పెరిగిన ధరల వల్ల ఏ చిన్న బిజినెస్ పెట్టినా.. లక్షల్లో ఖర్చవుతుంది. కానీ.. ఈ సందీప్ మాత్రం కేవలం 160 రూపాయలతో బిజినెస్ పెట్టాడు. ‘ఓహ్ అయితే సంపాదన కూడా వందల్లోనే ఉంది కాబోలు’ అనుకోవద్దు. వందలు.. వేలు.. లక్షలు దాటి ఇప్పుడు ఏడాదికి కోటిన్నర సంపాదిస్తున్నాడు. ఇంతకీ అతను చేసే బిజినెస్ ఏమనుకున్నారు? ఫ్లేవర్డ్ సాల్ట్ తయారుచేసి అమ్మడం. దీని గురించి చెప్పగానే చుట్టుపక్కల వాళ్లంతా ‘బీటెక్ చదివి ఉప్పు అమ్ముకోవడం ఏంటి?’ అని నవ్వారు. అలాంటి వాళ్లంతా ఇప్పుడు అతని సక్సెస్ చూసి ఆశ్చర్యపోతున్నారు.
సందీప్ పాండేది ఉత్తరాఖండ్. 2009లో ఢిల్లీలో బీటెక్ పూర్తిచేశాడు. ఏదో ఒక బిజినెస్ పెట్టాలనే కోరిక ఉండేది. దాంతో ఇంజినీరింగ్ కెరీర్‌ని విడిచిపెట్టి సొంతూరు నైనిటాల్‌కి వెళ్లిపోయాడు. బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి అక్కడే ఈటరీ(తినుబండారాలు దొరికే రెస్టారెంట్) ఏర్పాటుకు అన్నీ రెడీ చేసుకున్నాడు. తన కలలు వారం రోజుల్లో నిజం అవుతాయి అనుకునే టైంలోనే 2013లో ఉత్తరాఖండ్‌లో విపరీతమైన వరదలు వచ్చాయి. వాటివల్ల అతను పెట్టిన రెస్టారెంట్ మొత్తం నాశనం అయిపోయింది. దాంతో రెస్టారెంట్ ప్రారంభానికి ముందే మూతపడిపోయింది. అప్పటికే స్టాక్, సామాన్లు మొత్తం తెచ్చిపెట్టుకున్నాడు. వాటిని ఎవరికైనా అమ్మేద్దాం అనుకుంటే.. అది కూడా కుదర్లేదు. వరదల వల్ల అతని షాప్‌కు వెళ్లే దారి ఆరు నెలలపాటు మూసేశారు. దాంతో అన్నీ పాడైపోయాయి. ఆ నష్టం నుంచి కోలుకోవడానికి అతనికి చాలా టైం పట్టింది.
కొత్త ఆలోచన
వరదలు వచ్చిన మూడు నెలల తర్వాత ఒకరోజు అతను ఒక పొలం గుండా వెళ్తున్నాడు. సరిగ్గా అప్పుడే కొందరు మహిళా కూలీలు ఉల్లిపాయలు, పిస్యున్ లూన్(హిమాలయన్ ఫ్లేవర్డ్ సాల్ట్)తో రొట్టెలు తినడం గమనించాడు. పహాడీ ఉప్పుని సిల్బట్టా(సంప్రదాయ గ్రౌండింగ్ రాయి) మీద వేసి గ్రైండ్ చేసి పిస్యున్ లూన్ని తయారుచేస్తారు. వాళ్ల దగ్గరికి వెళ్లిన సందీప్‌కు కూడా ఆ రొట్టెలు, వెల్లుల్లి-– పచ్చిమిర్చి ఫ్లేవర్డ్ సాల్ట్ ఇచ్చారు. ఆ టేస్ట్ బాగా నచ్చింది సందీప్‌కి. అదే ఉప్పుతో కక్డీ (అర్మేనియన్ దోసకాయ) కూడా ఇచ్చారు. అది కూడా బాగుంది. అప్పుడు అతనికి పహాడీ సాల్ట్ వల్లే ఆ ఫుడ్‌కి అంత టేస్ట్ వచ్చిందని అర్థమైంది. వాళ్ల అమ్మ కూడా అతను పనిమీద టౌన్‌కి వెళ్లిన ప్రతిసారి ఆ ఉప్పుని ప్యాక్ చేసి ఇచ్చేది. దాంతో ఆ ఉప్పుతోనే బిజినెస్ చేయాలనే ఆలోచన తట్టింది.
మహిళలను భాగస్వాములుగా చేస్తూ..
అతనికి రొట్టెలు ఇచ్చిన ఆడవాళ్లు గిరిజనులు. అక్కడికి కూలీ పని చేయడానికి వచ్చారు. సందీప్ వాళ్ల గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. వాళ్లు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన100 రోజుల పని పథకంలో పనిచేస్తున్నారు. గుంతలు తీయడం, బండరాళ్లు మోయడం వాళ్ల పని. అందరికీ 270 రూపాయల రోజువారీ కూలీ. అయితే.. అక్కడి అవినీతి వ్యవస్థ వల్ల గ్రామ స్థాయిలో చాలా అవకతవకలు జరిగేవి. సకాలంలో కూలీ డబ్బు ఇచ్చేవాళ్లు కాదు. అందుకే ఆ ఉప్పుని కమర్షియల్‌గా మార్కెట్లోకి తీసుకురావడంతోపాటు అక్కడివాళ్లకు ఉపాధి కల్పించాలి అనుకున్నాడు. దాంతో 2013 ఆగస్టులో తన చిన్ననాటి ఫ్రెండ్స్ సౌరభ్ పంత్, యోగేంద్ర సింగ్‌లతో కలిసి ‘హిమ్‌ఫ్లా’ అనే స్టార్టప్ మొదలుపెట్టాడు. దాని ద్వారా అందరికీ హిమాలయన్ ఫ్లేవర్స్ పరిచయం చేశాడు.
నూరిన ఉప్పు
సందీప్ ఫ్లేవర్డ్ సాల్ట్ ప్రత్యేకత గురించి చెప్తూ...“ఈ రోజుల్లో ఎక్కువ కిచెన్లు మాడ్యులర్‌గా ఉన్నాయి. సంప్రదాయ సిల్బట్టా స్థానంలో గ్రైండర్లు, మిక్సర్లు వచ్చాయి. ఎలక్ట్రానిక్ మెషిన్లు మన పనులను సులభతరం చేసినప్పటికీ... వాటిలో గ్రైండ్ చేసిన ఫుడ్‌కి సిల్బట్టాల మీద వేసి నూరిన రుచి రాదు. మిక్సీ, గ్రైండర్లలో ఆర్పీఎం ఎక్కువగా ఉండడం వల్ల ఉప్పు వేడెక్కుతుంది. కానీ.. సిల్బట్టా మీద వేడెక్కదు. దాంతో నేచురల్ ఫ్లేవర్స్ పోకుండా ఉంటాయి. టేస్ట్ బాగుంటుంది. గ్రైండర్లో నాలుగైదు ఇంగ్రెడియెంట్స్ వేసి నూరితే.. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది. వాటిని బాగా మిక్స్ చేయలేదు. కానీ.. సిల్బట్టా వాడితే.. ఆయిల్స్, హెర్బ్స్, స్పైసెస్ బాగా బ్లెండ్ అవుతాయి. దానివల్ల టేస్ట్ పెరుగుతుంది. అందుకే సందీప్ సంప్రదాయ సిల్బట్టాలతో నూరిన ఫ్లేవర్డ్ సాల్ట్‌ని మార్కెట్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
160 రూపాయలతో..
సందీప్ తన మొదటి ప్రొడక్ట్స్‌ని మార్కెట్లోకి తెచ్చేందుకు చేసిన ఇన్వెస్ట్మెంట్ కేవలం160 రూపాయలు మాత్రమే. ఆ డబ్బుతో ఒక గ్రైండింగ్ రాయి, ఒక కొత్తిమీర కట్ట, పచ్చిమిర్చి కొన్నాడు. తమ ప్రొడక్ట్‌ని అమ్మడానికి సందీప్, అతని ఫ్రెండ్స్ స్థానికంగా జరుగుతున్న ఒక ఫెయిర్‌లో స్టాల్ పెట్టారు. వాళ్లు పెట్టిన ఫ్లేవర్డ్ సాల్ట్‌కి మంచి గిరాకీ వచ్చింది. ముఖ్యంగా.. అక్కడికి వచ్చిన టూరిస్ట్‌లకు అది బాగా నచ్చింది. స్టాక్ అంతా అయిపోయింది. వచ్చిన డబ్బుతో మళ్లీ స్టాక్ తెచ్చుకుని అమ్మారు. ఆ తర్వాత వాళ్ల ఊరికి దగ్గర్లో ఉన్న హల్వండి సిటీలో ఒక స్టాల్ పెట్టారు. అక్కడ కూడా బాగా గిరాకీ అయ్యింది. కేవలం ఏడు రోజుల్లోనే రెండు లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. పైగా ట్రెడిషనల్ ఫుడ్‌ని అందరికీ పరిచయం చేసినందుకు స్థానిక వార్తా పత్రికల్లో సందీప్ అండ్ కో గురించి ఆర్టికల్స్ కూడా రాశారు. దాంతో వాళ్లు ఆ ఏరియాలో చాలా ఫేమస్ అయ్యారు. ఆ ఆర్టికల్స్ వల్ల చాలామంది ఫోన్ చేసి ఆర్డర్లు ఇచ్చారు. అప్పటినుంచి సందీప్ వెనుదిరిగి చూడలేదు. రోజరోజుకూ బిజినెస్ పెరుగుతూ వచ్చింది.
ఎగుమతి చేసి...
ప్రస్తుతం ఉత్తరాఖండ్‌తోపాటు అనేక రాష్ట్రాలకు వాళ్ల ప్రొడక్ట్స్ ఎగుమతి అవుతున్నాయి. అంతేకాదు.. ప్రతి నెలా ఆస్ట్రేలియా, యుఎస్, యుకె, దుబాయ్, జర్మనీ, సింగపూర్, బ్రెజిల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి ‘హిమ్‌ఫ్లా’కు ఆర్డర్లు వస్తున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా సంవత్సరానికి దాదాపు 20 క్వింటాళ్ల ఫ్లేవర్డ్ సాల్ట్ తయారుచేస్తున్నారు.160 రూపాయలతో మొదలైన ఈ స్టార్టప్ వార్షిక ఆదాయం ప్రస్తుతం1.5 కోట్ల రూపాయలకు పైనే ఉంది.
52 ఫ్లేవర్స్
స్టార్టప్ పెట్టిన కొత్తలో కేవలం ఐదు ఫ్లేవర్స్ మాత్రమే తయారుచేసేవాళ్లు. గార్లిక్– గ్రీన్ చిల్లీ, గార్లిక్– రెడ్ చిల్లీ, గార్లిక్– ఎల్లో చిల్లీ, హెంప్, మింట్ మాత్రమే అమ్మేవాళ్లు. కానీ.. ఇప్పుడు హిమ్‌ఫ్లా నుంచి 52 ఫ్లేవర్స్‌ని తీసుకొచ్చారు. వీటిలో తైమూర్ (ఉత్తరాఖండ్‌లోని ఎత్తయిన హిమాలయ ప్రాంతాల్లో పండించిన స్జెచువాన్ మిరియాలు), హెంప్(ఇందులో ఒమెగా ఎక్కువగా ఉంటుంది) గాండ్రేని కాలా జీరా (నల్ల జీలకర్ర) లాంటివి బాగా ఫేమస్ అయ్యాయి.
మహిళలకు ఉపాధి
ప్రొడక్ట్స్ తయారీకి కావాల్సిన ముడిసరుకుల్లో ముఖ్యమైన పింక్ రాక్ సాల్ట్‌ని పాకిస్తాన్ నుంచి, మిగతా హెర్బ్స్, స్పైసెస్‌ని మాత్రం లోకల్ రైతుల దగ్గర కొంటున్నారు. నైనిటాల్, బాగేశ్వర్, చమోలి, అల్మోరా ప్రాంతాల్లోని100 గ్రామాల నుంచి వాటిని సేకరిస్తున్నారు. దీనివల్ల దాదాపు వెయ్యి మంది చిన్న రైతులు లబ్ధి పొందుతున్నారు. సేకరించిన ముడిసరుకులను ఫ్లేవర్డ్ సాల్ట్‌గా మార్చడానికి దాదాపు 80 మంది గ్రామీణ మహిళలు పనిచేస్తున్నారు. వాళ్లు ప్రతి రోజూ సిల్బట్టాపై సాల్ట్‌ని నూరుతారు.
ఇల్లు కట్టుకున్నా..
ఐదేండ్లుగా హిమ్‌ఫ్లాలో పనిచేస్తున్న మహిళల్లో ఒకరైన దీపా దేవి మాట్లాడుతూ.. “ఇదివరకు వ్యవసాయం చేసుకుంటూ కూలీ పనులకు వెళ్లేదాన్ని. పని దొరకనప్పుడు డబ్బుల్లేక ఇబ్బంది పడేవాళ్లం. ఒక్కోసారి నెలలో రెండు నుండి నాలుగు రోజులు మాత్రమే పని దొరికేది. కొన్నిసార్లు అసలే దొరికేది కాదు. అలాంటప్పుడు ఇంటి ఖర్చులకు కూడా డబ్బు ఉండేది కాదు. కానీ.. ఈరోజు మా ఇంటి పరిస్థితి మారిపోయింది. నాకు వచ్చే జీతంతో పక్కా ఇల్లు కట్టించుకున్నా. మా నానమ్మ అప్పుడప్పుడు ఈ ఫ్లేవర్డ్ సాల్ట్ తయారుచేసేది. ఎలా చేయాలో నాకూ చెప్పేది. అదే ఇప్పుడు నాకు జీవనోపాధిగా మారుతుందని ఊహించలేదు” అంటోంది. ఇప్పుడామె నెలకు10,000 రూపాయలు సంపాదిస్తోంది.
అందరూ వద్దన్నారు
‘‘ఫ్లేవర్డ్ సాల్ట్ ఐడియా గ్రామీణ మహిళల జీవితాలనే కాదు నా జీవితాన్ని కూడా మార్చేసింది. ఫ్లేవర్డ్ సాల్ట్ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు బంధువులతోపాటు మా ఫ్యామిలీ వాళ్లు కూడా వద్దన్నారు. మా నాన్న ఆర్మీలో ఉండేవారు. కుటుంబ సభ్యులకు బిజినెస్ గురించి చెప్పినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యారు. నా బంధువులు వెక్కిరించారు. మంచి ఉద్యోగం చేసుకోమని సలహా ఇచ్చారు. ఆర్మీ వాళ్లకు గౌరవం చాలా ముఖ్యం. సాల్ట్ అమ్మడం వల్ల మా కుటుంబ గౌరవం పోతుందేమో అనుకున్నారు. నేను తప్పు మార్గంలో వెళ్తున్నా. నాకు దెయ్యం పట్టింది అన్నారు. అయినా.. నేను మాత్రం వాళ్ల మాటలు పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్లా. నేను చేస్తున్న పని గురించి వార్తల్లో కనిపించిన ఆరు నెలలకు మావాళ్లు నేను వెళ్తున్న దారి సరైందే అని నమ్మారు. కానీ.. ‘‘అమెరికాలో ఉన్న నీ ఫ్రెండ్స్ కార్లు కొంటున్నారు. వాళ్లలా నువ్వు కూడా అమెరికా వెళ్లు” అని నన్ను ఇబ్బంది పెట్టారు. నాకు ఇక్కడే సంతోషంగా ఉంది. నా వల్ల ఇక్కడ కొన్ని కుటుంబాలు ఆర్థిక స్వాతంత్ర్యం పొందడాన్ని చూశా. అదే నాకు పెద్ద సక్సెస్‌లా అనిపించింది. ఈ పనివల్ల నా మనసుకు కలిగే సంతృప్తిని మరే సక్సెస్ ఇవ్వలేదని అర్థమైంది. నా వల్ల 80 కుటుంబాలు ప్రశాంతంగా నిద్రపోతున్నాయని తెలిసి నేను కూడా గుండె మీద చెయ్యేసుకుని హాయిగా నిద్రపోతున్నా” అంటున్నాడు సందీప్.