వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం విషయంలో ఇష్టారీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అప్రూవ్ లేకుండా రూ.1100 కోట్లున్న అంచనా వ్యయాన్ని రూ.1726 కోట్లకు ఎలా పెంచారని సీఎం ప్రశ్నించారు. కేవలం మౌఖిక ఆదేశాలతో రూ.626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచడమెంటని ఫైరయ్యారు. నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా యుద్ధప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని నిర్మాణ సంస్థకు తేల్చి చెప్పారు సీఎం.
హైదరాబాద్తో పాటు సమానంగా వరంగల్ను అభివృద్ధి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ పర్యటనలో భాగంగా హనుమకొండ కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించారు.