నిద్ర భగవంతుడు మనకిచ్చిన ముఖ్యమైన వరాల్లో ఒకటి. అలసిన శరీరాన్ని సేదతీర్చేది నిద్ర. గడిచిపోయిన జీవితంలోని మంచి చెడులను, కష్ట సుఖాలను మరిచిపోయేలా చేసేది నిద్రే.. ఆహారం లేకపోయిన ఉండచ్చేమో కానీ.. కంటి నిండ నిద్ర లేకపోతే మనిషి సుఖంగా ఉండలేడు. నిద్ర వల్ల విశ్రాంతిని పొందడమే కాదు మన శరీరంలోని అతి ముఖ్యమైన పనులకు సహాయపడుతుంది. ఇంతకీ నిద్ర మనిషికి ఎందుకు అవసరం. ఏఏ వయుసులో ఎంతసేపు నిద్రపోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం లేచింది మొదలు అనేక ఒత్తిడిలతో జీవనం గడిపేవారు నిద్రలేమిని ప్రధాన సమస్యగా ఎదుర్కొంటున్నారు. ఫలితం శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలెన్నో చుట్టుముడుతున్నాయి. నిద్రలేమి చాలా ఆరోగ్య సమస్యలకు హేతువు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ఎవసరమో నిద్ర కూడా అంతే అవసరం. రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే తరువాతి రోజు పనిలో నిరాశత్వంగా, మందకోడిగా ఉంటారు. పైగా పగటిపూట నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది. ఏపని సరిగ్గా చేయలేరు. సరైన నిద్ర లేకపోతే పిల్లల్లో ఏకాగ్రత కొరవడుతుంది. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.
నిద్ర అలసిపోయిన శరీరానికి విశ్రాంతినిచ్చి తిరిగి మరుసటి రోజు పనికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఎన్నో గాయాల నుంచి శరీరం తనలో తాను మరమ్మత్తు చేసుకునేందుకు సహాయపడుతుంది. మంచి ఆరోగ్యంతో ఉండాలంటే రోజుకి 8 గంటలు నిద్ర అవసరం.
ఏవయసు వారికి ఎంత నిద్ర అవసరం..
- నవజాత శిశువులు : అప్పుడే పుట్టిన పిల్లలు దాదాపు 18 గంటలు నిద్రపోవడం చాలా అవసరం.
- 4 నుంచి11 నెలల శిశువులు : వీరు సాధారణంగా రోజుకి 1- 15 గంటలు నిద్రపోవడం చాలా అవసరం.
- 3 నుంచి 5 సంవత్సరాలు ఉన్న పిల్లలు : 13 గంటలు నిద్రపోవడం చాలా అవసరం.
- 6 నుంచి 12 ఏళ్ల పిల్లలు : పాఠశాలకు వెళ్లే పిల్లలకు కనీసం 9-12 గంటల నిద్ర అవసరం.
- 13 నుంచి 18 సంవత్సరాలు వయసులో: ఈ వయసు గల పిల్లలు సుమారు 8 గంటల నిద్ర అవసరం.
- 18 నుంచి 60 ఏళ్లు వయసు ఉన్నవారు: ఈ వయసు గల వారు రోజుకి కనీసం 7-9 గంటలు నిద్రపోలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- 60 ఏళ్ల పైబడిన వారైతే వీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ వయసు వారు ఖచ్చితంగా 7-8 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నిద్రలేమి సమస్యను అధికమించి నాణ్యమైన నిద్రకోసం ప్రయత్నించడం ద్వారా నాణ్యమైన జీవితాన్ని అందుకోవచ్చు. ఇందుకోసం కొన్నిజాగ్రత్తలు తప్పనిసరి. రోజూ ఒకటే వేళ నిద్రకు ఉపక్రమిస్తూ ఉండాలి. కొంతమందికి తొందరగా పడుకున్న ఎంతసేపైన నిద్రపట్టదు. అలా ఎంత సేపు పడుకున్న పెద్దగా ప్రయోజనం ఉండదు. గాఢంగా 4-5 గంటలు నిద్రపోయిన అది చాలా ప్రయోజనం కలిగిస్తుంది. నిద్రకు ముందు కాఫీ, టీ, ధూమపానం తాగకూడదు. సెల్ ఫోన్, టీవీలు బెడ్ మీద చూడకూడదు. నిద్ర విషయంలో ఏ సమస్య వచ్చిన వైద్యుడిని సంప్రదించి కారణం తెలుసుకుని మంచి పరిష్కారాన్ని పొందడం తప్పనిసరి.