విశ్లేషణ: ఆహార వృథాను  తగ్గించేదెలా?

ఆకలి కేకలతో ఎంతోమంది నిరుపేదలు పట్టెడన్నం కోసం రోజూ ఎదురుచూస్తున్నారు. మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఆకలి కేకలు పెరిగిపోతున్నాయి. కరోనా సంక్షోభం కారణంగా పేదలు మరింత పేదలుగా మారిన పరిస్థితి ఎక్కువైంది. మరోవైపు ఏటా ప్రపంచవ్యాప్తంగా ఆహార వృథా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ ఒక్క ఏడాదే దాదాపు 931 మిలియన్‌‌ టన్నుల ఫుడ్​ వేస్టయినట్లు యునైటెడ్​ నేషన్స్ నివేదికలో వెల్లడయ్యింది. మిగతా దేశాల మాట పక్కన పెడితే మనదేశంలోని ఇండ్ల నుంచే ఏటా 68.7 మిలియన్‌‌ టన్నుల ఫుడ్​ వేస్ట్​ అవుతున్నట్లు యునైటెడ్​ నేషన్స్​ ఎన్విరాన్‌‌మెంటల్‌‌ ప్రోగ్రామ్​ రూపొందించిన ఫుడ్​ వేస్ట్​ ఇండెక్స్‌‌ 2021 రిపోర్ట్​లో స్పష్టమైంది. ఆహార వృథాను తగ్గించేందుకు మనమందరం కలిసి ముందుకు సాగితేనే.. ఆరోగ్య ప్రపంచాన్ని సాకారం చేయగలం.

మనది వేద భూమి.. మెతుకు విలువ తెలిసినోడికే బతుకు విలువ తెలుస్తది అంటూ ఎన్నో సామెతలు ఇక్కడి నుంచే పుట్టుకొచ్చాయి. కానీ మెతుకు దొరక్క.. బతుకు బరువైన జీవితాలు ఎన్నో ఈ నేలపైనే కాలం వెళ్లదీస్తున్నాయి. అన్నం ప్రసాదంలా భావించి పంట పండించే రైతు కూడా ఈ రోజు పస్తులుండే పరిస్థితులు వచ్చాయి. ఒకవైపు ఇంత మంది తిండి దొరక్క అల్లాడుతుంటే.. మరోవైపు టన్నుల కొద్దీ ఫుడ్ వేస్ట్​ అయిపోయి నేలపాలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 931 మిలియన్ టన్నుల ఆహారం వ్యర్థమైపోతోంది. ఇందులో 569 మిలియన్ టన్నులు(61 శాతం) ఇంటి నుంచే వృథా అవుతుండగా, 244 మిలియన్‌‌ టన్నులు(26 శాతం) హోటళ్ల వ్యర్థాలు కాగా, మరో 118 మిలియన్ టన్నుల రిటైల్ ఆహార‌‌ వ్యర్థాలు(13 శాతం) ఉన్నాయి. ప్రపంచ దేశాల వార్షిక తలసరి వ్యర్థాలు 121 కేజీలు ఉండగా, అందులో 74 కేజీలు గృహ వ్యర్థాలు, 32 కేజీలు హోటళ్ల వ్యర్థాలు, రిటైల్‌‌లో 15 కేజీల ఆహారం వృథా అవుతోంది. ఇండియాలో 68.7 మిలియన్ టన్నుల (వార్షిక తలసరి ఫుడ్‌‌ వేస్ట్ 50 కేజీలు) ఆహారం వృథాగా ఇంట్లోంచే చెత్తకుప్పల్లోకి వెళుతోంది.

ఫుడ్​ వేస్టేజీని తగ్గించే దిశగా..

ఇండ్లు, హోటల్స్, రిటైల్‌‌ ఔట్‌‌లెట్స్‌‌ ద్వారా ఆహారం ఎక్కువగా వృథా అవుతోంది. భోజనం తర్వాత మిగిలిన ఎముకలు, పీచు పదార్థాలు లాంటి తినడానికి వీలుకాని వ్యర్థాలను బయట వేయడం సాధారణంగా జరుగుతుంది. కానీ శుభకార్యాలు, విందు భోజనాల తర్వాత మిగిలిన ఆహారాన్ని డస్ట్ బిన్‌‌ లేదా బయట పారేయడం నేరంతో సమానమని గమనించాలి. ఆహార ఉత్పత్తిలో రైతన్న శ్రమ, నీటి వినియోగం, ఎరువులు/క్రిమి సంహారకాలు, ఆర్థిక వనరులు, వ్యవసాయ వనరులు ఎన్నిటినో ఉపయోగిస్తున్న విషయం గుర్తుంచుకోవాలి. ఫుడ్‌‌ వేస్టేజ్‌‌తో వాతావరణ మార్పులు, ప్రకృతి విధ్వంసం, జీవ వైవిధ్యం, కాలుష్యం, నీటి కొరత, భూసారం దెబ్బతినడం, ఆర్థిక దుష్ప్రభావం ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆహార వ్యర్థాల ఫలితంగా 8–10 శాతం గ్రీన్‌‌ హౌస్​ గ్యాసెస్‌‌ విడుదల అవుతున్నాయని నిఫుణులు చెబుతున్నారు. కరోనా రికవరీ ప్రణాళికల్లో ఆహార వ్యర్థాలను తగ్గించడం ప్రధాన అంశం. ఫుడ్​ వేస్టేజీని తగ్గించే యజ్ఞంలో ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, రైతులు, పౌర సమాజం, స్వచ్ఛంధ సంస్థలు సమన్వయంతో పని చేయాలి. ఆహార పదార్థాలను ఆలోచించి పరిమితంగా కొనడం/తయారు చేసుకోవడం.. అవసరం మేరకే వాడడం.. సమతుల పోషకాహారాన్ని ఆస్వాదించడం వంటి చర్యలతో వేస్టేజీని తగ్గించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ రక్షణ, ఆర్థిక నష్ట నివారణ సాధించగలం. అన్నాన్ని జీవ ఇంధనంగా భావించి, ఒక్కొక్క మెతుకులో దాగిన కర్షక శ్రమను గౌరవించి, ఫుడ్‌‌ వేస్ట్‌‌ కాకుండా జాగ్రత్త పడుతూ ఆరోగ్య మానవాళిని నిర్మించుకుందాం. ఫుడ్​ వేస్టేజీ కట్టడి చేయడం ద్వారా ఆహార భద్రత, డబ్బు ఆదా, నీటి లభ్యత, నేల నాణ్యత, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య స్థాపన, వ్యర్థాల నిర్వహణ లాంటి ప్రయోజనాలు కలుగుతాయి.

ఏటా పెరుగుతున్న వృథా

ప్రపంచవ్యాప్తంగా 690 మిలియన్ల ప్రజలు ఆకలి కోరల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా కరోనా కల్లోలం తర్వాత 3 బిలియన్ల ప్రజలు పోషకాహారానికి దూరమయ్యారు. ప్రపంచ ఆహార ఉత్పత్తిలో 17 శాతం ఫుడ్‌‌ వేస్టేజ్‌‌ జరుగుతుండగా, ఇండియాలో వార్షిక తలసరి 50 కేజీల ఫుడ్​ వేస్ట్​ చేస్తున్నారని యూఎన్ నివేదిక తెలిపింది. అతి తక్కువ ఫుడ్‌‌ వేస్ట్ ఆస్ట్రియాలో ఉంది. అక్కడ వార్షిక తలసరి ఆహార వృథా 39 కేజీలుగా ఉంది. అత్యధికంగా నైజీరియాలో 189 కేజీల ఆహార వ్యర్థాలు నమోదయ్యాయి. అమెరికాలో తలసరి ఫుడ్‌‌ వేస్ట్ 59 కేజీలు(19.4 మిలియన్‌‌ టన్నులు). చైనాలో ఏడాదికి తలసరి ఫుడ్‌‌ వేస్ట్ 64 కేజీలు అంటే 91.6 మిలియన్‌‌ టన్నులు ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో తలసరి వార్షిక వేస్టేజీ 79 కేజీలుగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తలసరి ఫుడ్​ వేస్ట్ 76 కేజీలుగా నమోదైంది. అల్పాదాయ, పేద దేశాల్లో కూడా ఫుడ్ వేస్టేజ్​ ఎక్కువగానే ఉంటోంది. అక్కడ తలసరి ఆహార వృధా 91 కేజీలు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రువాండాలో 164 కేజీలు, గ్రీస్‌‌లో 142, దక్షిణ ఆఫ్రికాలో 134, బహ్రెయిన్​ లో 132, టాంజానియాలో 119, ఇజ్రాయిల్‌‌/లెబనాన్‌‌/ సౌదీ అరేబియాల్లో 105, ఆస్ట్రేలియాలో 102, కెన్యాలో 100, అఫ్ఘానిస్తాన్‌‌లో 82, భూటాన్‌‌/నేపాల్‌‌లో 79 , శ్రీలంకలో 76, పాకిస్థాన్‌‌లో 74 , బంగ్లాదేశ్‌‌లో 65 కేజీల ఫుడ్​ వేస్టేజ్​ రికార్డ్​ అయ్యింది.
- బుర్ర మధుసూదన్ రెడ్డి, 
సోషల్‌‌ యాక్టివిస్ట్.