కొందరు ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా నిరాశలో ఉంటారు. ఇతరులతో పోల్చుకుని బాధపడిపోతుంటారు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. పాజిటివ్ ఆలోచనలు చేసేందుకే ప్రాధాన్యమివ్వండి. అలాగే మీకు ఆనందం కలిగించిన సందర్భాలను కుదిరినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోవాలి. చిన్నతనంలో చేసిన పనులు, కుటుంబ సభ్యులతో గడపడం... సంతోషం కలిగించిన సందర్బాలను తరచూ తలచుకోవాలి. మీకోసం మీరేం చేస్తున్నారనేదీ గమనించుకోవాలి. పనులూ, బాధ్యతలనే కాదు.... మీకంటూ కొన్ని అభిరుచులూ, ఆసక్తులూ ఉంటాయి కదా... వాటిని ఆచరణలో పెట్టేలా చూసుకోండి.
అంటే మీకు పాత పాటలు వినడం ఇష్టమా, ఎక్కడికయినా వెళ్తున్నప్పుడు హెడ్ఫోన్స్ పెట్టుకుని వాటిని వినండి. అలాగే కాసేపు ఏదయినా మంచి పుస్తకం చదవండి, సంగీతం అంటే ఇష్టమనుకుంటే శిక్షణ తీసుకోవడం మొదలెట్టండి. కష్టం అనుకున్న పనిని సాధించారా... ఒకటి రెండు కిలోల బరువు తగ్గారా... మీకు మీరు భుజం తట్టుకోవడమే కాదు ఆ విజయాన్ని ఇతరులతోనూ పంచుకోవడం వల్ల ఆనందం, ఉత్సాహం పెరుగుతుంది. మనకన్నా ఉన్నతంగా ఉన్నవాళ్లతో పోల్చుకోకుండా ఉన్నంతలో మనం ఎంతవరకూ బాగున్నామనే ఆలోచనలోనే ఆనందం ఉంటుంది.