ఆయుధమే ఆన్సర్
మొన్న నిర్భయ.. నిన్న దిశ.. ఇప్పుడు హత్రాస్..
దేశంలో మహిళలపై రేప్‌లు సాధారణం అయిపోయాయి. అత్యాచారాల వార్తలు లేని న్యూస్‌పేపర్లు, టీవీ చానళ్లు లేవంటే అతిశయోక్తి కాదు. ప్రపంచాన్ని కదిలించిన నిర్భయ, దిశ ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు పడినా.. ఇప్పటికీ మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ గ్రామానికి చెందిన దళిత యువతిని తీవ్రంగా కొట్టి, నాలుక కోసి, అత్యంత హేయంగా అత్యాచారం చేసి చంపేశారు. మహిళలపై దాడులను నివారించడానికి తల్లిదండ్రులు, మేధావులు ఎన్నో చర్చలు చేస్తున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకువస్తున్నా దాడులు మాత్రం ఆగడం లేదు.
మహిళలపై హింస గతంకంటే మరింతగా పెరిగిపోతోంది. 2019లో క్రైమ్స్ ఇన్ ఇండియా పేరిట రిలీజ్ అయిన రిపోర్ట్‌లో మహిళలపై నేరాలు 7.3% పెరిగాయని, ప్రతి లక్ష మందిలో 62.4% మంది రేప్‌లు, వేధింపులకు గురవుతున్నారని తేలింది. మహిళలతోపాటు చిన్నారులపైనా వేధింపులు, దాడులు 2018తో పోలిస్తే 4.5% పెరిగాయి. 1.48 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మహిళలకు రక్షణ కల్పించడంలో మనదేశం ప్రపంచంలో 133వ ప్లేస్‌లో ఉంది.
రోజుకు 91 రేప్‌లు
రాజ్యాంగం ప్రకారం మహిళలకు సమాజంలో రక్షణ కల్పించడం చట్టపరమైన అంశం. కానీ నేడు మహిళల హక్కుల ఉల్లంఘన అనేక రూపాల్లో జరుగుతోంది. దేశంలో రోజుకు సగటున 91 రేప్‌లు జరుగుతున్నాయి. సగటున ప్రతి 16 నిమిషాలకు ఎక్కడో ఒక దగ్గర ఒక అత్యాచార ఘటన వెలుగు చూస్తోంది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2019లో 4,05,861 కేసులు నమోదు కాగా.. అందులో గృహహింసకు గురైన వారు 30.9%, మగాళ్ల వల్ల ఇంటి బయట దాడికి గురైన వారు 21.8%, కిడ్నాప్ అయిన వారు 17.9%, రేప్‌కు గురైన వారు 7.9% ఉన్నారు. 2018లో 3,78,236 కేసులు నమోదయ్యాయి. అంటే 2019లో కేసుల సంఖ్య 7.9% పెరిగింది. 2010లో నమోదైన కేసులతో పోలిస్తే 2019 నాటికి ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది.
ఎన్నో రకాలుగా వేధింపులు
గ్లోబలైజేషన్ నేపథ్యంలో మహిళలు అన్ని రంగాల్లో తమదైన గుర్తింపు పొందుతున్నారు. మగవారు మాత్రం మహిళలపై తమ ఆధిపత్యాన్ని చూపించడానికి లైంగిక వేధింపులు, అత్యాచారాలు, గృహ హింస, ఇంటా, బయటా శారీరకంగా, మానసికంగా, లైంగికంగా హింసించడం సర్వసాధారణం అయ్యింది. ఎన్నో ఏండ్లుగా ఇలాంటి రాక్షస ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి భయానక పరిస్థితుల్లో దేశంలోని ఆడవారికి రక్షణ కల్పించడం సవాలుగా మారింది. అంతే కాక న్యాయ వ్యవస్థ నెమ్మదిగా సాగడం, పోలీసులు వెంటనే స్పందించకపోవడం, మహిళపై దాడుల విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం, రాజకీయ నాయకుల నిర్లక్ష్యం, ఉన్నతవర్గాలకు చెందిన వారు తమ పలుకుబడితో చట్టాన్ని తప్పుదోవ పట్టించడం మొదలైన కారణాలతో మహిళలకు రక్షణ అనేది కరువైపోతోంది.
ఎన్నో చట్టాలున్నాయ్
రాజ్యాంగం పౌరులందరికీ గౌరవంగా బతికే హక్కును ఇచ్చింది. మహిళలు కూడా పౌరులే. వీరు స్వేచ్ఛ, సమానత్వం, లింగ వివక్ష నుంచి విముక్తి పొందడానికి రాజ్యాంగం మహిళలకు కొన్ని ప్రత్యేక హక్కులను కల్పించింది. ఆర్టికల్ 15(1) ప్రకారం లింగ వివక్ష చూపించకూడదు. ఆర్టికల్ 39(డి) ప్రకారం మగాళ్లతో సమానంగా వేతనం చెల్లించాలి. భర్త లేదా అతని కుటుంబ సభ్యుల నుంచి శారీరక, మానసిక, అదనపు కట్నం మొదలైన వేధింపుల నుంచి విముక్తి పొందడానికి 2005లో గృహ హింస వ్యతిరేక చట్టం చేశారు. పెయింటింగ్స్, రచనలు, ఏదైనా ప్రచురణల్లో మహిళలను అసభ్యంగా చూపించడాన్ని నిషేధిస్తూ మహిళా అసభ్య ప్రాతినిధ్య చట్టం(1986) తీసుకొచ్చారు. వరకట్న నిషేధ చట్టం (1961), పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం(2013), కనీస వేతన చట్టం(1948), చిన్న పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడానికి పోక్సో(2012) చట్టాన్ని సవరించే ఆర్డినెన్స్ ను 2018లో కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ చట్టం ద్వారా 12 ఏండ్ల లోపు వయసున్న పిల్లలపై అత్యాచారానికి పాల్పడిన వారికి మరణశిక్ష విధించేలా కొత్త నిబంధన తీసుకువచ్చారు. 2013లో నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు. 2019లో దిశ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. 14 రోజుల్లో విచారణ జరిపి నిందితుడికి 21 రోజుల్లోనే శిక్ష పడేలా చట్టం చేశారు.
ఇండ్లలోనూ.. పని ప్రదేశాల్లోనూ..
అత్యాచారం అనేదానికి హద్దులు లేవు. పసిపిల్లలు మొదలు పండు ముసలి వరకు, చివరికి హిజ్రాలను కూడా వదలడం లేదు. ఏటా దాదాపు 17 వేల మంది హిజ్రాలు అత్యాచార బాధితులుగా మిగిలిపోతున్నారు. ఈ దారుణాల నుంచి బయటపడినవారు జీవితాంతం అనేక అవమానాలకు గురవుతున్నారు. మరికొందరు జీవచ్ఛవాలుగా మారిపోతున్నారు. మరికొందరు సజీవ దహనాలకు గురవుతున్నారు. మనదేశం సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. మహిళలను దేవతలుగా పూజించే దేశం. కానీ ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న దాడులను చూస్తుంటే వారి భద్రత ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది. -వై.శివకుమార్, రీసెర్చ్ స్కాలర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.
సెల్ఫ్ డిఫెన్సే మేలు..
ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రే, ఎలక్ట్రో షాకర్స్ ఆయుధాలను సర్కారే అందించాలి.
కేసులను వేగంగా విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను భారీ సంఖ్యలో ఏర్పాటు చేసి, న్యాయ విచారణ వేగవంతం చేయాలి.
మహిళల భద్రతను పెంచేందుకు ప్రతి రంగంలో మహిళల సంఖ్య పెరగాలి.
ప్రజల ఆలోచనా విధానంలోనూ మార్పు రావాలి. మహిళలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరిదని గుర్తుంచుకోవాలి.
అత్యవసర సమయంలో స్పందించడానికి మహిళల రక్షణ హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేసి, వెంటనే స్పందించేలా చూడాలి.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేధింపులకు గురైన మహిళ జీరో ఎఫ్ఐఆర్ కింద ఏ పోలీస్ స్టేషన్ నుంచైనా ఫిర్యాదు చేయవచ్చు.
చట్టాలపై అవగాహన పెంచుకుంటేనే మహిళలు తమను తాము రక్షించుకోవడం వీలవుతుంది.