జోన్లు తేలకుండా కొలువులెట్ల

జోన్లు తేలకుండా కొలువులెట్ల

ఇప్పటికీ 31 జిల్లాలతోనే ఏడు జోన్ల విధానం
ములుగు, నారాయణ పేట జిల్లాలకు ఆమోదమేది?
చార్మినార్ జోన్ లోకి చేరని వికారాబాద్ జిల్లా
గుండాల మండలం ఇంకా జనగామ జిల్లాలోనే
సవరించిన జోనల్ ఫైల్ పై రాష్ట్రపతి ముద్ర ఎప్పుడో?

రెండేండ్లుగా జోనల్​ సిస్టమ్​ను పట్టించుకోని రాష్ట్ర సర్కార్​

కేంద్ర హోం శాఖ అభ్యంతరాలకు నో ఆన్సర్​

హైదరాబాద్, వెలుగు: రెండేండ్లుగా జోనల్​ఫైల్​ను రాష్ట్ర ప్రభుత్వం మూలకుపడేసింది. దానిపై రాష్ట్రపతి ఆమోదం కోసం సీరియస్​గా ప్రయత్నించడం లేదు. కేంద్ర హోంశాఖ అభ్యంతరాలకు సరైన సమాధానం చెప్పడం లేదు. ఫలితంగా ఇంకా 31 జిల్లాలతో కూడిన ఏడు జోన్ల విధానమే కొనసాగుతోంది. మరో రెండు జిల్లాలను ఏ జోన్లో వేస్తారన్న దానిపై ప్రభుత్వం క్లారిటీ  ఇవ్వలేదు. మార్పులు చేర్పుల కోసం వచ్చిన డిమాండ్లపైనా ఎటూ తేల్చలేదు. ఫైనల్​ జోనల్​ విధానం తేలకుండా కొత్త పోస్టుల భర్తీ అంత ఈజీ కాదని ఆఫీసర్లు అంటున్నారు.

తేలకుండా ఎట్ల భర్తీ చేస్తరు?

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవంతో రాష్ట్ర ప్రభుత్వం యువత, నిరుద్యోగులను ఆకట్టుకునే పనిలో పడింది. ఇదే క్రమంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. ఖాళీలను గుర్తించి, వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని సీఎస్​కు సీఎం ఆదేశించారు. ఖాళీలను గుర్తించే పనిలో ఆఫీసర్లు నిమగ్నమయ్యారు. కానీ, అవి భర్తీ చేసేదెప్పుడు?  ఎట్ల భర్తీ చేస్తారు? అనే దానిపై నిరుద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫైనల్​ జోనల్​ విధానం తేలకుండా పోస్టుల భర్తీ సాధ్యం కాదని, ఒకవేళ నోటిఫికేషన్లు ఇచ్చినా లీగల్​ సమస్యలు వస్తాయని ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు.

సవరించి.. అటకెక్కించారు

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ జోనల్ అంశాన్ని పక్కన పెట్టేశారు. ఎన్నికల ప్రచారంలో వచ్చిన రాజకీయ డిమాండ్ల మేరకు జోన్లను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారే తప్ప.. వాటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపలేదు. 2018 లో అసెంబ్లీని రద్దు చేసే ముందు అప్పటివరకు ఉన్న  జోనల్ వ్యవస్థను రద్దుచేసి, కొత్త జోన్లను ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న రెండు జోన్ల స్థానంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లుగా 31 జిల్లాలను విభజించారు.

దీనికి మే 2018లో రాష్ట్రపతి ఆమోదించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ములుగు, నారాయణ పేట జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ తెరమీదికి వచ్చింది. అలాగే వికారాబాద్ జిల్లాను గద్వాల జోన్ నుంచి తొలగించి,  చార్మినార్ జోన్ లో కలపాలని ఆందోళనలు జరిగాయి. జనగామ జిల్లాలో కలిపిన గుండాల మండలాన్ని యాదాద్రి- భువనగిరి జిల్లాలో కలపాలని  టీఆర్ఎస్  కేడర్​ కూడా ఉద్యమించింది. దీంతో సీఎం కేసీఆర్​ ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేశారు. జోనల్ వ్యవస్థను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ.. రెండేండ్లవుతున్నా ఇంతవరకు సవరించిన ఫైల్​పై రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

కేంద్ర హోంశాఖ అభ్యంతరాలకు సమాధానమేది?

సవరించిన జోనల్​  ఫైల్ ను రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్ర హోం శాఖకు పంపింది. అయితే.. ఏకీకృత సర్వీసుకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళనలు టీచర్ల నుంచి వ్యక్తమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో జోన్ల సవరణ ఎలా సాధ్యమో చెప్పాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్​ రాసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆన్సర్ కు హోంశాఖ సంతృప్తి చెందక మరో అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ఆఫీసర్లు అంటున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ అంశాన్ని పక్కన పెట్టిసినట్టు తెలిసింది.

లీగల్​ సమస్యలు వస్తయ్

ములుగు, నారాయణ పేట జిల్లా లకు రాష్ట్రపతి ఆమోదం లేదు. అట్లాం టప్పుడు ఆ జిల్లా ల పోస్టు లను ఎట్ల భర్తీ చేస్తరు? 31 జిల్లాల వారీగా నియామకాలు చేస్తే మిగతా 2 జిల్లాల నిరుద్యోగులకు నష్టం జరుగుతది. సవరించిన జోన్లకు రాష్ట్రపతి ఆమోదం లేకుండా డీఎల్, జేఎల్, గ్రూప్ 1 నియామకాలు చేపట్టడం కుదరదు. హడావుడిగా నోటిఫికేషన్లు వేస్తే లీగల్ సమస్యలు వస్తయ్.

‑ వెంకట్ గౌడ్, ఓయూ ప్రైవేటు లెక్చరర్ల అసోసియేషన్ నేత

ఏడు జోన్ల వివరాలు

కాళేశ్వరం జోన్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి
బాసర జోన్ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
రాజన్న జోన్ కరీం నగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్
భద్రాద్రి జోన్ కొత్తగూడెం, ఖమ్మం , మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్
యాదాద్రి జోన్ సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ
జోగులాంబ జోన్ మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్
చార్మినార్ జోన్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి

రెండు మల్టీ జోన్లు

1. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి
2. యాదాద్రి, చార్మినార్, జోగులాంబ