చాలా మంది భగవంతునికి ముడుపు ద్వారా మొక్కులు చెల్లించుకుంటారు. స్వామి నా కోరిక తీరిన తరువాత ముడుపుతో దర్శనం చేసుకొని ముడుపు మొక్కులు చెల్లిస్తానని స్వామి వారికి చెల్లించాల్సిన మొక్కును ముడుపు కడతారు. అయితే అసలు ముడుపు అంటే ఏమిటి.. స్వామి వారికి ముడుపు ఎలా కట్టాలో తెలుసుకుందాం. . .
చాలా మంది తమ కోరికలు తీరాలని కోరుకుంటూ స్వామి వారికి ముడుపు కడతారు. మానవులు తమ జీవితములో ధర్మబద్ధమైన కార్యాలను ఆచరించాలి. ఇలా ధర్మబద్ధంగా ఆచరించే కార్యములు తీరడానికి లేదా సఫలీకృతం అవ్వడానికి ధర్మబద్ధమైన కోరికలు ఏర్పడతాయి. ఆ ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడం కోసం ముడుపులు కట్టడం శాస్త్ర సమ్మతమని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.
ధర్మబద్ధమైన కోరికలు అనగా పిల్లలకు మంచి విద్య కలగడం, సంతానం లేనివారికి సంతానం కలగాలని కోరుకోవడం, నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి కలగాలని, వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కలగాలని, అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం పొందాలని, అవివాహితులకు వివాహం కలగాలని వంటి ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి ముడుపులు కట్టడం శాస్త్ర సమ్మతమని పండితులు చెబుతున్నారు.
వేంకటేశ్వరస్వామికి ముడుపు కట్టాలని అనుకుంటే శనివారం రోజు ఉదయం ముందుగా వినాయకుడికి పూజ చేసి తర్వాత నిత్య దీపారాధన చేయాలి. మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతూ తమ సంకల్పం నెరవేరాలి అని కోరుకోవాలి. కొత్తది తెల్లటి వస్త్రం తీసుకుని తడిపి దానికి పసుపు రాసి ఆరబెట్టాలి. ఆ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమ రాసి అందులో 11 రూపాయలు లేదా మీరు మొక్కుకున్న ధనాన్ని వేసి స్వామివారిని స్మరించుకుంటూ మీరు ఎందుకు ముడుపు కడుతున్నారో మనఃస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకుని డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామి వారి ఫోటో ముందు పెట్టాలి. కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తాను అని ముందే స్వామి వారికి మాట ఇవ్వాలని పండితులు చెబుతున్నారు.