‘ప్రసాద్’ నిధులు వృథా కాకుండా.. భద్రాద్రి ఆలయంలో పనులు చేసేదెలా? 

  • గుడి లోపల అభివృద్ధి పనులపై ఆఫీసర్ల తర్జనభర్జన
  • ఊపందుకున్న మాస్టర్​ ప్లాన్.. ప్రసాద్​ స్కీంపై ప్రభావం!

భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులపై ఆఫీసర్లు తర్జనభర్జన పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్​(పిలిగ్రిమేజ్​ రెజువెంటేషన్​అండ్​ స్పిర్చువల్​ ఆగ్​మెంటేషన్​ డ్రైవ్​) స్కీం ద్వారా ఆలయం బయట చేపడుతున్న పనులతో ఇబ్బందేమీ లేదు. కానీ ఆలయం లోపల చేపట్టే పనులపై రాష్ట్ర ప్రభుత్వ మాస్టర్​ ప్లాన్​ ప్రభావం పడుతోంది. గుడి లోపల తొలుత ప్రసాద్​స్కీం కింద పనులు చేపడితే  తర్వాత చేపట్టే మాస్టర్​ ప్లాన్ పనుల్లో వాటిని తొలగించాల్సి వస్తోంది. దీంతో ప్రసాద్​ నిధులు వృథా కాకుండా పనులు ఎలా చేయాలనే ఆలోచనతో ఆఫీసర్లు నెత్తి పట్టుకుంటున్నారు. 

ప్రసాద్​ స్కీం కింద రూ.41.38 కోట్లు మంజూరు

గత బీఆర్​ఎస్​ సర్కారు భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామిని పూర్తిగా విస్మరించింది. మాస్టర్​ ప్లాన్​ పేరుతో భక్తులను, రాముడిని మోసగించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్​ స్కీం కింద భద్రాచలం, పర్ణశాలల్లో డెవలప్​మెంట్​ పనులకు రూ.41.38 కోట్లు మంజూరు చేసింది. దాంతో పనులకు అధికారులు  శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి పనులు పూర్తి కావాలని డెడ్​లైన్​ కూడా పెట్టారు. ఈలోగా రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ఓడి పోయి కాంగ్రెస్​ సర్కారు వచ్చింది. భక్తుల ఆకాంక్ష మేరకు మాస్టర్​ ప్లాన్​ ప్రకారం పనులు చేపట్టాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించడంతో ఇప్పుడు సుమారు రూ.200కోట్లు రిలీజ్​ చేసే అవకాశం ఉంది. 

నిధులు ఓకే.. పనులే ఎలా?

ఆలయం అభివృద్ధి పనులకు నిధులు ఓకే.. కానీ పనులు ఎలా చేయాలో తోచక అధికారులు ఆగమాగమవుతున్నారు. 
    

  • ప్రసాద్​ స్కీంలో భాగంగా ఆలయం లోపల భక్తుల నిత్య కల్యాణ మండపం, ఆంజనేయస్వామి ఆలయం, ఆలయ మెట్ల వద్ద ఫ్లోరింగ్​ పనులు, ​ రెయిలింగ్​ క్యూలైన్స్, మెట్లకు రూ.1.21కోట్లు కేటాయించారు. నిత్య కల్యాణ మండపం, ఆంజనేయస్వామి ఆలయం, ఇతర చోట్ల చల్లదనం, నీడ కోసం రూఫ్​ నిర్మాణ పనులను రూ.5.50కోట్లతో పనులు చేపట్టనున్నారు. దక్షిణ ద్వారం వైపు, చిత్రకూట మండపం వెనుక భాగంలో వంటశాల ఆధునీకరణ, ప్రసాదాల తయారీకి అధునాతన మిషన్లు కొనుగోలుకు రూ.69.60లక్షలు ఇచ్చారు. సుమారు రూ.7.40కోట్ల వరకు ఆలయం లోపల పనులు చేపట్టనున్నారు.     
  • మాస్టర్​ ప్లాన్​ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రామాలయం అభివృద్ధికి వేగంగా అడుగులు వేస్తోంది. 50 ఇండ్లు తొలగించాల్సి ఉండగా భూసేకరణ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. ఆర్కిటెక్​లు మాస్టర్ ​ప్లాన్​ పనులకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆలయం నలువైపులా రెండు ప్రాకారాలు కడతారు. మాడవీధులు వస్తాయి. ప్రాకారాలు కట్టే సమయంలో ఆలయంలో ఉన్న కొన్ని కట్టడాలను తొలగిస్తారు. అందులో భాగంగా చిత్రకూట మండపం, దాని వెనుక ఉన్న వంటశాల గది కూడా తీసేస్తారు. ఇంకా లోపల ఉన్న నిత్య కల్యాణ మండపం, చుట్టూ ఉన్న రూఫింగ్​ తీసేయాల్సి ఉంటుంది. 

ఏం చేద్దాం.. 

ఒకవేళ ఇప్పుడు ప్రసాద్​ స్కీం నిధులతో ఆలయం లోపల పనులు జరిపితే మాస్టర్​ ప్లాన్​ కట్టడాల్లో వాటిని తొలగించాల్సి వస్తుంది. దీంతో ప్రసాద్​ స్కీం నిధులు వృథా కాకుడదంటే పనులు ఎలా చేయాలి? అనే అంశంపై అటు టూరిజం, ఇటు ఎండోమెంట్​ ఇంజనీర్లు తర్జనభర్జనలు పడుతున్నారు. 

ఆలోచిస్తున్నాం

ప్రసాద్​ నిధులు వృథా కావొద్దు. ఆలయం లోపల పనులు చేయాలి. ఎలా చేస్తే బెటర్​అనే విషయమై ఆలోచిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే మాస్టర్​ ప్లాన్, సెంట్రల్​ గవర్నమెంట్​ ప్రసాద్​ నిధులతో చేపట్టిన డెవలప్​ మెంట్​పనులపై ఇప్పటికే ఉన్నతాధికారులు రివ్యూ చేశారు. వారి సూచనలు, సలహాల ప్రకారం పనులు చేపడుతాం. 

- రవీందర్, ఈఈ, శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం