మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఇంట్రెస్టింగ్గా లేకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది చాలామందికి. ఎప్పుడూ అదే బోరింగ్ ఫుడ్ అని నసుగుతూనే తింటుంటారు కొందరు. ఇంకొందరేమో టేస్ట్ ఒక్కటే చూసుకుంటే ఎలా? తినే ఫుడ్ హెల్దీగా కూడా ఉండాలి అంటారు. ఇలా పొద్దున తినే ఫుడ్ గురించి రకరకాల అభిరుచులు ఉంటాయి. అందరికీ నచ్చేలా.. ఆరోగ్యాన్నిచ్చేలా బ్రేక్ ఫాస్ట్ తయారుచేయాలంటే ఈ రెసిపీలు ఫాలో అయిపోండి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ నచ్చేస్తాయి. ఆరోగ్యాన్నీ ఇస్తాయి.
మిల్లెట్ టోస్ట్
కావాల్సినవి :
సజ్జ పిండి (పర్ల్ మిల్లెట్) – ఒకటిన్నర కప్పు
పెరుగు – అర కప్పు
ఉప్పు, నీళ్లు – సరిపడా
అల్లం తురుము – ఒక టీస్పూన్
పచ్చిమిర్చి – ఒకటి
కొత్తిమీర – కొంచెం
ఈనో పౌడర్ – అర టీస్పూన్
నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు
టొమాటో తరుగు – రెండు టీస్పూన్లు
క్యాప్సికమ్ తరుగు – మూడు టేబుల్ స్పూన్లు
తయారీ : ఒక గిన్నెలో సజ్జ పిండి, పెరుగు వేసి నీళ్లు పోస్తూ కలపాలి. తర్వాత అందులో ఉప్పు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టొమాటో తరుగు, అల్లం తురుము, కొత్తిమీర, ఈనో పౌడర్ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైస్కి ఒక వైపు పూయాలి. పాన్ వేడి చేసి నెయ్యి వేసి దానిపై బ్రెడ్ పెట్టి, రెండో వైపు కూడా మిశ్రమాన్ని పూయాలి. మూతపెట్టి మూడు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత నెయ్యి వేసి, బ్రెడ్ తిరగేసి రెండో వైపు కూడా కాల్చాలి. చివరిగా వాటిని ముక్కలుగా కట్ చేసుకుంటే హెల్దీ, టేస్టీ టోస్ట్ తినడానికి రెడీ.