పెరిగిన ధరలతో పండుగ చేసేదెలా?

పెరిగిన ధరలతో పండుగ చేసేదెలా?

పండక్కి నాలుగు పిండి వంటలు చేద్దామంటే..బాబోయ్‌ ఉప్పు, పప్పులతో పాటు మిగతా వస్తువుల ధరలు కూడా చుక్కలంటుతున్నాయి.  దీనికితోడు వంటగ్యాస్‌, ఇంధనం, వస్త్రాలు అమాంతం పెరగడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి క్షీణించింది. చేతిలో చిల్లిగవ్వ లేక రెండు పూటలా తిండి దొరకడం కొందరికి కష్టంగా మారింది. అన్ని వస్తువుల ధరలు చుక్కలను అంటడంతో మధ్యతరగతి ప్రజల పరిస్థితి మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారయ్యింది. వంట గ్యాస్‌ ధరలు పెరిగాయి. ఒక్కో సిలెండర్‌పై రూ.20 పెరగడంతో రూ.980కి చేరింది. స్థానిక ఏజెన్సీ నిర్వాహకులు రవాణా ఖర్చుల కింద రూ.25 అదనంగా వసూలు చేస్తున్నారు. ఆరు నెలల కిందట రూ.900  ఉండగా ప్రస్తుతం రూ.100  పెరిగింది. ఇక ప్రజలు వాహనాన్ని ఇంటి నుంచి బయటకు తీయాలంటే కూడా జంకుతున్నారు. లీటరు పెట్రోల్‌ ధర రూ.108, డీజిల్‌ ధర రూ.101లకు చేరింది. నిత్యవసరాలకు.. పెరిగిన ఇంధన ధరలు తోడవడంతో చిన్నపాటి వేతన జీవులు వాహనాలకు గుడ్‌బై చెబుతున్నారు.  గతంలో రేషన్‌ దుకాణాల్లో చింతపండు, పసుపు, పప్పులు, పామాయిల్‌ నూనె తదితర సరకులు ఇచ్చేవారు. ఇప్పుడు పామాయిల్‌ ఇవ్వడం లేదు. కొంత కాలంగా 14 రకాల సరుకుల పంపిణీ నిలిచిపోయింది. ధరలు పెరుగుతున్న వేళ పేదలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి.పేద, మధ్య తరగతి ప్రజల కష్టాలు ఎవరికీ పట్టడం లేదు. ఇంతలో కరోన మళ్లీ తన విశ్వ రూపం చూపిస్తోంది. కొవిడ్ ఆంక్షలు మళ్లీ అమలులోకి వస్తున్నాయి. విధ్యా సంస్థలకు ప్రభుత్వం సంక్రాంతి, కొవిడ్ ని ద్రుష్టిలో పెట్టుకుని ఈ నెల 8 నుండి 16 వరకు సెలవులు ప్రకటించారు. చిన్నారులకు టీకాలు సాధ్యమయినంత వేగవంతం చేయాలి. కరోన నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి. గ్రామాలు, పట్టణాలలో కొవిడ్ అవగాహన సమావేశాలు, మాస్క్ వినియోగం మీద ప్రచారం నిర్వహించాలి. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి.

- కామిడి సతీష్ రెడ్డి, జడలపేట జయశంకర్ భూపాలపల్లి జిల్లా