భారతీయ నౌకాదళంలోకి ఐఎన్ఎస్ తుషిల్ చేరింది. రష్యాలోని కాలినిన్గ్రాడ్లో ఆ నౌకను జలప్రవేశం చేయించారు. క్రివాక్–3 క్లాస్ ఫ్రిగేట్‌కు చెందిన అప్‌గ్రేడ్ వెర్షన్ 1135.6 ప్రాజెక్టులో భాగంగా ఐఎన్ఎస్ తుషిల్ యుద్ధనౌకను తయారు చేస్తున్నారు. ఇప్పటికే సర్వీసులో ఉన్న ఆరు యుద్ధ నౌకల్లో మూడు తల్వార్ క్లాస్, మరో మూడు టెగ్ క్లాస్‌గా విభజించారు.
తల్వార్ క్లాస్ నౌకలను సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని బాల్టిస్కీ షిప్‌యార్డ్‌లో తయారు చేయగా, మిగిలిన మూడు నౌకలను కాలినిన్గ్రాడ్లోని యాంటర్ షిప్‌యార్డ్‌లో రూపొందించారు. ఇదే సిరీస్‌లో ఏడో యుద్ధనౌక ఐఎన్ఎస్ తుషిల్. ఈ నౌక తయారీకి 2016లో రోసోబోరన్ ఎక్స్పోర్ట్, భారత నౌకాదళం, భారత ప్రభుత్వం మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ నౌక పొడవు 125 మీటర్లు, బరువు 3900 టన్నులు. రష్యా, భారతదేశ టెక్నాలజీని ఉపయోగించి ఈ యుద్ధనౌకను రూపొందించారు. ఇందులో 33 శాతం మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేసిన పరికరాలనే వినియోగించారు.
Also Read : యునిసెఫ్ వ్యవస్థాపక దినోత్సవం.. ప్రత్యేక కధనం
ఈ నౌకలో ఉపయోగించిన పరికరాలను బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కేల్ట్రన్, నోవా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్, టాటా, ఎల్కోమ్ మెరైన్, జాన్సన్ కంట్రోల్ ఇండియా తదితర సంస్థలు తయారుచేశాయి.
తుషిల్ అంటే రక్షణ కవచం అని అర్థం. ఈ యుద్ధనౌకపై అభేద్య కవచ్ అనే నినాదం రాశారు. దీంతోపాటు నిర్భయ్, అభేద్య ఔర్ బల్ శీల్ (భయం లేనిది, అజేయమైంది, నిశ్చలమైంది) లక్షణాలతో ఈ తుషిల్ యుద్ధనౌక, దేశ తీరప్రాంత పరిరక్షణలో నౌకా వాణిజ్య పరిరక్షణలో తన వంతు పాత్ర పోషించనున్నది.