Good Health : పండ్లు, కూరగాయలు తాజాగా ఉన్నాయని ఎలా గుర్తించాలంటే.. ఈ చిట్కాలు మీ కోసం..!

Good Health : పండ్లు, కూరగాయలు తాజాగా ఉన్నాయని ఎలా గుర్తించాలంటే.. ఈ చిట్కాలు మీ కోసం..!

రోజూ మార్కెట్లోకి వెళ్లే వాళ్లు చాలా తక్కువే ఉంటారు. చుట్టుపక్కల వారానికొకసారి జరిగే సంతలో కూరగాయలు పుచ్చులు, మచ్చలు చూసి మంచివి ఏరుకుంటారు. ఆరు రోజులకు సరిపడా సంచిలో నింపుకుంటారు. కానీ, ఇంటికొచ్చినంకనే అసలు సంగతి అర్ధమవుతుంది. రెండు రోజులకు కొన్ని వాడిపోతయ్. కొన్ని పనికి రాకుండా ఖరాబ్ అవుతాయి. కంటికి ఇంపుగా కనిపించేవన్నీ తాజావి కాదు! మరి ఎలా? అంటే వాటికి కొన్ని గుర్తులున్నయ్. బుట్టలో వేసుకునే ముందు... ఒకసారి పట్టి చూడండి!

కూరగాయలు లేకుండా కిచెన్ నడవదు. నాన్​ వెజ్​కి కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి, తాజా కాయగూరల్ని గుర్తుపట్టడానికి... కొన్ని గుర్తులు ఉన్నాయి. 

  • బఠాణీలు రాళ్లలెక్క గట్టిగ కాకుండా, కొంచెం మెత్తగా ఉండాలి.  బరక బరకగా కాకుండా పట్టుకుంటే స్మూత్​గాఉండాలి. రంగు పచ్చగా ఉండాలి.
  • కాలీఫ్లవర్లో చీలికలు, పగుళ్లు ఉంటే మనకన్నా ముందేక్రిములు, కీటకాలు తిన్నాయని అర్థం. ఆ పగుళ్లు క్రిములు తొలిచిన బాటలు, వాటిగుండానే అవి లోపలికి ప్రవేశిస్తాయి. కొన్నిసార్లు పురుగులు. బయటకు కూడా కనపడుతుంటాయి. ఇవన్నీ చూసి కాలీఫ్లవర్​  సెలెక్ట్ చేసుకోవాలి.
  • తాజా క్యారెట్ ముదురు కుంకుమపువ్వు రంగులో ఉంటుంది. దాని పైపొర గాయాలు లేకుండా... శుభ్రంగా, క్లియర్ గా కనిపించాలి. ఇది చలికాలంలోనే ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి, మిగతా కాలాల్లో కొంచెం ఎక్కువ పరిశీలించి కొనాలి.
  •  ఉల్లిగడ్డ పైపొరలు ఎండిపోయి గులాబీ రంగులో ఉండాలి. లోపలి రేకులు గుండ్రంగా, గట్టిగా కనిపిస్తే అవి తాజావి.
  • పుట్టగొడుగులు కొంచెం మెత్తగా, గుండ్రంగా, జిడ్డుగా ఉండాలి.
  •  ఆలుగడ్డలు పట్టుకుంటే గట్టిగా ఉండాలి. పైపొర జిడ్డుగా ఉండాలి. పైన పగుళ్లు ఉండేవి, బయటికి నల్లగా కనిపించేవి, మట్టితో నిండినట్టు, బూడిద పూసినట్టు ఉండేవాటిని కొనకూడదు. మొలకలు వచ్చిన ఆలుగడ్డల్ని కూడా కొనొద్దు..
  • పాలకూర ఆకులు నీట్ , మెత్తగా, ముదురు ఆకుపచ్చ రంగులో ఉండాలి. పాలకూర కట్టలో పసుపు రంగులోకి మారిన ఆకులున్నా, ఆకులపై రంధ్రాలు పడినా, చీలికలున్నా వాటిని తీసుకోవద్దు.
  • కొంచెం లావుగా, గుండ్రంగా. ఎర్రగా నిగనిగలాడుతున్న టొమాటోల్ని తీసుకోవాలి. మచ్చలు, నల్లని పుచ్చులున్న వాటిని తీసుకోవద్దు. మెత్తపడ్డ వాటికి దూరంగా ఉండాలి.
  • పచ్చి బీన్స్ నే తీసుకోవాలి. కొనేటప్పుడు చేత్తో తాకి, గుండ్రంగా ఉన్నాయో లేదో చూడాలి.
  • బెండకాయ పొట్టిగా ఉన్నా, పొడవుగా ఉన్నా సన్నటి బెండకాయలనే ఏరుకోవాలి. పొట్టలు మెత్తగా ఉండాలి. వాటి మీద నల్లని మచ్చలుండకూడదు. తొడిమల్ని వేళ్లతో విరిచి చూడాలి. చటుక్కున విరిగితే లేతవి, తాజావని అర్థం.
  • కొత్తిమీర, మెంతికూర ఆకులు చేతికి మెత్తగాతగులుతూ, పచ్చగుండాలి, వాడిపోయినా, పసుపు రంగులోకి మారినా కొనొద్దు. పసుపు రంగులోకి మారిన వాటికి సహజమైన సువాసన ఉండదు. ఎక్కువగా నీటితో తడిపి బరువెక్కిన కట్టల్ని కూడా కొనకూడదు. నీరెక్కువగా ఉండటం వల్ల అవి తొందరగా పాడైపోతాయి. ఇంటికి తెచ్చాక వేర్లు, వాటి మధ్యలో ఉండే గడ్డి తీసేసి, కాగితంలో చుట్టి నిల్వ చేసుకోవాలి.
  •  కాస్త పెద్ద సైజ్ నిమ్మకాయలనే తీసుకోవాలి. చిన్నవాటిలో రసం ఉండదు.
  • నిగనిగలాడే వంకాయలపై... పుచ్చులు లేకుండా చూసుకోవాలి. లావుగా ఉన్నాయంటే ముదిరిపోయినట్టే.
  • బీరకాయలపై ఉండే అంచులు లేతగా, గిచ్చితే పచ్చిగా ఉంటే తాజావని అర్థం.