ప్రేమ ఒక అందమైన పీలింగ్. ప్రతీ ఒక్కళ్లూ ఏదో ఒక దశలో ఆ అనుభూతిని ఫీలయ్యే ఉంటారు. ప్రేమలో ఉన్నప్పుడు అంతా కొత్తగా కనిపిస్తుంది... ఎక్కడాలేని ఆనందమంతా ముఖంలోనే కనిపిస్తుంది. రోజులన్నీ నిమిషాల్లా గడిచిపోతాయి.. ప్రేమలో ఉన్నంత సేపు అంతా పాజిటివ్ గానే ఉంటుంది. కానీ, ఏదైనా కారణంతో విడిపోతేనే అసలు సమస్య. బ్రేకప్ అవ్వగానే లోకమంతా శూన్యం. అప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్న వాళ్లే.. బ్రేకప్ అవ్వగానే డీలా పడిపోతారు. తమ జీవితం అయిపోయిందని డిప్రెషన్లోకి వెళ్లిపోతుంటారు. దీని నుంచి బయటకు రావడానికి చాలా మార్గాలున్నాయి.
ఎవరైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమించినప్పుడు, మనస్ఫూర్తిగా ఇష్ట పడినప్పుడు ఉన్నట్టుండి సింపుల్ గా వారి నుంచి విడిపోలేం. బ్రేకప్ మామూలు విషయమే.
దానివల్ల కలిగే బాధ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఆ బాధ మర్చిపోవడం చాలా కష్టం. ఆ బాధ ప్రతి రోజు నీడలా వెంటాడుతూ ఉంటుంది. ఇది రోజువారీ జీవితం మీద కూడా ప్రభావం చూపించొచ్చు. "నాకే ఎందుకు ఇలా జరిగింది? నేనేం తప్పు చేశాను అనే ఫీలింగ్ బాగా వేధిస్తుంది. నిజంగా బ్రేకప్ కు అంతలా ఫీల్ అవ్వాలా? దాని నుంచి బయట పడే మార్గాలే లేవా?
టైం పట్టొచ్చు
రిలేషన్ లోకి ఎంటర్ అవ్వడం ఎంత కష్టమో. బయటకు రావడం కూడా అంతే కష్టం. అది ఒకటి రెండు రోజుల్లో జరిగే పని కాదు కొంత టైం పడుతుంది. అందుకే బ్రేకప్ బాధ నుంచి త్వరగా బయటపడాలని కోరుకోకుండా వీలైనంత టైం తీసుకోవాలి. మనసుకు మెల్లగా సర్ది చెప్పాలి. నచ్చిన పనులతో సమయాన్ని గడపాలి. కాస్త టైం పట్టినా అల్టిమేట్ గా మార్పు వచ్చితీరుతుంది. అందుకే బ్రేకప్ తర్వాత తొందరపాటు పనికిరాదు. వీలైనంత టైం తీసుకుని మెల్లగా మామూలు స్థితికి రావాలి.
ఫ్రెండ్స్ దే కీ రోల్
బ్రేకప్ బాధ నుంచి బయటపడడానికి స్నేహితులదే కీ రోల్. మనసులో బాధను అలాగే పెట్టుకుంటే పెరుగుతుందే తప్ప
తగ్గదు. అందుకే ఆత్మీయులు, స్నేహితులతో దాన్ని పంచుకుంటే.. వాళ్ల మాటలు కొంత రిలీఫ్ కలిగించొచ్చు. ఈ బాధంతా కొంతకాలమే అని మనకు తెలిసినా దాన్ని ప్రతిసారి గుర్తుచేసేందుకు ఒక మంచి ఫ్రెండ్ పక్కనుండాలి ...అప్పుడే బాధను మర్చిపోగలం. ఫ్రెండ్స్ తో మనసులోని బాధంతా చెప్పుకోవడం వల్ల మనసు తేలిక పడుతుంది.
ALSO READ | Women Beauty : చలికాలంలో మీ పాదాలు పగులుతున్నాయా.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి..!
సెల్ఫ్ కేర్
బ్రేకప్ గురించే ఆలోచిస్తూ కూర్చోకుండా సెల్ఫ్ కేర్ గురించి ఆలోచించాలి. మనల్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలో ఆలోచించాలి. ఏవైనా కొత్త మార్పులు చేసుకోవాలి ఉదాహరణకు.. ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవచ్చు, ఎప్పటి నుంచో చేద్దామనుకుంటూ వాయిదా వేస్తున్న పనుల్నీ ఇప్పుడు చేయెచ్చు. అలాగే రోజువారి పనుల్లో కొత్త వాటిని చేర్చాలి ... వ్యాయామం చేయడం, హెల్త్ కేర్, బ్యూటీకేర్ లాంటివి తీసుకోవాలి. ఉదాహరణకు ఒక కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేయెచ్చు. కొన్ని రోజులు ఏదైనా టూర్ కి వెళ్లి రావొచ్చు. దానివల్ల కొత్త ఎనర్జీ వస్తుంది. ఇలా ఏదో ఒక సచ్చిన పనిలో నిమగ్నమవడం వల్ల టైం తెలీదు .. పాత విషయాలు కూడా అంతగా గుర్తుకు రావు.
ఈ తప్పులొద్దు
- చాలామంది బ్రేకప్ అవ్వగానే బ్రేకప్ కు సంబంధించిన పోస్ట్‌లను సోషల్ మీడియాలో పెడుతుంటారు. దీనివల్ల నష్టమే తప్ప లాభముండదు. బాధలో ఉన్నప్పుడు సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్టుల కన్నా నెగెటివ్ పోస్టులే ఎక్కువ. బ్రేకప్.. లవ్ ఫెయిల్యూర్ లాంటి పోస్టులు ఇండా ఎక్కువ. అందుకే వాటికి వీలైనంత దూరంగా ఉండటం బెటర్...
- పాత రిలేషన్ ను మరిచిపోవాలంటే వెంటనే కొత్త రిలేషన్ మొదలు పెట్లమని కొంతమంది సలహాలిస్తుంటారు. కానీ అదొక బ్యాడ్ ఐడియా అలాంటి సలహాలు పట్టించుకోవద్దు. కొత్త రిలేషన్ దానంతట అది ఏర్పడాలే కానీ... బాధ నుంచి తప్పించుకోవడం కోసం రిలేషన్ లోకి ఎంటర్ అవ్వకూడదు. అలా చేస్తే ఆ రిలేషన్ కూడా ఎక్కువకాలం నిలవదు.
- జరిగిపోయిన దాని గురించి పదేపదే ఆలోచించకూడదు. నాకే ఎందుకిలా జరిగింది. అలా జరగకపోయి ఉంటే బాగుండేది.. అంటూ జరిగిన దాని గురించి ఆలోచించడం అనవసరం..
- బ్రేకప్ అవ్వగానే చాలామంది వ్యసనాలకు అలవాటు పడిపోతారు. దాని వల్ల జీవితానికి మరింత నష్టం కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. మనసు పాడైందని.... ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకోవడం మంచి సొల్యూషన్ కాదు.
- బాధలో ఉన్నప్పుడు చాలామంది లోన్లీగా ఉండాలనుకుంటారు. ఏకాంతంలో కూర్చొని, ఎక్కడా లేని బాధ అంతా తమకే వచ్చిందంటూ ఏడుస్తుంటారు. దానికి బదులు బయటికి వెళ్లి కొత్త ప్లేసులను చూసినా, కొత్తవ్యక్తులను కలిసినా మనసులో తెలియని కొత్త ఉత్సాహం మొదలవుతుంది. పాత ఆలోచనలు పక్కకు- పోయి కొత్త ఆలోచనలు చిగురిస్తాయి. అది జీవితాన్ని పాటిటివ్ గా మారుస్తాయి.
గుర్తులొద్దు
బ్రేకప్ అవ్వగానే చాలామంది తమ 'ఎక్స్' ఫొటోలను ముందు పెట్టుకుని బాధ పడుతుంటారు. సినిమాల్లో చూపించినట్టుగా వాళ్లిచ్చిన గిఫ్ట్‌లను దగ్గర పెట్టుకుని ఏడుస్తుంటారు. ఇవన్నీ ప్రాక్టికల్‌గా కుదిరే పనులు కావు. విడిపోయిన వాళ్ల వస్తువులు చూస్తూ కూర్చోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే బ్రేకప్ అపుగానే అలాంటి గుర్తులను చెరిపేయడం మంచిది.
-వెలుగు,లైఫ్–