండ్ల కింద జరిగిన మేడారం మహాజాతరతో పోలిస్తే..ఈసారి జాతరకు ఆర్టీసీ బస్సు చార్జీలను  పెంచారు. డీజిల్‍ ధరలు పెరగడంతో టిక్కెట్‍ రేట్లను కొంతవరకు పెంచాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఎక్స్​ప్రెస్​ బస్సుల్లో వరంగల్‍ నుంచి మేడారానికి ఒక్కొక్కరికి రూ.190 ఉండగా..దానిని ఇప్పుడు రూ.250కి పెంచారు. అలాగే హైదరాబాద్‍ నుంచి ఒక్కొక్కరికి ఎక్స్​ప్రెస్​ బస్సుల్లో రూ.440 ఉండగా రూ.550 చేశారు.