అమెరికా టారిఫ్ ​వార్​తో మనదేశానికి మేలే: ఇతర దేశాల ఎగుమతులు తగ్గి మనవి పెరిగే చాన్స్​

అమెరికా టారిఫ్ ​వార్​తో మనదేశానికి మేలే: ఇతర దేశాల ఎగుమతులు తగ్గి మనవి పెరిగే చాన్స్​

న్యూఢిల్లీ:అమెరికా   టారిఫ్​ వార్​తో ఇండియాకు మేలు జరుగుతుందని, మన ఎగుమతులు పెరుగుతాయని ఎనలిస్టులు చెబుతున్నారు. తాజాగా ట్రంప్​ ప్రభుత్వం కెనడా, చైనా, మెక్సికోపై సుంకాలను పెంచింది. దీనివల్ల ఆయా దేశాల నుంచి అమెరికాకు ఎగుమతులు తగ్గుతాయి. ఫలితంగా మనదేశం అమెరికాకు మరిన్ని వస్తువులు అమ్ముకోవచ్చని మార్కెట్​నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయం, ఇంజనీరింగ్, యంత్ర పరికరాలు, దుస్తులు,  రసాయనాలు, లెదర్​ఎగుమతులు పెరుగుతాయి. డోనాల్డ్ ​ట్రంప్ ​ మొదటిసారి ప్రెసిడెంట్​గా ఎన్నికయ్యాక చైనాపై సుంకాలు పెంచడంతో ఇండియా లాభపడింది.

ట్రంప్​ ప్రభుత్వం కెనడా, మెక్సికోపై విధించిన 25 శాతం సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. చైనీస్​ ఎగుమతులపై సుంకాలను 20 శాతానికి పెంచారు. దీనివల్ల ఇండియాలోని ఎన్నో రంగాలకు ప్రయోజనం కలుగుతుందని ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ ఎక్స్​పోర్ట్​ ఆర్గనైజేషన్స్​(ఎఫ్​ఐఈఓ)కు చెందిన ఎస్సీ రాల్హన్​ అన్నారు. సుంకాలను పెంచడం వల్ల అమెరికాకు ఎగుమతి చేసే వస్తువుల ధరలు పెరుగుతాయి. ఎగుమతులు తగ్గుతాయి. ఈ పరిస్థితి నుంచి భారత ఎగుమతిదారులు లాభపడవచ్చని రాల్హన్​ చెప్పారు. థింక్​ట్యాంక్​ జీటీఆర్​ఐ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని ప్రకటించింది. 

అమెరికాకు భారత్​ నుంచి ఎగుమతులు పెరుగుతాయని, అమెరికా నుంచి ఇండియాకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని పేర్కొంది. చైనాపై సుంకాలు పెంచడం వల్ల దిగుమతులు బలహీనపడుతాయని, ఇదే అదనుగా ఇండియా తన మాన్యుఫాక్చరింగ్​సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించింది. అయితే గతంలో కుదుర్చుకున్న వ్యాపార ఒప్పందాలను ట్రంప్​ గౌరవించలేదని, ఈసారి ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్​(ఎఫ్​టీఏ) కుదుర్చుకునేటప్పుడు ఇండియా జాగ్రత్తగా ఉండాలని జీటీఆర్​ఐ ఫౌండర్​ అజయ్​ శ్రీనివాస్తవ అన్నారు. 

టారిఫ్​లు తగ్గించడంతోపాటు మరిన్ని సదుపాయాలు కల్పించాలని అమెరికా ఇండియాను అడగవచ్చని, వీటిలో గవర్నమెంట్​ప్రొక్యూర్​మెంట్​ను ప్రారంభించడం, సాగు రాయితీలు తగ్గించడం, పేటెంట్​కు ఉన్న రక్షణలను బలహీనపర్చడం వంటివి ఉండొచ్చని వివరించారు. ఎఫ్​టీఏకు బదులు ఇండియా ‘జీరో ఫర్​ జీరో’ టారిఫ్ ​విధానాన్ని ఎంచుకోవడం మేలని సూచించారు. అమెరికా నుంచి వచ్చే ఇండస్ట్రియల్​ప్రొడక్టులపై సుంకాలను రద్దు చేస్తే, ఇండియా కూడా అలాగే చేయాలని అన్నారు.