
శ్రావణమాసం వచ్చిందంటే ప్రతి శుక్రవారం తలంటు స్నానాలు, కొత్త బట్టలు, పూజలు, ప్రసాదాలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఇక ఈ మాసంలో వచ్చే రెండో శుక్రవారం నాడు చేసే వరలక్ష్మీ వ్రతం రోజున అయితే ఇంట్లో ఆడవాళ్లు చేసే హడావిడి చెప్పక్కర్లేదు. పొద్దున్నే మహాలక్ష్మీలా తయారై పండుగ సెలబ్రేషన్స్ మొదలుపెట్టేస్తారు. అందులో భాగంగా లక్ష్మీదేవికి ఎంతో రుచికరమైన నైవేద్యాలు వండి పెడతారు. నిజానికి పండుగ రోజు నైవేద్యాలు అన్న పేరే గానీ, ఇంత రుచికరమైన ఫుడ్‌ని ఎప్పుడు చేసినా కాదంటారా! మరింకెందుకాలస్యం ఈసారి వ్రతానికి వీటిని తప్పకుండా ట్రై చేయండి. వాటిని ఒక్కసారి రుచి చూశారంటే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది. కచ్చితంగా తినాలనిపిస్తుంది.
కావాల్సినవి :
బియ్యం – ఒక గ్లాసు, నీళ్లు – రెండు గ్లాసులు
నూనె, ఉప్పు – సరిపడా
ధనియాలు, ఆవాలు – ఒక్కో టీస్పూన్ చొప్పున
మిరియాలు, పసుపు – ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
ఎండు మిర్చి – నాలుగు
మెంతులు, ఇంగువ – ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున
నువ్వులు – రెండు టీస్పూన్లు
చింతపండు (నానబెట్టి) – 50 గ్రాములు
పచ్చిమిర్చి – నాలుగు, కరివేపాకు – కొంచెం
బెల్లం, అల్లం తరుగు – అర టేబుల్ స్పూన్
పల్లీలు – కొన్ని
పోపు గింజలు – ఒక టేబుల్ స్పూన్
తయారీ : బియ్యం కడిగి, నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. నానిన బియ్యాన్ని గిన్నెలోకి తీసి నూనె, ఉప్పు వేసి ఉడికించాలి. ఉడికిన అన్నాన్ని వెడల్పాటి పళ్లెంలో వేసి చల్లారబెట్టాలి. ధనియాలు, ఆవాలు, మిరియాలు, మెంతులు, ఎండు మిర్చి, నువ్వుల్ని ఒక పాన్‌లో వేగించాలి. వాటిని చల్లార్చి మిక్సీజార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత నానబెట్టిన చింతపండును కూడా మిక్సీజార్‌లో గ్రైండ్ చేయాలి. పాన్‌లో నూనె వేడి చేసి, పచ్చిమిర్చిని నిలువుగా కోసి అందులో వేయాలి. చింతపండు గుజ్జు, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి. ఆ తర్వాత అందులో బెల్లం కూడా వేసి మిశ్రమం దగ్గర పడేవరకు ఉడికించాలి. ఆ మిశ్రమాన్ని అన్నంలో వేసి కలపాలి. పాన్‌లో నూనె వేడి చేసి పల్లీలు, పోపు గింజలు, అల్లం తరుగు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. ఆ తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి కలిపి కాసేపు పక్కన పెడితే అన్ని ఫ్లేవర్స్ పులిహోరకు బాగా పడతాయి.