మూడు మూల సిద్ధాంతాలే పునాదిగా చేసుకొని పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రం సాధించడం ఒక ఎత్తైతే, దాని పునర్నిర్మాణం మరో ఎత్తు. ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేసింది ప్రభుత్వ ఉద్యోగాల కోసమే. కానీ పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ‘త్వరలో ఉద్యోగాల భర్తీ’ అన్న వార్తలు వినివినీ నిరుద్యోగులకు విసుగొచ్చేసింది. ఏదైనా ఎన్నికలు వచ్చినప్పుడు ఉద్యోగాల భర్తీ అంటూ ప్రకటనలు చేయడం రివాజైపోయింది. సగటు తెలంగాణ నిరుద్యోగి ఆశలన్నీ వదిలేసుకుని, ప్రభుత్వాన్ని నమ్మలేని స్థితి వచ్చినంక వారం క్రితం 50 వేల పోస్టులు భర్తీకి చర్యలు చేపట్టాలని స్వయంగా సీఎం కేసీఆర్.. సీఎస్‌ను ఆదేశించారు. చివరికి అన్ని శాఖల్లో కలిపి 45,281 ఖాళీలు ఉన్నాయని తేల్చారు. నిరుద్యోగులందరూ నోటిఫికేషన్లు రావడమే తరువాయి అనుకొనేంతలోపే, మళ్లీ ఆ ప్రక్రియ మొదటికొచ్చింది. రెండు రోజులు కేబినెట్లో చర్చించినా ‘కొండను తవ్వి ఎలుకను పట్టిన’ చందంగా నియామకాల గురించి ఏమీ తేల్చలేకపోయారు.
నాడు సమైక్య పాలనలో తెలంగాణ ప్రజానీకం పొట్టచేత పట్టుకొని ‘బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి’లకు వలసవెళ్తే, నేడు కొట్లాడితెచ్చుకున్న సొంత రాష్ట్రంలో చదువును మాత్రమే నమ్ముకున్న విద్యావంతులు ఉపాధి కోసం దేశం నలుమూలలా దేవులాడుతున్నారు. ఇటీవలి కాలంలో బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, త్రిపుర తదితర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్లు ఇచ్చాయి. తెలంగాణ నుంచి నెట్/స్లెట్ పాసైన వారు, పీహెచ్‌డీ పట్టా పొందినవారు ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేశారు. పలు సెంట్రల్, డీమ్డ్, ప్రైవేట్ యూనివర్శిటీల్లో ఉద్యోగాలకు కూడా అప్లై చేస్తున్నారు. ఇలా తెలంగాణ బిడ్డలు ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు/యూనివర్సిటీల్లోని ఉద్యోగాలకు పోటీ పడుతున్నారంటే, స్వరాష్ట్రంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
నిరుద్యోగుల ఆకాంక్షలు, ఆశయాలు
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర వెలకట్టలేనిది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారికి ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయని ఎన్నో ఆకాంక్షలతో, రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ తెలంగాణ వచ్చి.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చాలా తక్కువ సంఖ్యలోనే ఉద్యోగ నియామకాలు జరిపినందు వల్ల, నేడు నిరుద్యోగులు ‘ఉద్యోగమో రామచంద్రా!’ అని ఘోషిస్తున్నారు. ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజి, టీఎస్‌పీఎస్‌సీ వెబ్ సైట్లలో సుమారు 25 నుంచి 30 లక్షల వరకు నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గ్రూప్-1 పోస్టులకు 2011లో, జూనియర్ లెక్చరర్ పోస్టులకు 2008లో, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు 2013లో, గ్రూప్-2 పోస్టులకు 2016లో చివరిసారిగా నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇక టీఎస్‌పీఎస్‌సీ చేపట్టిన 36 వేల పైచిలుకు ఉద్యోగాల్లో మెజారిటీ శాతం టెక్నికల్ కు సంబంధించినవే. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 నుంచి 61 ఏండ్లకు పెంచి యువత ఆశలపై నీళ్లు చల్లింది. తెలంగాణ వచ్చాక బార్డర్లు, బోర్డులపై రాతలు మారాయి తప్ప నిరుద్యోగుల తలరాతలు మారలేదు. కొత్తగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పడటంతో భారీగా ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. సంవత్సరాలు గడిచి వయసు పెరుగుతోందే కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. ఆర్థికంగా, సామాజికంగా ఎంతో మానసిక వేదన అనుభవిస్తూ కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నిక్లలో నిరుద్యోగులకు రూ.3,016 భృతి ఇస్తామన్న హామీ ఇంకా అమలు కాలేదు.
అసలు ఉద్యోగ ఖాళీలెన్ని?
సీఆర్ బిస్వాల్(పీఆర్‌సీ) కమిటీ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలోని 31 శాఖల్లో 4,91,304 ఉద్యోగాలకుగానూ 3,00,178 ఉద్యోగులే పనిచేస్తున్నారు. అంటే 1,91,126(39%) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం ఐదు కీలక శాఖలైన వైద్య, ఆరోగ్య శాఖలో 30,570, పాఠశాల విద్యలో 23,798, పోలీసు శాఖలో 37,182, పంచాయతీరాజ్ శాఖలో 12,628, రెవెన్యూ శాఖలో 7,961 ఖాళీలున్నాయి. ప్రస్తుతం ఉన్న వారిలో సుమారు లక్ష వరకు వివిధ స్థాయిల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. వారు శ్రమ దోపిడీకి గురవుతున్నారని గుర్తించిన బిస్వాల్ కమిటీ వారి వేతనాలు భారీగా పెంచాలని కూడా సూచించింది. కానీ ఉద్యమ సమయంలో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పిన కేసీఆర్, ఇప్పటికీ సమైక్య పాలకులు విధానాలనే అవలంబిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో కలిపి 2,979 అసిస్టెంట్ ప్రొఫెసర్/అసోసియేట్ ప్రొఫెసర్/ ప్రొఫెసర్ పోస్టులకు గానూ 827 మందే పనిచేస్తున్నారు. అంటే 72 శాతం(2,152) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2015లో 1,642 డిగ్రీ లెక్చరర్ పోస్టులు, 2017లో యూనివర్సిటీల్లో 1,061 టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చినా ఆ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుంది. ఉద్యోగాల భర్తీలో జాప్యం వల్ల పేదవారికి నాణ్యమైన ఉన్నత విద్య దూరమవడమే కాకుండా, రాష్ట్రంలో పరిశోధనలు కుంటుపడుతున్నాయి. సృజనాత్మకతతో కూడిన పరిశోధనలు నత్తనడకన సాగితే సమాజానికి, ప్రభుత్వానికి, ఇండస్ట్రీలకు మధ్య తీవ్ర అగాథం ఏర్పడుతుంది.
ఉద్యోగ కల్పనపై పిల్లిమొగ్గలు
2014 నుంచి ఇప్పటి వరకు లక్షా ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారని, మరో 14 లక్షల పైచిలుకు ఉద్యోగాలు టీఎస్-ఐ పాస్ ద్వారా ఏర్పాటైన 14 వేల కంపెనీల్లో ఇచ్చామని మంత్రులు పలు సందర్భాల్లో చెప్పారు. అయితే ప్రైవేట్ రంగంలోని ఉద్యోగాలు తెలంగాణ వారికి దక్కాయా లేక అన్ని రాష్ట్రాల వారికీ ఇచ్చారా అనే స్పష్టత లేదు. 2020లో రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 7% మాత్రమే అని రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తే, ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ నివేదికల ప్రకారం కనీసం డిగ్రీ పూర్తి చేసిన వారిలో నిరుద్యోగ రేటు 21.88% ఉందని పేర్కొంది. ఎవరెన్నిచెప్పినా, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తోందనేది ముమ్మాటికి నిజం. తెలంగాణ పునర్నిర్మాణం పేరిట రాజకీయ నిరుద్యోగులే బాగుపడ్డారు తప్ప విద్యావంతులైన నిరుద్యోగులు కాదు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నినాదాల్లో ‘నియామకాలు’ ఒక్కటి. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కు రెండోసారి అధికారం కట్టబెట్టినందుకైనా వారి నమ్మకాన్ని వమ్ము చేయవద్దు.
బహుముఖ వ్యూహం అవసరం
నిరుద్యోగ సమస్యను అంతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అవలంబించాలి. ఒకవైపు ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు శాశ్వత ప్రాతిపదికన నింపాలి. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాల్లో అన్ని శాఖల కార్యాలయాలు, అన్ని సంస్థలు నెలకొల్పి తగిన సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక్కటి చొప్పున డైట్ కాలేజీ, కృషి విజ్ఞాన కేంద్రం(కేవికే) నెలకొల్పాలి. వీటి ద్వారా యువతకు శాశ్వత ఉద్యోగావకాశాలు లభించడమే కాకుండా విద్యా, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక అభివృద్ధి సాధ్యం అవుతుంది. రాష్ట్రంలో రెండో ఎయిర్పోర్ట్, చర్లపల్లి రైల్వే టెర్మినల్, కాజీపేట్ లో వ్యాగన్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లను త్వరగా స్థాపిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కుతుంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోని మాదిరిగా గ్రామ సచివాలయ ఉద్యోగాలతోపాటు వార్డ్ స్థాయిలో వలంటీర్ల భర్తీకి పూనుకోవాలి. వాటిని ప్రొబెషన్‌తో కూడిన శాశ్వత ఉద్యోగాలుగా పరిగణిస్తే, భారీగా ఉద్యోగ కల్పన జరిగి నిరుద్యోగ సమస్య కొంతమేర తగ్గుతుంది. మరోవైపు ప్రైవేట్ రంగంలో 75% ఉద్యోగాలను తెలంగాణ వారికే ఇచ్చేలా ఏపీ మాదిరిగా చట్టం తేవాలి. సుప్రీంకోర్ట్ తీర్పుననుసరించి ప్రైవేట్ యాజమాన్యాలు ఉద్యోగులకు ‘సమాన పనికి సమాన వేతనాలు’ చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. నిరుద్యోగ భృతి హామీ అమలుకు విధి విధానాలు ఖరారు చేయడానికి సామాజిక, ఆర్థికవేత్తలతో కమిటీ వేయాలి. బిస్వాల్ కమిటీ పేర్కొన్న ఖాళీలన్నీ త్వరితగతిన నింపడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలి. నిరుద్యోగులు ఎప్పుడు ఉద్యోగాల్లో చేరి గౌరవంగా బతుకుతారో, అప్పుడే అమరవీరుల ఆశయాలు నెరవేరి, వారు కలలుగన్న బంగారు తెలంగాణ సాకారమవుతుంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగమే ప్రధానాంశం
2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్, ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్, పార్లమెంట్లో మద్దతు తెలిపిన పార్టీగా బీజేపీ ప్రచారం చేసుకున్నా, దానితో ఒనగూరే రాజకీయ ప్రయోజనం చాలా తక్కువే. ఆ ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యే అతి ప్రధానమైన అంశం కానుంది. ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉన్న నిరుద్యోగం 2023 వరకు జడలువిప్పే పెను ప్రమాదం పొంచివుంది. ఆ సమయానికి అన్ని పార్టీలు నిరుద్యోగ సమస్యనే ప్రధాన ఎజెండాగా చేసుకొని మేనిఫెస్టోలు రూపొందించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం వచ్చి పునర్వైభవానికి బాటలుపడాలన్నా, తెలంగాణలో కమలాన్ని వికసింప చేయాలనుకుంటున్న బీజేపీ అయినా నిరుద్యోగ సమస్య విరుగుడుకు ఆచరణ సాధ్యమయ్యే హామీలు ఇవ్వకతప్పకపోవచ్చు. మరోవైపు నిరుద్యోగం వల్ల రాబోవు ప్రమాదాన్ని టీఆర్ఎస్ ముందుగానే పసిగట్టినట్లయితే, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వడివడిగా అడుగులు వేయవచ్చు. రకరకాల కారణాల వల్ల ఉద్యోగకల్పనలో జరిగిన నష్టాన్ని రాబోయేకాలంలో పూడ్చుకొనే పనిలో నిమగ్నం కావచ్చు. మరోవైపు ‘ఉపాధి హామీ’ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు వారు ఒక జేఏసీగా ఏర్పడి.. వారిలో సుమారు వెయ్యి మంది హుజూరాబాద్ ఉపఎన్నికలో నిలబడతామని ప్రకటించడం, నిరుద్యోగ సమస్య శృతిమించితే జరగబోయే పరిణామాలకు ఒక తార్కాణంగా చెప్పవచ్చు.
- శ్రీరాములు గోసికొండ, అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్