పైసలు ఇయ్యంది పల్లెల్లో ప్రగతి ఎట్ల సాధ్యం ?

పైసలు ఇయ్యంది పల్లెల్లో ప్రగతి ఎట్ల సాధ్యం ?

మూడంచెల పాలనా వ్యవస్థలో స్థానిక సంస్థలది కీలక పాత్ర. అలాంటి ప్రాధాన్యం కలిగిన లోకల్​గవర్నమెంట్​ను రాష్ట్రసర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. రాజ్యాంగ బద్ధంగా వాటికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా పెత్తనం చెలాయిస్తోంది. గ్రామాల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమం సర్పంచుల పాలిట శాపంగా మారింది. నేటి నుంచి ఈ నెల18 వరకు రాష్ట్రంలో ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ సర్కారు బిల్లులు ఇయ్యడం లేదని సర్పంచులెవరూ పనులకు ముందుకు రావడం లేదు. 

మొదటి విడత బకాయిలే రాలే..

ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభించిన కొత్తలో సర్పంచ్​లు రూ. లక్షల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేయించారు. ఇలా ఇప్పటి వరకు జరిగిన నాలుగు విడతల్లో సర్పంచులకు పల్లె ప్రగతి బకాయిలు రూ. లక్షల్లో రావాల్సి ఉంది. మొదటి విడత పల్లె ప్రగతి బకాయిలు రాని గ్రామ పంచాయతీలు కూడా రాష్ట్రంలో ఇంకా అనేకం ఉన్నాయి.  నెల నెలా రూ.40 వేల ఆదాయం గల చిన్న, చిన్న గ్రామ పంచాయతీల్లో కూడా సర్పంచ్​లు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు వరకు ఖర్చు పెట్టారు. సర్కారు ఆ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో వారంతా అప్పుల పాలయ్యారు.

ఆరు నెలల నుంచి పైసా లేదు..

కేంద్రం నుంచి వచ్చే నిధులను నిరుటి వరకు రాష్ట్ర ప్రభుత్వమే జీపీలకు వేసేది. సెంట్రల్ నిధులనే సెంట్రల్​ ఫండ్స్​పేరుతో ఒక నెల.. స్టేట్​ఫండ్స్​పేరుతో మరో నెల జీపీలకు వేస్తూ కాలం వెళ్లదీసింది. ఇలా జీపీలకు వచ్చి కేంద్ర నిధులను కూడా రాష్ట్ర సర్కారు డైవర్ట్​ చేసి పెత్తనం చెలాయించింది. 2022లో కేంద్ర ప్రభుత్వం సర్పంచ్, ఉపసర్పంచ్​లలో ప్రత్యేకంగా జాయింట్​అకౌంట్​తీయించింది. కేంద్ర నిధులను నేరుగా జీపీ అకౌంట్లలోనే వేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో నిధులు లేక గత ఆరు నెలలుగా జీపీలకు స్టేట్​ఫండ్​ ఒక్క పైసా కూడా వేయడం లేదు. 

కొత్తగా జీఎస్టీ వసూలు?

ఇప్పుడు జీపీలకు వస్తున్న నిధులు 2011జనాభా లెక్కల ప్రకారమే. ఈ లెక్కలు పూర్తయి 11 ఏండ్లు అయింది. ఇప్పుడు జీపీల్లో జనాభా దాదాపు రెట్టింపు అయింది. పెరిగిన జనాభా ప్రకారం నిధులు రావాల్సింది పోయి.. పాత వాటికే దిక్కులేని పరిస్థితి దాపురించింది. నెల నెలా ట్రాక్టర్ల ఈఎంఐలు, వాటి డీజిల్​ఖర్చులు, మల్టీ పర్పస్​వర్కర్ల జీతాలు, కరెంట్​ బిల్లులు, ఎంపీడీవోల వాహనాల డీజిల్​ఖర్చు, ఎంపీడీవో ఆఫీసులో కంప్యూటర్​ఆపరేటర్ల ఖర్చులు ఇలా అన్నీ పోను జీపీకి ఏ మాత్రం నిధులు మిగలడం లేదు. జీపీలకు స్టేట్​ఫండ్​ నెల నెలా ఇయ్యాల్సిన సర్కారు కొత్తగా గ్రామ పంచాయతీ పరిధిలో చేసే ఎంబీ రికార్డు పనులకు 2019 నుంచి 12 శాతం జీఎస్టీ వసూలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఏడాది మార్చి నుంచి ఎంబీ పనుల జీఎస్టీ బకాయిలు చెల్లించనిదే చెక్కులు క్లియర్​ చేయమని ఆఫీసర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పెండింగ్​ బిల్లుల గురించి సర్పంచ్​లు ప్రశ్నిస్తే.. మొన్న మంత్రులు హరీశ్​రావు, ఎర్రబెల్లి దయాకర్​ మీడియాతో మాట్లాడుతూ బదులిచ్చారు. సర్పంచులకు రావాల్సిన బకాయిల్లో ఉపాధి హామీ ​డబ్బులు కేంద్రం నుంచి రావాల్సి ఉందని, అందుకే బిల్లులు పెండింగ్​లో పడ్డాయని  చెప్పారు. అయితే ఫండ్స్​ రాష్ట్రానివి కానప్పుడు వాటికి ప్రొసీడింగ్స్​ రాష్ట్ర సర్కారు ఎట్ల ఇస్తది?  ఆ నిధులు మా పరిధిలోనివి కావు అని చెప్తున్న సర్కారు..వాటితోనే పూర్తి చేసిన రైతు వేదికలు, డంపింగ్​యార్డులు, శ్మశాన వాటికలు మేమే కట్టినం అని ఎట్ల చెప్పుకుంటుంది?

గత హామీల ఊసే లేదు..

రాష్ట్రంలో చాలా జీపీలకు బిల్డింగ్​లు లేక కిరాయి ఇండ్లళ్ల నడిపియాల్సి వస్తోంది. ఏకగ్రీవ జీపీలు 3 వేల పైచిలుకు ఉన్నాయి. వాటికి రూ.15 లక్షలు ఇస్తామన్న సర్కారు.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తాటికోల్ నా జీపీ పరిధిలో రూ.6 లక్షలతో 2020లో గ్రౌండ్​ ఏర్పాటు చేసుకున్నం. మొన్న అధికారులు ఆ గ్రౌండ్​ ముందు ఓ కమాన్​కట్టి... తెలంగాణ ప్రభుత్వ క్రీడామైదానం అని పేరు పెట్టారు. గ్రౌండ్​ఏర్పాటు చేసింది జీపీ నిధులతో, ఆ కమాన్​ కట్టిన నిధులు కూడా ఎన్ఆర్​ఈజీఎస్​పేసలే.. కానీ పేరు మాత్రం రాష్ట్ర సర్కారుది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోవాలి.
- జూలూరు ధనలక్ష్మి,
సర్పంచ్​ల ఫోరం 
రాష్ట్ర అధ్యక్షురాలు