గోదావరిఖని/ కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి సంస్థ తన పరిధిలోని కార్మిక కాలనీ క్వార్టర్లకు బురద నీళ్లు సప్లై చేస్తోందని కార్మిక కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కార్మిక సంక్షేమం విషయంలో భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న సింగరేణి మేనేజ్‌మెంట్ తాగునీరును అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటున్నారు. గోదావరి నదిలోని సింగరేణి ఇన్ టేక్ వెల్ ఇన్ ఫిల్ట్రేషన్ గ్యాలరీల నుంచి కొద్ది రోజులుగా కార్మిక వాడలకు రంగు మారిన, బురదతో కూడిన నీళ్లు సప్లై కావటంతో కార్మిక కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
రామగుండం రీజియన్‌లో సప్లై ఇలా..
గోదావరి ఒడ్డున సింగరేణి మేనేజ్‌మెంట్ 34 ఏండ్ల క్రితం నిర్మించిన ఇన్టేక్వెల్లోని ఇన్ ఫిల్ట్రేషన్ గ్యాలరీల ద్వారా వచ్చే నీటిని ప్యూరిఫై చేసి సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలో 18 కిలోమీటర్లు దూరంలోని గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ, సెంటినరీ కాలనీలోని సుమారు 16 వేల సింగరేణి క్వార్టర్లకు సప్లై చేస్తున్నారు. అలాగే ఆయా కాలనీలలోని సుమారు 22 వేల ప్రైవేట్ ఇండ్లకు కూడా నీటిని అందిస్తున్నారు.
బెల్లంపల్లి రీజియన్ కార్మిక వాడలకు..
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం సీతారాంపల్లి వద్ద గోదావరి నదిలో సింగరేణి 1974లో ఇన్‌టేక్‌వెల్ ఏర్పాటు చేసింది. నది మధ్యలో 18 ఇసుక బావుల్లో నుంచి భారీ కరెంట్ మోటార్లు, పంపుల సాయంతో గోదావరి నీటిని సీతారాంపల్లి వద్ద ఉన్న ఫిల్టర్ బెడ్ కు పంపిస్తున్నారు. అక్కడ ఫిల్టర్ చేసి అనంతరం శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలోని సుమారు 30వేల సింగరేణి కార్మిక క్వార్టర్లు, ప్రైవేటు ఇండ్లకు ప్రతీ రోజుకు 85లక్షల గ్యాలన్ల తాగునీటిని సప్లై చేస్తున్నారు.
రంగు మారిన నీళ్ల సప్లై..
గోదావరి నదిలోని ఇన్‌ఫిల్ట్రేషన్ గ్యాలరీలపై ఉన్న మూతలు ప్రవాహానికి పడిపోతుండడంతో అందులోకి బురద నీరు, పాకురు పట్టిన పచ్చటి రంగులో ఉన్న నీరు చేరుతున్నది. ఆ నీటిని ఇన్‌టేక్‌వెల్‌లో ఫిల్టర్ చేసినప్పటికీ రంగు మారకుండా డైరెక్ట్‌గా గోదావరిఖని గంగానగర్‌లోని ఫిల్టర్‌బెడ్ సెట్లింగ్ ట్యాంక్ ద్వారా కార్మిక కాలనీలకు సప్లై అవుతున్నది. దీనికి తోడు ఇంటెక్‌వెల్ వద్ద వాల్ సరిగ్గా పనిచేయక గోదావరి నుంచి వచ్చిన నీరు తిరిగి వెనక్కి వెళ్లడంతో ఇన్‌ఫిల్ట్రేషన్ గ్యాలరీపై ఉన్న మూతలు పడిపోయి కూడా రంగు మారిన నీళ్లు సప్లై అవుతున్నట్టు చెబుతున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా గోదావరి నది నీరు ఏడాది పొడవునా నిలిచిఉండటం.. పరిసరాల్లోని పరిశ్రమల నుంచి కలుషిత నీరు, డ్రైనేజీ నీరు కలుస్తున్నాయని వాపోతున్నారు. ప్రస్తుతం గోదావరి ఒడ్డున సింగరేణి మేనేజ్‌మెంట్ అవసరమైన రిపేర్లు చేస్తున్నది. కాగా రామగుండం రీజియన్‌లోని సింగరేణి కార్మిక కాలనీలకు తాగునీటిని సప్లై చేయాలని రూ.20 కోట్ల ఖర్చుతో గోదావరిఖనిలో రాపిడ్ గ్రావిటీ ఫిల్టర్‌బెడ్‌ను నిర్మించాలని ఇటీవల సింగరేణి బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకుని ఫండ్స్ కూడా మంజూరు చేశారు.
టెండర్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో కనీసం నిర్మాణానికి ఏడాది టైమ్ పట్టే చాన్స్ ఉంది. బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని కార్మిక వాడలకు రంగు నీళ్ల సప్లైతో సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. శిథిలావస్థకు చేరిన పాతపైపులు తొలగించి రూ.7 కోట్లతో గోదావరి నది నుంచి శ్రీరాంపూర్ బంగ్లా ఏరియాలోని జీఎల్ఎస్ఆర్ వరకు 6.8కి.మీ పొడవునా చేపట్టిన కొత్త పైప్‌లైన్ పనులు 60శాతం పూర్తి చేసినట్లు శ్రీరాంపూర్ సింగరేణి జీఎం బి.సంజీవరెడ్డి తెలిపారు. రూ.16 కోట్ల వ్యయంతో బంగ్లా ఏరియా వద్ద రాపిడ్ గ్రావిటీ ఫిల్టర్‌బెడ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. రెండు చోట్ల రాపిడ్ గ్రావిటీ ఫిల్టరేషన్ ప్రక్రియ మొదలుకు మరింత టైమ్ పట్టే చాన్స్ ఉండటంతో అప్పటి వరకు రామగుండం, బెల్లంపల్లి రీజియన్ సింగరేణి కార్మిక కుటుంబాలకు రంగు మారిన బురద నీళ్లే దిక్కయ్యేలా ఉంది.
దద్దుర్లు వస్తున్నయ్..
సింగరేణి కార్మిక కాలనీలకు మేనేజ్‌మెంట్ సప్లై చేస్తున్న నీళ్లు బురద రంగులో వస్తున్నాయి. రంగు మారిన నీళ్లను చూసుకుంట ఎట్ల తాగమంటరు. సింగరేణి ఆఫీసర్లు కార్మిక సంక్షేమాన్ని పూర్తిగా మరిచిపోయిన్రు. బొగ్గు ఉత్పత్తిపై ఉన్న ధ్యాస మా సంక్షేమంపై లేదు. ఎవరైనా గట్టిగా అడిగితే వారిని టార్గెట్ చేస్తున్నరు. తాగునీళ్లను కూడా సరిగ్గా ఇవ్వకపోతే ఎలా. దద్దుర్లు, డయోరియా సమస్యతో ఇబ్బంది పడుతున్నం.
‒ టి.రాజారెడ్డి, సీఐటీయూ ప్రెసిడెంట్
వారంలోగా సమస్య పరిష్కరిస్తాం..
గోదావరినదిపై నిర్మించిన ప్రాజెక్ట్‌ల వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా నదిలో నిల్వ నీరు ఉంటోంది. దీంతో రంగు మారిన నీళ్లను ఎంత ఫిల్టర్ చేసినా అలాగే ఉంటున్నాయి. సాధ్యమైనంత వరకు క్లోరినేషన్ చేసి సప్లై చేస్తున్నాం. నీళ్లను కాచి వడపోసి తాగాలి. నీటిని వరంగల్‌లోని ల్యాబ్‌కు టెస్ట్‌ల కోసం పంపించాం. ఇన్ టేక్ వెల్, ఫిల్టర్‌బెడ్‌వద్ద అవసరమైన రిపేర్లు చేస్తున్నాం.
‒ చింతల శ్రీనివాస్, జీఎం, ఆర్జీ 1 ఏరియా