కోతుల కంట్రోల్ ఎట్ల?.. తెలంగాణలో 35 లక్షలకు పైగా కోతుల మంద

  • నాలుగేండ్లలో 1,500 కోతులకే స్టెరిలైజేషన్
  • ఒక్కో కోతిని పట్టుకోవడానికి  రూ.వెయ్యి ఖర్చు 
  • ఫండ్స్ లేక చేతులెత్తేస్తున్న పంచాయతీలు, మున్సిపాలిటీలు
  • నానాటికీ పెరుగుతున్న కోతుల సంఖ్య.. ఇండ్లు, పంటలపై దాడులు

హైదరాబాద్/నిర్మల్, వెలుగు: రాష్ట్రంలో రోజురోజుకు కోతుల సంఖ్య పెరిగిపోతున్నది. కోతుల్లో సంతానోత్పత్తిని నియంత్రించే స్టెరిలైజేషన్ ​ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతున్నది. రాష్ట్రంలో 35 లక్షలకు పైగా కోతులు ఉంటే, నాలుగేండ్లలో కేవలం 1,500 కోతులకు మాత్రమే స్టెరిలైజేషన్ ​చేశారు. నిర్మల్​ జిల్లాలోని ఏకైక మంకీ రెస్క్యూ సెంటర్​లో ప్రతి నెలా కనీసం 500 కోతులకు స్టెరిలైజేషన్​(ఫ్యామిలీ ప్లానింగ్) చేసే అవకాశం ఉన్నా కోతులను పట్టి తెచ్చేవారే లేరు. ఫండ్స్​లేక పారిశుధ్య కార్యక్రమాలనే సక్రమంగా చేపట్టలేకపోతున్న గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు.. కోతులను పట్టి సెంటర్​కు తరలించడం తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నాయి. దీంతో కోతుల సంతతి అంతకంతకూ పెరిగి గ్రామాలు, పట్టణాల్లో విధ్యంసం కొనసాగుతున్నది. 

బర్త్ రేట్ ఎక్కువ.. డెత్ ​రేట్ తక్కువ 

మదర్ కేర్ ఎక్కువగా ఉండడంతో కోతుల్లో డెత్ రేట్ తక్కువగా ఉంటుంది. ప్రతి పది కోతి పిల్లల్లో 9 బతుకుతాయి. ఒక్కో ఆడ కోతి జీవిత కాలంలో పది పిల్లలకు జన్మనిస్తుంది. అందుకే కోతుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 35 లక్షలకు పైగా కోతులు ఉన్నాయి. వాటిని నియంత్రించకపోతే రాబోయే పదేండ్లలో రాష్ట్ర జనాభాను దాటేస్తాయని జువాలజిస్టులు చెబుతున్నారు. యాదాద్రి లాంటి కొన్ని జిల్లాల్లో కోతులు ఇప్పటికే జనాభాలో సుమారు 50 నుంచి 70 శాతానికి చేరుకోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. గిరిజన చిన్నారులు పౌష్టికాహారానికి దూరం కావడానికి ప్రధాన కారణం కోతులేనని ఐటీడీఏ ఆఫీసర్లు గతంలో చేసిన సర్వేల్లో తేలింది. కోతుల ప్రభావం ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటోంది.

Also Read :- అసైన్డ్ భూముల్లో వెంచర్లు.. ప్లాట్లుగా చేసి నోటరీపై అమ్మకాలు

 వాటి బాధ తట్టుకోలేక ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కుమ్రంభీం ఆసిఫాబాద్​, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం లాంటి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో గిరిజనులు మక్క, జొన్న, సజ్జ, పల్లి, పెసర తదితర ఆహార పంటలు, కూరగాయల సాగు వదిలేసి.. పత్తి, పొగాకు లాంటి పంటల వైపు మళ్లారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం రాష్ట్రంలో అత్యధిక పోషకాహార లోపం ఉన్న జిల్లాగా ఆదిలాబాద్ నమోదైంది. జిల్లాలో ఐదేండ్లలోపు పిల్లల్లో 38 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారు. ఈ జిల్లాలో ఆహార పంటలు సొంతంగా వేసుకుంటే పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపం చాలా వరకు తగ్గేది. కానీ కోతుల వల్ల అలాంటి పంటలు వేసుకునే అవకాశం లేకుండా పోతోందని ట్రైబల్​ వెల్ఫేర్​ ఆఫీసర్లు చెబుతున్నారు. 

కోతుల వల్ల 30 శాతం పంట లాస్.. 

గ్రామాల్లో తిష్టవేసిన కోతులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఆహారం కోసం పంట పొలాలపై దండయాత్ర చేస్తున్నాయి. పండ్లు, కూరగాయలు, వరి, మక్క, జొన్న, గోధుమ, పల్లి, కంది, సోయా, శనగ.. ఇలా అవి ధ్వంసం చేయని పంట అంటు లేదు. కోతుల మంద పండ్లు, కూరగాయల తోటల్లోకి వెళ్లిందంటే సర్వనాశనమే. రాష్ట్రంలోని వ్యవసాయ దిగుబడుల్లో 20 నుంచి 30 శాతం పంటను కోతుల వల్లే నష్టపోతున్నామని  అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెబుతున్నారు. వీటిని నియంత్రించకపోతే రాబోయే పదేండ్లలో 50 శాతం పంటకు గ్యారెంటీ ఉండదని హెచ్చరిస్తున్నారు. నల్గొండ, యాదాద్రి, మంచిర్యాల, కరీంనగర్​ లాంటి జిల్లాల్లో ఒకప్పుడు లక్షల ఎకరాల్లో మామిడి, జామ, సపోటా, బత్తాయి లాంటి ఉద్యానపంటలు సాగుచేసిన రైతులు.. కోతుల దెబ్బకు క్రమంగా తోటలు నరికేశారు. టౌన్లు, సిటీలు, మండల కేంద్రాల చుట్టూ ఒకప్పుడు పెద్ద ఎత్తున కూరగాయలు సాగుచేసిన రైతులు.. కోతుల కారణంగా సగానికి తగ్గించారు. చాలా జిల్లాల్లో మక్క, పల్లి, కంది, ఇతర పప్పుదినుసుల సాగు మానేసి.. ప్రత్యామ్నాయంగా పత్తి వైపు మళ్లారు. 

ఇండ్లలో రచ్చరచ్చ..

గ్రామాలు, పట్టణాల్లో కోతులు సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా తలుపులు తీసుకొని ఇండ్లలోకి దూరుతున్నాయి. సంచులు, డబ్బాలు, అన్నం గిన్నెలు.. ఇలా ఏది దొరికితే అది ఎత్తుకెళ్తున్నాయి. ఇంట్లో సామగ్రిని చిందరవందరగా చేస్తున్నాయి. ఒకప్పుడు గ్రామాల్లో ఇండ్ల ముందర జామ, మామిడి లాంటి పండ్ల చెట్లు, బీర, సోర, చిక్కుడు లాంటి తీగజాతి మొక్కలు పెంచేవారు. కానీ  పెరట్లో చెట్లు ఉంటే కోతులు వాటి మీద అడ్డా పెట్టి, ఇండ్లలోకి దూరుతున్నాయనే కారణంతో కొట్టేస్తున్నారు. మరోవైపు, కోతుల భయానికి కిరాణ దుకాణాదారులు వారి షాపులను ఐరన్​ గ్రిల్స్‌తో మూసేసి చిన్న కౌంటర్ ద్వారా సరుకులు అమ్మాల్సి వస్తోంది. ఒంటరిగా ఉన్నప్పుడు కొండెంగకు సైతం భయపడే కోతులు, గుంపులో ఉన్నప్పుడు  మనుషులపై ఎగబడ్తున్నాయి. ఇలా కోతుల దాడుల్లో రాష్ట్రంలో ఏటా వెయ్యి మందికి పైగా గాయపడ్తుండగా, పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. 

 నెలలో 30 ఆపరేషన్లు కూడా చేస్తలే.. 

రాష్ట్రంలో కోతుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడంతో 2020 డిసెంబర్ 20న అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మల్​లోని గండి రామన్న హరితవనంలో మంకీ రెస్క్యూ, రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇది రాష్ట్రంలో ఉన్న ఏకైక మంకీ రెస్క్యూ సెంటర్. వన్యప్రాణుల సంరక్షణ చట్టానికి లోబడి కోతులకు ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్​ఆపరేషన్లు చేయాలని నిర్ణయించారు. సెంటర్​లో ఒక డాక్టర్,  ఫార్మాసిస్టు, నలుగురు అటవీ సిబ్బందిని నియమించారు. అయితే కోతులను పట్టుకుని సెంటర్​కు తరలించాల్సిన బాధ్యతను ఆయా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు ప్రభుత్వం అప్పగించింది. వారు కోతులను పట్టి  మంకీ రెస్క్యూ సెంటర్ కు తీసుకువస్తే వాటికి స్టెరిలైజేషన్ చేసి.. అవి కోలుకున్న తర్వాత ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే వదిలేస్తారు. మంకీ రెస్క్యూ సెంటర్​లో స్టెరిలైజేషన్ చేసిన కోతులను గుర్తించేందుకు, వాటిని మళ్లీ పట్టుకోకుండా వాటి  నుదుటిపై టాటూలు వేస్తున్నారు. చాలాచోట్ల ఒక్కో కోతిని పట్టుకోవడానికి మంకీ క్యాచర్లు రూ.వెయ్యి వరకు డిమాండ్​ చేస్తున్నారు. అంటే 100 కోతులు పట్టాలంటే తక్కువలో తక్కువ లక్ష కావాలి. నిధుల కొరతతో అల్లాడుతున్న పంచాయతీలు, బల్దియాలు ఆ దిశగా చొరవ చూపడం లేదు. మంకీ రెస్క్యూ సెంటర్​లో  ప్రతి నెలా 500 నుంచి 600 కోతులకు స్టెరిలైజేషన్​ చేసే ఫెసిలిటీ ఉంది. ఈ లెక్కన ఏడాదికి కనీసం 6 వేల నుంచి 7 వేల కోతులకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు​ చేయొచ్చు. గత నాలుగేండ్లలో సుమారు 25 వేల కోతులకు స్టెరిలైజేషన్​ చేసే అవకాశమున్నా కోతులను పట్టి తెచ్చేవారు లేక  1,500 స్టెరిలైజేషన్లు మాత్రమే చేశారు. ఇలాగైతే కోతుల నియంత్రణ ఎప్పటికీ సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇకనైనా ప్రభుత్వం చొరవ తీసుకొని మరో నాలుగైదు మంకీ రెస్క్యూ సెంటర్లను ఏర్పాటు చేసి, మండలాల వారీగా కొన్ని కోతులు పట్టే టీములను ఏర్పాటు చేసి స్టెరిలైజేషన్​ చేయిస్తే తప్ప కోతులను నియంత్రణ సాధ్యం కాదని జువాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. 

కోతులను పట్టుకుని తేవాలి.. 

మంకీ రెస్క్యూ, రిహాబిలిటేషన్ సెంటర్​లో నెలకు 500 కోతులకు స్టెరిలైజేషన్ చేసే సౌకర్యం ఉంది.  డాక్టర్​తో పాటు సిబ్బంది ఉన్నారు . గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు చొరవ తీసుకొని కోతులను పట్టించి సెంటర్ కు తీసుకురావాలి. కోతుల సంతానాన్ని నిరోధించాలంటే స్టెరిలైజేషన్ తప్పనిసరి. స్టెరిలైజేషన్ తర్వాత కొద్దిరోజులు  ఇక్కడే పునరావాసం  కల్పిస్తాం.  
- డాక్టర్ శ్రీకర్ రాజు, మంకీ రెస్క్యూ సెంటర్ మెడికల్ ఆఫీసర్, నిర్మల్