మన పేరు మీద ఎన్ని నెంబర్లు ఉన్నాయో తెలుసుకోవచ్చా.. అసలు సాధ్యమేనా..? అవును.. సాద్యమే. ఈ కొత్త సదుపాయాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది టెలికాం శాఖ. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ను అభివృద్ధి చేసింది. http:/tafcop.dgtelecom.gov.in ఈ సైట్ ఓపెన్ చేయగానే మీ మొబైల్ నెంబరు అడుగుతుంది. నెంబర్ ఎంటర్ చేయగానే మీ మొబైల్ కు ఓటీపీ వస్తుంది. సైట్ లో ఓటీపీ ఎంటర్ చేయగానే మన పేరు మీద ఉన్న ఫోన్ నెంబర్ల వివరాలన్నీ వస్తాయి. మనకు తెలియకుండా మన పేరు మీద ఉన్న వాటిని గుర్తించి ఆ నెంబర్ల మీద సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే.. టెలికాం శాఖ చర్యలు తీసుకుంటుంది.
ప్రయోగాత్మకంగా తెలుగు రాష్ట్రాల్లో సేవలు
మనం కూడా గతంలో ఎప్పుడో మన పేరు మీద సిమ్ తీసుకుని.. ఎవరికో ఇచ్చి ఉంటాము.. అవి వాడుకలో ఉన్నాయో.. లేదో తెలియదు. వాటి నెంబర్లు ఏమిటో కూడా చాలా వరకు మరచిపోయి ఉంటాము. ఒకవేళ మన పాత నెంబర్లను ఎవరైనా వాడుతుంటే.. మనకు ఇబ్బంది వస్తుందేమోననే అనుమానాలు కలుగుతుంటాయి. అంతే కాదు, ఇంటి పేరు సహా మన పేరును పోలిన వారు కూడా ఉండి ఉంటారనే విషయం కొట్టి పారేయలేం. పేర్లు చాలా వరకు మ్యాచ్ అవుతాయి. అయితే ఆధార్ నెంబర్లు ఆధారంగా కచ్చితంగా తేలిపోతుంది. అయితే మన ఆధార్ నెంబర్ సహా మన పేరుతో వాడుతున్నవేమైనా ఉంటే వాటిని రద్దు చేసే అవకాశం మనకు వచ్చినట్లే. ఈ కొత్త సదుపాయాన్ని తొలుత తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ పరిశీలించాక దేశ వ్యప్తంగా విస్తరించే అవకాశం ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మన పేరు మీద ఎవరైనా సిమ్ వాడుతున్నారేమో చెక్ చేసుకోండి..
వెబ్ సైట్: http:/tafcop.dgtelecom.gov.in