జూన్ నెల రాగానే వర్షాలు పడుతూ ఉంటాయి. ఈ వర్షాల్లో జుట్టు తడవడం మామూలే. దానివల్ల జుట్టు వాసన రావడం, గడ్డిలా మారడం, చుండ్రు రావడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఇలా చిట్కాలు పాటిస్తే సరి.
• వర్షంలో జుట్టు తడిస్తే అది జిడ్డుగా మారుతుంది. దీన్ని నివారించాలంటే కోడిగుడ్డులోని తెల్లటి సొనలో నిమ్మకాయ రసం, ఉసిరిపొడి కలిపి జుట్టుకు పూతలా వేసుకుని 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా, అందంగా మారుతుంది.
* పావుకప్పు పెరుగులో కొద్దిగా ఆలివ్ నూనె, నిమ్మరసం కలిపి తలంతా రాసుకోవాలి. నలభై నిమిషాలయ్యాక షాంపూతో కడిగేయాలి. వర్షంలో తడిసినప్పుడు జుట్టు జిడ్డుగా మారకుండా ఈ చిట్కా కూడా పనిచేస్తుంది. వర్షాకాలం మొత్తం వారానికోసారి ఈ పూత వేసుకుంటే ప్రయోజనంఉంటుంది.
* వర్షంలో తడిసిన జుట్టు గడ్డిలా మారిపోతూ ఉంటే.. వారానికోసారి గోరువెచ్చని కొబ్బరినూనెలో నిమ్మరసం, కలబంద గుజ్జు కలిపి తలకు పట్టించాలి. గంటసేపటి తర్వాత తలస్నానం చేస్తే ఈ సమస్య తగ్గుతుంది. ఈ చిట్కాతో జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
* అలాగే వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా తేమను పీల్చుకుంటుంది. అందువల్ల కచ్చితంగా వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. రసాయనాలు ఉండే షాంపూలు కాకుండా హెర్బల్ షాంపూను వినియోగిస్తే మంచిది.