న్యూఢిల్లీ: అసెస్‌మెంట్ ఇయర్ (ఏవై) 2021–22 కోసం డిలేయ్డ్ ఐటీఆర్ (ఆదాయపు పన్ను రిటర్న్) ఫైల్ చేయడానికి చివరి తేదీ మార్చి 31. గడువు తేదీలోపు ఏవై 21–22 కోసం ఐటీఆర్ ఫైల్ చేయనివాళ్లు ఈలోపు ఫైల్ చేయాలి. అసెసీ తన ఆదాయ వనరులను బట్టి ఐటీఆర్ 1, ఐటీఆర్ 2, ఐటీఆర్ 3 ఐటీఆర్ 4లలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలి. ఉదాహరణకు, ఏడాది ఆదాయంలో రూ.50 లక్షల కంటే తక్కువ ఉండి, ఒకటి కంటే ఎక్కువ ఇల్లులేని, (రూ.5,000 కంటే తక్కువ) కనీస వ్యవసాయ ఆదాయం కలిగిన ఇండివిడువల్ రెసిడెన్షియల్స్ ఐటీఆర్ 1ని ఫైల్ చేయాలి. ఈ–-ఫైలింగ్‌ను ప్రారంభించడానికి ముందు అన్ని సంబంధిత డాక్యుమెంట్లు ఉండాలి.
ఎంచుకున్న ఐటీఆర్‌ను నింపడానికి అవసరమైన డాక్యుమెంట్ల లిస్టు:
బ్యాంక్ పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా పాస్‌బుక్
పీపీఎఫ్ ఖాతా పాస్‌బుక్
జీతం స్లిప్పులు
ఆధార్, పాన్ కార్డ్
బ్యాంక్ నుండి హోమ్ లోన్ స్టేట్మెంట్ (ఉంటే)
సెక్షన్ 80డీ నుండి 80 (ఉంటే) కింద తగ్గింపులను క్లెయిమ్ చేయడానికి రుజువులు
ఫారం-16 (ఇది మీ యజమాని మీకు ఇస్తాడు. మూలం వద్ద మినహాయించిన పన్ను వివరాలు, చెల్లించిన జీతం వివరాలు ఉంటాయి) - 16ఏ, 16బీ 16సీ ఫారాలు కూడా అవసరమవుతాయి.
ఫారమ్–16ఏ: జీతం కాకుండా ఇతర చెల్లింపులపై (మీకు) - ఫిక్స్‌డ్ లేదా రికరింగ్ డిపాజిట్ల నుండి వడ్డీ వంటివి - ప్రస్తుత పన్ను చట్టాల ద్వారా పేర్కొన్న పరిమితుల ప్రకారం టీడీఎస్ తీసివేస్తేనే ఫారమ్-16ఏ అవసరం.
ఫారమ్–16బీ: మీరు ఆస్తిని అమ్మితే ఫారం-16బీ అవసరం. ఇది మీకు చెల్లించిన మొత్తంపై టీడీఎస్ మినహాయించారని చూపుతుంది.
ఫారమ్-16సీ: ఆస్తిని అద్దెకు ఇస్తున్నట్లయితే ఫారం-16సీ అవసరం. ఇది కిరాయిదారు నుండి మీరు స్వీకరించిన అద్దెపై తీసేసిన టీడీఎస్ వివరాలను అందిస్తుంది.
ఫారమ్ 26ఏఎస్: - టీడీఎస్ వివరాలు ఉండే యాన్యువల్ స్టేట్మెంట్ ఇది.
ఐటీఆర్ దాఖలు చేయడానికి ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ www.incometaxindiaefiling.gov.in వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. మీకు ఖాతా లేకుంటే, మీ పాన్ ఉపయోగించి రిజిస్టర్ చేసుకోండి. ఇదే మీ ఐడీ అవుతుంది.
స్టెప్ 1: మీకు తగిన ఐటీఆర్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి. 'డౌన్‌లోడ్' కింద, సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరంలో 'ఈ–ఫైలింగ్'కి వెళ్లి, తగిన ఐటీఆర్ ఫారమ్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్ 2: రిటర్న్ ప్రిపరేషన్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయండి (ఎక్సెల్ యుటిలిటీ). అక్కడ ఉన్న సూచనలను పాటించండి. ఆటోమేటిక్‌గా పూరించిన వివరాలు మీ ఫారమ్ 16 లో ఉన్నట్టుగానే ఉన్నాయని సరిచూసుకోండి.
స్టెప్ 3: సంబంధిత పన్ను వివరాలను లెక్కించండి. చెల్లించాల్సిన పన్నును లెక్కించండి. ఏదైనా ఉంటే పన్ను చెల్లించండి సంబంధిత చలాన్ వివరాలను ఇవ్వండి. మీకు పన్ను బాధ్యత లేకపోతే, ఈ స్టెప్‌ను వదిలేయవచ్చు.
స్టెప్ 4: పై వివరాలను కన్ఫర్మ్ చేయండి. మీరు నమోదు చేసిన వివరాలను సరిచూసుకొని ఎక్స్ఎంఎల్ ఫైల్‌ను రూపొందించండి.
స్టెప్ 5: రిటర్న్‌ను సబ్మిట్ చేయండి. 'సబ్మిట్ రిటర్న్' విభాగానికి వెళ్లి, ఎక్స్ఎంఎల్ ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి.
స్టెప్ 6: ఐటీఆర్ వెరిఫికేషన్‌ను కన్ఫర్మ్ చేయాలి.
ఈ–ఫైలింగ్ పూర్తయిందంటూ పేర్కొనే మెసేజ్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఐటీఆర్ వెరిఫికేషన్ రసీదు ఫారమ్ ఈ మీ–మెయిల్ ఐడికి వస్తుంది.
స్టెప్ 7: ఈ–-వెరిఫై రిటర్న్
నెట్‌బ్యాంకింగ్, ఏటీఎం, ఆధార్ ఓటీపీ, బ్యాంక్ ఖాతా నంబర్, డీమ్యాట్, మొబైల్ నంబర్ & ఈ–మెయిల్ ఐడిలలో ఏదో ఒక దానితో రిటర్న్‌ను ఈ-–వెరిఫై చేయండి. ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ వల్ల ఐటీఆర్-5 రసీదు ఫిజికల్ కాపీని సీపీసీకి పంపవలసిన అవసరం ఉండదు.