యూత్ ప్యాషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫేస్ క్రీం దగ్గరి నుంచి షూ వరకు జనాలు డిజైన్ పద్దతులు పాటిస్తున్నారు. మొహం, చేతులు అంటే సరే.. చివరకు కాళ్లకు తొడిగే షూస్ కూడా స్టైలిష్ గానే వాడుతున్నారు. విభిన్న రకాల చెప్పులు... షూస్ కోసం కొంతమంది వేలాది రూపాయిలు ఖర్చు చేస్తారు. కొని వాటిని పక్కన పడేస్తారు. కొత్తగా ఉన్నప్పుడు వాటిని ధరించాలంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. షూ రాపిడి వల్ల పాదాలపై బొబ్బలు రావడం.. పుండ్లు పడటం జరుగుతుంది. ఇలాంటి సమస్యల వల్ల వేలాది రూపాయిల షూస్ నిరుపయోగంగా పక్కన పడేస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు కొన్ని చిట్కాలతో బయటపడవచ్చు.. ఇప్పుడు ఆ చిట్కాలను తెలుసుకుందాం. . .
షూలను కొనుగోలు చేయాలని దుకాణాలకు వెళ్ళినప్పుడు వాటిని ఒకసారి వేసుకుని అటుఇటు నడవాలి. పాదాలు వత్తుకున్నట్లు అనిపించటం కాని, రాపిడి ఉన్నాగాని వాటి వల్ల ఇబ్బంది కలుగుతుందన్న అంచనాకు రావాలి. అలాగా ఉన్నప్పుడు ఆ షూస్ కొనుగోలు చేయకపోవటమే మంచిది. ఒకవేళ షూ కొనుగోలు చేసిన తరువాత పాదాలకు ఇబ్బందులు తలెత్తితే అలాంటి వాటిని వేసుకోకుండా పక్కన పడేయటమే మంచిది. ఎందుకంటే సమస్య మరింత జఠిలం అయ్యే ప్రమాదం ఉంటుంది.
షూ రాపిడి చాలా మందిని బాధిస్తుంది. తీవ్రమైన మంటతోపాటు, పాదాల నొప్పి కూడా వస్తుంది. అలాంటి సందర్భంలో తక్షణ ఉపశమనం కోసం ఐస్ క్యూబ్ లను గుడ్డలో చుట్టి నొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టాలి. ఇలా చేయటం ద్వారా నొప్పితోపాటు, ఆప్రాంతంలో వాపును కూడా తగ్గించుకోవచ్చు. షూ కాటు కారణంగా ఏర్పడిన గాయాలు త్వరగా మానేందుకు కొబ్బరి నూనె, పసుపు కలిపి లేపనంగా అప్లై చేయటం ద్వారా పడిన గాయం త్వరగా మానిపోతుంది. అలాగే టూత్ పేస్ట్ ను రాసి కొద్ది సమయం తరువాత గుడ్డతో తుడిచిచేయాలి. అపై వాసెలిన్ జెల్లీ, కొబ్బరి నూనె వంటివాటిని అప్లై చేయటం ద్వారా గాయం త్వరగా మానేలా చేయవచ్చు.
షూధరించటం వల్ల పాదాలకు బొబ్బలు రావటం, పుండ్లు పడటం వంటివి జరిగితే వాటిని వాడకుండా పక్కన పడేయాలి. వాటికి స్ధానంలో చెప్పులు ధరించాలి. గాయాలు త్వరగా మానాలంటే గాలి తగిలే విధంగా ఓపెన్ గా ఉండేలా చెప్పులు ధరించటమే ఉత్తమమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. చర్మం రాపిడికి గురైన ప్రాంతంలో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. చివరకు అది ఇన్ ఫెక్షన్ కు దారి తీసే ప్రమాదం ఉన్నందున దాని నివారించేందుకు యాంటీ బయాటిక్ ఆయింట్ మెంట్లను అప్లై చేయాలి.