ఉద్యోగుల గ్రాట్యుటీకి అర్హత లేంటి.? ఎలా లెక్కిస్తారు తెలుసుకోండి

ఉద్యోగుల గ్రాట్యుటీకి  అర్హత లేంటి.? ఎలా లెక్కిస్తారు తెలుసుకోండి
  • ఒకే సంస్థలో వరుసగా ఐదేండ్లయినా పనిచేయాలి
  • 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులుంటే సంస్థలు గ్రాట్యుటీ ఇవ్వాల్సిందే
  •  
  • ఉద్యోగుల శాలరీ నుంచి కటింగ్స్ ఉండవు.. కంపెనీలే పెట్టుకుంటాయి

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: చాలా మంది ఉద్యోగులు ఒకే సంస్థలో ఏళ్ల పాటు పనిచేస్తుంటారు. వీరి సర్వీస్‌‌లకు గుర్తింపుగా  గ్రాట్యుటీని కంపెనీలు ఇస్తాయి.  పేమెంట్స్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టం కింద 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీలు తమ ఎంప్లాయీస్‌‌కు గ్రాట్యుటీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వీరు రిటైర్‌‌‌‌మెంట్ అయిన టైమ్‌‌లో లేదా ఉద్యోగం మానేసే టైమ్‌‌లో లేదా నిర్ణీత కాలం పనిచేసి ఉంటే  గ్రాట్యుటీ ఇవ్వాలి. అంటే గ్రాట్యుటీ కింద ఒకేసారి పెద్ద మొత్తంలో అమౌంట్‌‌ను ఉద్యోగులకు కంపెనీలు ఇస్తాయి. 

గ్రాట్యుటీ పొందడానికి అర్హత.. 
    
గ్రాట్యుటీ పొందాలంటే  ఒకే కంపెనీలో  వరుసగా కనీసం ఐదేళ్లు పనిచేయాలి. మెటర్నిటీ, ఇతర పెయిడ్‌‌ లీవ్స్‌‌ ఇందులో కలిసే ఉంటాయి. ఒక వేళ ఉద్యోగి చనిపోయినా లేదా వికలాంగుడిగా మారినా, ఐదేళ్ల టైమ్ పీరియడ్‌‌తో సంబంధం లేకుండా నామినీకి  గ్రాట్యుటీ చెల్లిస్తారు.
    
10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ఫ్యాక్టరీలు, మైన్స్‌‌, ప్లాంటేషన్స్‌‌, షాపులు, ఇతర సంస్థలు గ్రాట్యుటీని ఇవ్వాల్సి ఉంటుంది. 
    
గ్రాట్యుటీని ఉద్యోగుల శాలరీ నుంచి కట్ చేయరు. కంపెనీలే డబ్బులు చెల్లిస్తాయి. 
    
గ్రాట్యుటీ ప్రయోజనాలను పొందేందుకు  

కుటుంబంలోని  ఒక మెంబర్‌‌‌‌ను ఉద్యోగి నామినేట్ చేయొచ్చు.

ఎలా లెక్కిస్తారంటే?

ఉద్యోగి చివరి నెలలో తీసుకున్న శాలరీ ఆధారంగా  గ్రాట్యుటీ లెక్కిస్తారు. ఎన్నేళ్లు పనిచేశారో పరిగణనలోకి తీసుకుంటారు. గ్రాట్యుటీ చట్టం కిందకు వచ్చే కంపెనీలు ఈ కింది విధంగా లెక్కిస్తాయి.

ఫార్ములా:  గ్రాట్యుటీ  = (చివరి నెల శాలరీ × 15 × పనిచేసిన సంవత్సరాలు) / 26.

ఇక్కడ 15 అంటే   పనిచేసిన ప్రతీ ఏడాదిలో 15 పని రోజులు అని అర్థం. 26 అంటే ఒక నెలలో పరిగణనలోకి తీసుకున్న పని దినాలు.

ఉదాహరణ: రమేశ్ అనే ఓ ప్రైవేట్ ఉద్యోగి  ఒక సంస్థలో 10 ఏళ్లు పనిచేశారని అనుకుందాం. ఆయన జాబ్ మానేసే టైమ్‌‌కి  తీసుకున్న నెలవారి జీతం రూ.50,000 (బేసిక్+డీఏ). పైన పేర్కొన్న ఫార్ములా ప్రకారం, (50,000 × 15 × 10) / 26 = రూ. 2,88,462 గ్రాట్యుటీని అందుకుంటారు.

అదే గ్రాట్యుటీ చట్టం కింద కవర్ కాని సంస్థల్లో పనిచేస్తే..

కొన్ని సంస్థలు ఈ చట్టం కింద కవర్ కావు. ఇలాంటివి తమ ఉద్యోగులకు కింద పేర్కొన్న ఫార్ములా ప్రకారం గ్రాట్యుటీ చెల్లిస్తాయి. 

ఫార్ములా: గ్రాట్యుటీ = (చివరి నెలలో తీసుకున్న శాలరీ × 15 × పని చేసిన ఏళ్లు) / 30

ఉదాహరణ: పైన పేర్కొన్న రమేశ్‌‌ ఈ కోవకు వస్తాడని అనుకుంటే ఆయన పొందే గ్రాట్యుటీ ఈ కింది విధంగా ఉంటుంది. 

(50,000 × 15 × 10) / 30 = రూ.2,50,000.

ట్యాక్స్‌‌లో మినహాయింపు

గ్రాట్యుటీ పైనా ట్యాక్స్ పడుతుంది. కానీ, మినహాయింపులూ పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగి అయితే ట్యాక్స్ ఉండదు. అదే  ప్రైవేట్ ఎంప్లాయీ అయితే  రూ.20 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. జీవితం మొత్తంలో రూ.20 లక్షల వరకే మినహాయింపు ఇస్తారు. అంటే ఎన్నిసార్లు సంస్థలు మారినా, మొత్తంగా ఈ అమౌంట్‌‌కు మించి గ్రాట్యుటీ పొందితే, ట్యాక్స్ పడుతుంది.