ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ పీఎఫ్ ఖాతాలపై అవగాహన ఉండి ఉంటుంది. ఉద్యోగి యొక్క జీతంలో ప్రతి నెల కొంత మొత్తాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) అకౌంట్‌కు జమ చేస్తుంటారు. ఇది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. అయితే, ప్రతి నెల తమ ఖాతాలో ఎంత మొత్తం జమ అవుతోంది? ఇప్పటివరకు ఎంత ఉంది? అన్నది తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ అందుకు తగిన ప్రక్రియ తెలియక సతమతమవుతుంటారు. అలాంటి వారు కింది విధానాలను అనుసరించి క్షణాల్లో మీ పీఎఫ్ బ్యాలన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు 4 మార్గాలు
పీఎఫ్ఓ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు నాలుగు మార్గాలు ఉన్నాయి. మొబైల్ ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్, ఈపీఎఫ్ఓ పోర్టల్, ఉమాంగ్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే, ముందుగా పీఎఫ్ అకౌంట్‌కి మీ మొబైల్ నంబర్ అనుసంధానం అయి ఉండాలి. లేనియెడల సాధ్యపడదు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారానే ఈ సేవలను పొందేందుకు వీలుంటుంది. ఎవరైనా మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకోకపోతే ముందుగా దానిని అప్‌డేట్ చేసుకోవాలి.
వెబ్‌సైట్ ద్వారా
- ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ epfindia.gov.in ఓపెన్ చేయండి
- ఇప్పుడు హోమ్ పేజీలో సర్వీసెస్ ఆప్షన్ ఎంచుకొని.. For Employessపై నొక్కండి.
- అనంతరం సభ్యుని పాస్‌బుక్(Member Passbook)పై క్లిక్ చేయాలి.
- మీ UAN నెంబర్ మరియు పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి.
- ఇప్పుడు మీ పాస్‌బుక్ ఓపెన్ అయ్యి యజమాని వ్యక్తిగత విరాళాలు, మీరు ఇంతకుముందు పనిచేసినా/ పనిచేస్తున్న అన్ని వివరాలు అందులో కనిపిస్తాయి.
- ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అయితే వేర్వేరు ఐడిలతో మీ పిఎఫ్ బ్యాలన్స్ తనిఖీ చేయవచ్చు.
SMS ద్వారా
ఎస్ఎంఎస్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలన్స్ వివరాలు తెలుసుకోవాలంటే, మీ మొబైల్ నంబర్ తప్పనిసరిగా UANతో రిజిస్టర్ అయి ఉండాలి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899కి EPFOHO UAN ENG అని ఎస్ఎంఎస్ పంపాలి. కాసేపటి తరువాత మీ మొబైల్ కి ఓ సందేశం అందుతుంది. అందులో ఈపీఎఫ్ అకౌంట్ సహా అందులోని బ్యాలెన్స్ వంటి తదితర వివరాలన్నీ పొందుపరిచి ఉంటాయి.
ఈ సౌకర్యం ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం మరియు బెంగాలీ భాషలలో కూడా అందుబాటులో ఉంది.
మిస్డ్ కాల్ ద్వారా
మిస్డ్ కాల్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి, మీ మొబైల్ నంబర్ తప్పనిసరిగా UANతో రిజిస్టర్ అయి ఉండాలి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నుండి 9966044425కు మిస్డ్ కాల్ చేయడం ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మిస్డ్ కాల్ తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఈపీఎఫ్ఓ నుండి మెసేజ్ వస్తుంది. అందులో మీ పీఎఫ్ బ్యాలన్స్ వివరాలు ఉంటాయి.
ఉమంగ్ యాప్ ద్వారా
- ముందుగా Play Store నుండి UMANG యాప్ డౌన్ లోడ్ చేసుకొని అందులో రిజిస్టర్ అవ్వాలి.
- ఇప్పుడు UMANG యాప్ ఓపెన్ చేసి EPFOపై క్లిక్ చేయండి.
- ఇక్కడ View Passbook ఆప్షన్ ఎంచుకొని.. మీ UAN నంబర్ మరియు పాస్‌వర్డ్ (OTP) ఎంటర్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP(వన్ టైం పాస్‌వర్డ్) మీకు వస్తుంది.
- OTP ఎంటర్ చేయడం ద్వారా మీరు మీ PF బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.