శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరగడంతో గురువారం సాయంత్రం పది గేట్లు ఎత్తి సాగర్ కు నీటిని విడిచిపెట్టారు. దీంతో శ్రీశైలం ఎడమ గట్టు అండర్ గ్రౌండ్ హైడల్ పవర్ స్టేషన్ లో విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తుండగా.. రాత్రి పదిన్నర గంటలకు మొదటి యూనిట్ టెర్మినల్ లోని నాలుగో ప్యానల్ లో మంటలు చెలరేగాయి. వీటిని అదుపు చేయడానికి అక్కడే డ్యూటీలో ఉన్న డీఈలు, ఏఇలు, ఇతర స్టాఫ్ తీవ్రంగా ప్రయత్నించారు. అదే టైంలో అక్కడి కి చేరుకున్న జెన్ కో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పటికే పొగ దట్టం గా అలుము కోవడంతో షిఫ్ట్ డ్యూటీ ఆఫీసర్లు, సిబ్బంది బయటకు పరుగుతీశారు. ప్రమాద సమయంలో ఇంజనీర్లు, ఇతర స్టాఫ్ కలిసి 24 మంది ఉండగా 15 మంది బయటకు రాగలిగారు. జీరో బేస్ నుంచి టన్నెల్ పైవరకు పొగతో నిండిపోగా తొమ్మిది మంది లోపలే చిక్కుకుపోయారు.