
శ్రావణమాసం వచ్చిందంటే ప్రతి శుక్రవారం తలంటు స్నానాలు, కొత్త బట్టలు, పూజలు, ప్రసాదాలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఇక ఈ మాసంలో వచ్చే రెండో శుక్రవారం నాడు చేసే వరలక్ష్మీ వ్రతం రోజున అయితే ఇంట్లో ఆడవాళ్లు చేసే హడావిడి చెప్పక్కర్లేదు. పొద్దున్నే మహాలక్ష్మీలా తయారై పండుగ సెలబ్రేషన్స్ మొదలుపెట్టేస్తారు. అందులో భాగంగా లక్ష్మీదేవికి ఎంతో రుచికరమైన నైవేద్యాలు వండి పెడతారు. నిజానికి పండుగ రోజు నైవేద్యాలు అన్న పేరే గానీ, ఇంత రుచికరమైన ఫుడ్‌ని ఎప్పుడు చేసినా కాదంటారా! మరింకెందుకాలస్యం ఈసారి వ్రతానికి వీటిని తప్పకుండా ట్రై చేయండి. వాటిని ఒక్కసారి రుచి చూశారంటే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది. కచ్చితంగా తినాలనిపిస్తుంది.
కావాల్సినవి :
పెసరపప్పు – పావు కప్పు
బియ్యం – ముప్పావు కప్పు
నీళ్లు – రెండున్నర కప్పులు
ఉప్పు – సరిపడా
బెల్లం – ఒక కప్పు
చక్కెర – అర కప్పు
యాలకుల పొడి – అర టీస్పూన్
పచ్చ కర్పూరం – చిటికెడు
నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు
ఎండు కొబ్బరి, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు పలుకులు – ఒక్కోటి పావు కప్పు చొప్పున.
తయారీ : నూనె వేయకుండా పెసరపప్పు వేగించాలి. తర్వాత గిన్నెలో వేగించిన పెసరపప్పు, బియ్యం వేసి, నీళ్లు పోసి రెండు సార్లు కడగాలి. తరువాత నీళ్లు వడకట్టి కుక్కర్ గిన్నెలో వాటిని వేయాలి. ఉప్పు కూడా వేసి, మూత పెట్టి ఉడికించాలి. ఉడికాక మెత్తగా మెదిపి బెల్లం, చక్కెర వేయాలి. సన్నటి మంట మీద మరికాసేపు ఉడికించాలి. ఆ తర్వాత యాలకుల పొడి, పచ్చ కర్పూరం, నెయ్యి వేసి కలపాలి. ఎండు కొబ్బరి, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు పలుకుల్ని నెయ్యిలో వేగించాలి. వేగించిన డ్రైఫ్రూట్స్‌ను పొంగలి మీద వేసి కలపాలి.