ఈరోజుల్లో బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ వంటి ఉన్నత చదువులు చదివి ఇళ్ల దగ్గర ఖాళీగా ఉండటం కంటే.. పదో తరగతి పాసవ్వగానే ఏదో ఒక ఉద్యోగంలో చేరడం ఎంతో ఉత్తమం. పదో తరగతి ఉతీర్ణతతో ఉద్యోగాలు ఏముంటాయ్ అనుకోకండి.. భారత సైన్యంలో చేరడానికి పదో తరగతి పాసయ్యుంటే చాలు.
నిజానికి సైన్యంలో చేరి సరిహద్దుల్లో పహారా కాస్తూ దేశానికి రక్షణగా నిలవాలని చాలా మంది యువత కలలు కంటుంటారు. కానీ, ఎలా చేరాలి..? అనే మార్గాలు వారికి తెలియవు. అటువంటి వారి కోసమే ఈ కథనం.
పదవ తరగతి ఉత్తీర్ణతతో భారత సైన్యంలో చేరడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో సోల్జర్ (జనరల్ డ్యూటీ/ టెక్నికల్/ క్లరికల్/ స్టోర్‌కీపర్/ నర్సింగ్ అసిస్టెంట్, వెటర్నరీ/ట్రేడ్స్‌మ్యాన్, అగ్నివీర్) విభాగం ఒకటి. ఇవి ఎంట్రీ ఆధారిత స్థానాలు. వీటికి 10వ తరగతి ఉత్తీర్ణత చాలు. ఈ విభాగంలో ఏటా లక్షలాది మంది యువత దరఖాస్తు చేసుకుంటారు.
కనీస వయోపరిమితి..
సైన్యంలో చేరడానికి కనీస వయోపరిమితి.. 17½ సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితి అనేది పోస్టును బట్టి మారుతుంటుంది.
- సోల్జర్ జనరల్ డ్యూటీ కోసం: అభ్యర్థి వయస్సు 17½ నుండి 21 సంవత్సరాల మధ్య ఉండాలి.
- సోల్జర్ ట్రేడ్స్‌మన్/అగ్నివీర్ కోసం: అభ్యర్థి వయస్సు 17½ నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం..
ఎంపిక పక్రియ వివిధ దశల్లో ఉంటుంది.
దరఖాస్తు: నోటిఫికేషన్ వెలుబడగానే అభ్యర్ధులు తమ దరఖాస్తులను సమర్పించాలి.
PET/PST (ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌లు): ఇందులో రన్నింగ్, పుల్-అప్‌లు, సిట్-అప్‌లు, లాంగ్ జంప్‌లు వంటి కఠినమైన పరీక్షలు ఉంటాయి.
మెడికల్ ఎగ్జామ్: ఇది ఆర్మీ సేవలకు అవసరమైన అభ్యర్థి భౌతిక, వైద్య ప్రమాణాల ఆధారంగా నిర్వహించబడుతుంది.
వ్రాత పరీక్ష: సాధారణ అంశాలపై అవగాహన, సంఖ్యా సామర్థ్యం వంటి నైపుణ్యాలను అంచనా వేయడానికి వ్రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థులు ఉత్తీర్ణులు కావాలి.
డాక్యుమెంట్ వెరిఫికేషన్: దరఖాస్తులో అందించిన సమాచారం నిజమని నిర్ధారించడానికి అభ్యర్థులు తమ ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుంది.
జీతభత్యాలు: భారతీయ ఆర్మీ సైనికుడి జీతం వారి ర్యాంక్, సంవత్సరాల సేవపై ఆధారపడి ఉంటుంది. ఇది ఏడాదికి రూ. 3 లక్షల నుండి 10 లక్షల వరకు ఉంటుంది. ప్రాథమిక వేతనం నెలకు రూ. 21, 700 నుండి మొదలవుతుంది. అత్యున్నత స్థాయి అధికారులకు నెలకు లక్షల వరకు ఉంటుంది. మరింత సమాచారం కోసం ఇండియన్ ఆర్మీ ప్రకటనలు చూడవచ్చు.