ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరితే..హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ క్లెయిమ్స్ చేసుకోండిలా

ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరితే..హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ క్లెయిమ్స్ చేసుకోండిలా
  • అత్యవసర పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ కంపెనీకి వేగంగా తెలియజేయాలి
  • ప్లాన్ చేసుకుని హాస్పిటల్‌‌లో జాయిన్ అవ్వాలనుకుంటే ముందుగానే ప్రీ–అథరైజేషన్ పొందాలి 
  • రూ. 35.95 లక్షలు క్లెయిమ్ చేసిన సైఫ్‌‌ అలీ ఖాన్‌‌

బిజినెస్ డెస్క్‌‌‌‌, వెలుగు: లైఫ్‌‌‌‌లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఈ మధ్య బాలీవుడ్ నటుడు సైఫ్‌‌‌‌ అలీ ఖాన్‌‌‌‌ దాడికి గురైన  విషయం తెలిసిందే. ఆయన రూ.35.95 లక్షల హెల్త్‌‌‌‌ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేశాడని తెలిసింది. 

ఆయన చేసిన క్లెయిమ్‌‌‌‌లో రూ.25 లక్షలకు ప్రీ– అథరైజేషన్‌‌‌‌ (ట్రీట్‌‌‌‌మెంట్ ప్లాన్‌‌‌‌కు ఇన్సూరెన్స్ కంపెనీ ఒప్పుకోవడం) కింద  ఆమోదం లభించింది. ఫైనల్ బిల్లు వచ్చాక మిగిలిన అమౌంట్‌‌‌‌ పాలసీ రూల్స్ ప్రకారం సెటిల్ చేస్తామని నివా బుపా ప్రకటించింది.

ఇలా సడెన్‌‌‌‌గా వచ్చే మెడికల్  ఎమెర్జెన్సీలు చూస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. ఏయే పరిస్థితుల్లో ఎలా  క్లెయిమ్స్‌‌‌‌ చేయాలో తెలిస్తే  చివరి నిమిషంలో ఒత్తిడి నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా క్లెయిమ్ ప్రాసెస్ ఈజీగా సాగిపోతుంది. 

అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్‌‌‌‌లో జాయిన్ అయితే..

ఎమెర్జెన్సీ పరిస్థితుల్లో హాస్పిటల్‌‌‌‌లో జాయిన్ అవ్వాల్సి వస్తే వేగంగా చర్యలు తీసుకోవడం ముఖ్యం. 

  1. ఎమెర్జెన్సీ పరిస్థితుల్లో కొంత అమౌంట్‌‌‌‌ను ముందుగానే డిపాజిట్ చేయాల్సి రావొచ్చు. వెరిఫికేషన్ కోసం కేవైసీ డాక్యుమెంట్లను రెడీగా ఉంచుకోవాలి.
  2. ఇన్సూరెన్స్ కంపెనీ లేదా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) కి హెల్ప్‌‌‌‌లైన్ ద్వారా వేగంగా తెలియజేయాలి.
  3. పేషెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డును, వ్యాలిడ్ ఫొటో ఐడీని  హాస్పిటల్‌‌‌‌కు అందివ్వాలి. ఇన్సూరెన్స్ కంపెనీ లేదా టీపీఏకి  పేషెంట్ ట్రీట్‌‌‌‌మెంట్ ప్లాన్‌‌‌‌ను తెలియజేసే ప్రీ– అథరైజేషన్ రిక్వెస్ట్‌‌‌‌ను, మెడికల్ రిపోర్ట్‌‌‌‌లతో కలిపి హాస్పిటల్ పంపుతుంది. 
  4. రియంబర్స్ చేసుకోవడానికి వీలుకాని ఖర్చులను మీరే చెల్లించాలి. రిపోర్ట్‌‌‌‌ కాపీలను, డిశ్చార్జ్ డాక్యుమెంట్లను  జాగ్రత్తగా ఉంచాలి. క్లెయిమ్ ప్రాసెస్‌‌‌‌ను పూర్తి చేయడానికి ఒరిజినల్స్‌‌ను  హాస్పిటల్ తమ  దగ్గరే ఉంచుకుంటాయి. 
  5. ఒకవేళ   మీరు చేసిన ప్రీ– అథరైజేషన్‌ రిక్వెస్ట్ రిజెక్ట్ అయితే, డిశ్చార్జ్ అయ్యాక ఒరిజినల్ బిల్లులను , డాక్యుమెంట్లను సబ్మిట్ చేసి,  ఖర్చులపై రియంబర్స్‌‌‌‌మెంట్ పొందొచ్చు. 

హాస్పిటల్‌‌ను  ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేయనప్పుడు..

 పాలసీ కవరేజ్‌లో మీరు ట్రీట్‌మెంట్‌ తీసుకున్న హాస్పిటల్‌ లేకపోతే ఈ కింది విధంగా క్లెయిమ్ చేపట్టాలి.

  1. హాస్పిటల్‌‌ నుంచి డిశ్చార్జ్ అయిన 15 నుంచి  30 రోజుల్లో మీ ఇన్సూరెన్స్ కంపెనీ కాల్ సెంటర్‌‌‌‌కు తెలియజేయాలి.
  2. క్లెయిమ్ నెంబర్ తీసుకోవాలి. తదుపరి సంప్రదింపులకు ఈ రిఫరెన్స్ నెంబర్‌‌‌‌ సాయపడుతుంది. 
  3. క్లెయిమ్ ఫామ్‌‌ను ఒరిజినల్ బిల్లులతో కలిపి టీపీఏకి లేదా ఇన్సూరెన్స్ కంపెనీకి పంపాలి. మెడికల్ డాక్యుమెంట్లను దీనికి అటాచ్ చేయాలి. అదనపు డాక్యుమెంట్లు అవసరమైతే మీ క్లెయిమ్ అందుకున్న ఏడు రోజుల్లోపు ఇన్సూరెన్స్ కంపెనీ కోరుతుంది. డాక్యుమెంట్లన్నీ వెరిఫై అయిన 30 రోజుల్లో పేమెంట్ ప్రాసెస్‌‌ను మొదలు పెడుతుంది.  

ప్లాన్ చేసుకుని హాస్పిటల్‌లో జాయిన్ అయినప్పుడు..

  1. మీ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తున్న హాస్పిటల్ వివరాలను ముందుగా తెలుసుకోవాలి. ట్రీట్‌‌మెంట్ ప్లాన్‌‌ను, అడ్మిషన్ డేట్‌‌ను, అయ్యే ఖర్చుల అంచనాలను ఫైనలైజ్ చేసుకోవాలి.
  2. ఇన్సూరెన్స్ కంపెనీ లేదా టీపీఏకి    48 నుంచి 72 గంటల ముందే మీ ట్రీట్‌‌మెంట్‌‌ ప్లాన్‌‌పై ప్రీ– అథరైజేషన్ కోరుతూ రిక్వెస్ట్‌‌ సబ్మిట్ చేయాలి. హాస్పిటల్‌‌ ద్వారా ఈ రిక్వెస్ట్ పంపాలి. 
  3. ఇన్సూరెన్స్ కంపెనీ మీ ప్రీ–అథరైజేషన్ రిక్వెస్ట్‌‌ను ఒప్పుకుంటే ఆ లెటర్‌‌‌‌ను, వ్యాలిడ్ ఫొటో ఐడీని హాస్పిటల్‌‌లో జాయిన్ అయ్యే ముందు సబ్మిట్ చేయాలి. కొన్ని హాస్పిటల్స్‌‌ అడ్వాన్స్‌‌గా కొంత అమౌంట్‌‌ను డిపాజిట్ చేయమని కోరొచ్చు. ఈ అమౌంట్‌‌ను డిశ్చార్జ్ అయ్యాక లేదా మీ క్లెయిమ్ ప్రాసెస్‌‌ పూర్తయ్యాక రిఫండ్‌‌ చేసుకోవచ్చు. కేవైసీ డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి.
  4. పాలసీ రూల్స్ ప్రకారం రియంబర్స్ కాని ఖర్చులను పేషెంటే భరించాలి. మెడికల్ రిపోర్ట్ కాపీలను, డిశ్చార్జ్ డాక్యుమెంట్లను జాగ్రత్తగా ఉంచాలి. క్లెయిమ్‌‌ ప్రాసెస్ కోసం ఒరిజినల్స్ హాస్పిటల్స్ దగ్గరే ఉంటాయి.