చట్ట సవరణ ఓకే చేయకముందే రిజిస్ట్రేషన్లు ఎట్ల చేస్తరు?

రాష్ట్రపతి ఓకే చేయకుండానే రిజిస్ట్రేషన్లు

కేంద్ర స్టాంపుల చట్టానికి రాష్ట్రం చేసిన సవరణను ఇంకా ఆమోదించలే

ఆలోగానే అమలు చేయడం సరికాదంటున్న లీగల్​ ఎక్స్​పర్టులు

ఈ నెల 2 నుంచే సవరణ చట్టం కింద రిజిస్ట్రేషన్లు షురూ

లీగల్​గా వివాదాలు వస్తాయంటున్న ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు:  కేంద్ర స్టాంపుల చట్టానికి రాష్ట్రంలో సవరణలు చేసిన సర్కారు.. దానికి రాష్ట్రపతి ఆమోదం లేకుండానే అమల్లోకి తెచ్చింది. దీనిపై లీగల్​గా వివాదాలు తలెత్తే అవకాశం ఉందని ఎక్స్​పర్టులు చెప్తున్నారు. కేంద్ర చట్టాలను రాష్ట్రానికోసం సవరించుకున్నప్పుడు కచ్చితంగా రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. సెప్టెంబర్​ రెండో వారంలో ప్రత్యేకంగా నిర్వహించిన అసెంబ్లీ సెషన్​లో రాష్ట్ర సర్కారు ఇండియన్​ స్టాంప్స్​ యాక్టులోని సెక్షన్​ 47(ఏ)ను తొలగిస్తూ సవరణ చేసింది. దీనిని రాష్ట్రపతితో ఓకే చేయించుకుంటామని మంత్రి ప్రశాంత్​రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు కూడా. కానీ రాష్ట్రపతి ఆమోదం లేకుండానే.. రాష్ట్ర సర్కారు ఈ నెల 2 నుంచి సవరణ చట్టం కింద రిజిస్ట్రేషన్లను మొదలుపెట్టింది.

ఇంకా కేంద్ర న్యాయ శాఖ పరిధిలోనే..

రాజ్యాంగం ప్రకారం.. కేంద్ర, రాష్ట్రాలు రెండింటికీ అధికారాలు ఉండే ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్రం చేసిన చట్టమే ఫైనల్​ అవుతుంది. ఒకవేళ కేంద్రం చేసిన చట్టాల్లోని ఏవైనా రూల్స్​ను రాష్ట్రాలు తమకు తగినట్టుగా సవరించుకోవచ్చు. కానీ దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర తప్పనిసరి. రాష్ట్రాలు చేసిన సవరణలు రాజ్యాంగానికి లోబడే ఉన్నయా, లేదా అని కేంద్ర న్యాయశాఖ పరిశీలించి.. కేంద్ర హోంశాఖ ద్వారా రాష్ట్రపతికి పంపుతుంది. ఈ లెక్కన కేంద్ర స్టాంపుల చట్టానికి రాష్ట్ర సర్కారు చేసిన సవరణలను ఓకే చేయించుకోవాల్సి ఉంది. ఈ సవరణ చట్టం ప్రస్తుతం కేంద్ర న్యాయ శాఖ పరిశీలనలో ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు. కానీ రాష్ట్ర సర్కారు సవరణ చట్టం కింద రిజిస్ట్రేషన్లను మొదలుపెట్టేసింది.

చట్ట సవరణ ఏంటంటే..

సెక్షన్ 47 (ఏ) మేరకు సబ్- రిజిస్ట్రార్లకు కేంద్రం కొన్ని విచక్షణాధికారాలను కల్పించింది. ప్రభుత్వం నిర్ణయించిన స్టాంపుడ్యూటీ ఎక్కువగా ఉందని కొనుగోలు దారుడు ఫిర్యాదు చేస్తే.. సబ్ రిజిస్ట్రార్ 47 (ఏ ) ప్రకారం స్టాంపు డ్యూటీలో సగం మాత్రమే కట్టించుకుని రిజిస్ట్రేషన్ చేయవచ్చు. తర్వాత రిజిస్ట్రేషన్ ఐజీకి కంప్లైంట్​ పంపుతారు. ఐజీ విచారణ చేసి ఆస్తుల విలువను తగ్గించడం, పెంచడం, ప్రస్తుత ధరను కొనసాగిండం చేస్తారు. అయితే ఈ విచక్షణాధికారం  ద్వారా అవినీతి జరుగుతోందని భావించిన రాష్ట్ర సర్కారు చట్టానికి సవరణ చేసింది. కచ్చితంగా ప్రభుత్వం నిర్ణయించిన ఆస్తుల విలువ మేరకు స్టాంపు డ్యూటీ కట్టించుకుని రిజిస్ట్రేషన్ చేయాలని పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయించిన ఆస్తుల విలువ ఎక్కువగా ఉందని ఎవరైన భావిస్తే.. ఫిర్యాదు చేసేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది.

కోర్టులో నిలబడదు!

రాష్ట్రపతి ఆమోదం లేకుండా కొత్త చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల లీగల్​సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఎక్స్​పర్టులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ నెల 2 నుంచి సవరణ చట్టం కింద అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ మొదలైంది. ప్రభుత్వం నిర్ణయించిన విలువ మేరకు స్టాంపు డ్యూటీ కట్టించుకుని రిజిస్ట్రేషన్లు జరిపిస్తున్నారు. ఎవరికైనా అభ్యంతరం ఉంటే కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఈ కమిటీకి చట్టబద్ధత లేదంటూ ఎవరైనా కోర్టుకు వెళ్తే.. దానిని రద్దు చేసే చాన్స్​ఉందని, సవరణ చట్టం అమలును ఆపవచ్చని అధికారులే పేర్కొంటున్నారు.

For More News..

అమెరికా ఎన్నికల్లో మనోళ్లు గెలిచిన్రు

అమెరికా ఎన్నికల్లో ఇంకా తేలని ఫలితం.. హోరాహోరీగా సాగుతున్న కౌంటింగ్

సన్న వడ్లపై బోనస్​ తేల్తలే.. రైతు గోస తీర్తలే