
కొద్దిరోజుల క్రితం ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ‘లక్ష్మీబాయి కాలేజ్’ ప్రిన్సిపాల్.. ఎండవేడి తీవ్రతను తగ్గించడానికి తరగతి గదుల గోడలపై ఆవుపేడను రాయడం జరిగింది. ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆవు పేడ, మట్టి మిశ్రమాన్ని పురాతన కాలం నుంచి సాంప్రదాయకంగా గ్రామీణ భారతదేశంలో శీతలీకరణ, ఇన్సులేటింగ్ మెటీరియల్‌గా ఉపయోగించడం జరుగుతోంది.
ఈ మిశ్రమం ఉష్ణోగ్రతను నియంత్రించడంతోపాటు యాంటీ బాక్టీరియల్, కీటకాలను నియంత్రించేందుకు ఉపయోగపడుతోంది. కొన్ని ఆఫ్రికన్ దేశాలలో కూడా ఇప్పటికీ ఇలాంటి పద్ధతులను ఉపయోగిస్తారు. కానీ, సున్నం లేదా సిమెంటును ఉపయోగించి నిర్మించే ఆధునిక భవనాలలో ఆవుపేడను శీతలీకరణిగా ఉపయోగించడం సరైన పద్ధతి కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. దీనికి బదులుగా ఆధునిక భవనాలలో ఎండవేడిని తగ్గించడానికి కొన్ని పర్యావరణ అనుకూల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
సాధారణంగా ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవటానికి ఎయిర్ కండీషనర్లను వాడతారు. ఎయిర్ కండిషనర్లు ఫ్లోరినేటెడ్ (క్లోరో ఫ్లోరోకార్బన్స్) వాయువులను విడుదల చేస్తాయి. ఇటువంటి ఉద్గారాలు ఓజోన్ పొర క్షీణతను మరింత పెంచుతాయి. కాబట్టి, అతిగా ఎయిర్ కండిషనర్ల వాడకం సరైన విధానం కాదు. వృక్షాలు ‘బాష్పోత్సేకం’(ట్రాన్స్పిరేషన్) ప్రక్రియ ద్వారా ప్రకృతిసిద్ధ ఎయిర్ కండిషనర్లుగా పనిచేస్తాయి. మొక్కలు తమ వేర్ల ద్వారా నేల నుంచి నీటిని సంగ్రహించి, ఆకుల ద్వారా నీటి ఆవిరిని గాలిలోకి విడుదల చేసే ప్రక్రియను బాష్పోత్సేకం (ట్రాన్స్పిరేషన్) అని అంటారు. ఈ ప్రక్రియ ద్వారా చెట్లు, మొక్కలు తమను తాము చల్లబరుచుకుంటాయి. చుట్టుపక్కల గాలిని, వాతావరణాన్ని చల్లబరుస్తాయి.
వాతావరణ తేమలో 10% కంటే ఎక్కువ బాష్పోత్సేకం నుంచి వస్తుంది. ఇది నీటిచక్రంలో ఒక భాగం. బాష్పోత్సేకం శీతలీకరణ ప్రభావం వాతావరణ ఉష్ణోగ్రత తగ్గింపులపై అధికంగా ఉంటుంది. బాష్పోత్సేకం వలన దట్టమైన వృక్షసంపద ఉన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రత తగ్గింపు ఉన్నట్లు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రత బాష్పోత్సేకం రేటును పెంచుతుంది.
కాబట్టి వేసవికాలంలో వేడి తీవ్రతను తగ్గించడానికి, వాతావరణాన్ని చల్ల పరచటానికి ఇంటి పరిసరాలలో, పనిచేసే కార్యాలయాల చుట్టూ చెట్లను పెంచడం సరైన పరిష్కారం. ఉదారణకు ఒక మామిడిచెట్టు ఐదు ఎయిర్ కండిషనర్లకు సమానం. ఇంటి పైకప్పులో చిన్న చిన్న మొక్కలను పెంచడం వలన ఎండాకాలంలో ఇంటిని చల్లగా ఉంచడమేకాక భవనం ఆకర్షణీయంగా మారుతుంది. ఇంటి పైకప్పుపై తెల్లని సున్నం వంటి వాటిని పూయటం ద్వారా కూడా ఎండవేడి
తీవ్రతను తగ్గించవచ్చును.
పెరుగుతున్న విద్యుత్ వినియోగం
ఎనర్జీ & వెట్‌ల్యాండ్స్ రీసెర్చ్ గ్రూప్, సెంటర్ ఫర్ ఎకోలాజికల్ సైన్సెస్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఒక వ్యక్తి సంవత్సరానికి 1,300 నుంచి 1,500 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం, గ్లాస్ ఫసాడ్స్ను ఉపయోగించడం వల్ల ఒక వ్యక్తి సంవత్సరానికి వినియోగించే విద్యుత్ 14,000 నుంచి17,000 యూనిట్లు వరకు పెరిగింది. దాదాపు సుమారు పదిరెట్లు పెరిగింది. అంటే గాజు పదార్థాలు, గ్లాస్ ఫసాడ్స్ను భవనాలలో, కార్పొరేట్ కార్యాలయాలలో వాడడం వలన గ్లోబల్ వార్మింగ్, వేడితీవ్రత పెరుగుతుంది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్త డాక్టర్ టీవీ రామచంద్రన్ నివేదిక ప్రకారం గాజు పదార్థాల వాడకం శీతల దేశాలకు పనికివస్తుంది. కానీ, భారతదేశం వంటి ఉష్ణమండల దేశాలకు గాజుపదార్థాల వాడకం శ్రేయస్కరం కాదు. గ్లోబల్ వార్మింగ్ ప్రక్రియ ను 'హరిత మందిర ప్రభావము' (గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్) అనికూడా అంటారు. గ్లోబల్ వార్మింగ్ ప్రక్రియకు, హరితమందిర ప్రభావానికి మధ్య పోలికలు ఉండటమే దీనికి కారణం.
‘హరిత మందిరం’ అనేది గాజు పదార్థంతో తయారుచేయబడుతుంది. హరిత మందిరాన్ని నియంత్రిత వాతావరణంలో మొక్కలను పెంచడానికి ఉపయోగిస్తారు. గ్లోబల్ వార్మింగ్ ప్రక్రియలో వాతావరణంలోని హరిత వాయువుల వలె హరితమందిర గాజు పదార్థం కూడా ఎండవేడి తీవ్రతను పెంచుతుంది. గాజు పదార్థాలతో కూడిన నిర్మాణాలు ఎండవేడి తీవ్రతను మరింతగా పెంచుతాయి.
వేడితీవ్రతను పెంచుతున్న గాజు పదార్థాలు
భవన నిర్మాణాలలో, కార్పొరేట్ కార్యాలయాలలో గాజుతో తయారుచేసిన కిటికీలు, స్లయిడింగ్ డోర్స్, గ్లాస్ ఫసాడ్స్ (గాజు భాగాలు)లను ఉపయోగించడం వలన భూమి ఉష్ణోగ్రతలు, ఎండ వేడి తీవ్రత పెరుగుతాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రక్రియలో సూర్యకాంతి భూమిని తాకినప్పుడు ఆ కాంతిలోని కొంతభాగాన్ని భూమి శోషించుకొని మిగతా కాంతిని పరారుణ కాంతి రూపంలో వాతావరణంలోనికి పరావర్తనం చేస్తుంది. కానీ, వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి హరిత వాయువులు ఈ పరావర్తనం చెందిన పరారుణ కాంతిని శోషించుకొని తిరిగి భూమి పైకి వెదజల్లడం వలన వాతావరణం వేడెక్కుతుంది.
వాతావరణంలోని హరిత వాయువుల వలె గాజు పదార్థాలు పరావర్తనం చెందిన పరారుణ కాంతిని శోషించుకొని తిరిగి భూమిపైకి వెదజల్లడం వలన వేడితీవ్రత పెరుగుతుంది. దీంతో వాతావరణం వేడెక్కుతుంది. గాజుతో అమర్చిన భవనాల (గ్లాస్ ఫసాడ్స్) పరిసరాల్లో ఉష్ణోగ్రత కనీసం 7 డిగ్రీలు పెరుగుతుంది. ఈ వేడిని తట్టుకోవడానికి ఎయిర్ కండిషనర్లు వంటివి వాడటం వలన విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఇది గ్లోబల్ వార్మింగ్ పెరుగుదలకు దారితీస్తుంది.
వేడిని తగ్గించుకునే పద్ధతులు
ఇంటి బయట గాలి ఉష్ణోగ్రత, ఇంటి లోపల గాలి ఉష్ణోగ్రత కంటే చల్లగా ఉన్నప్పుడు... ఇంటి లోపలికి గాలి ప్రవాహాన్ని పెంచేందుకు కిటికీలను తెరిచి ఉంచవలెను. ఈ విధంగా రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తే మంచిది. బయట చల్లగా ఉంటే, తెరిచి ఉన్న కిటికీ ముందు పెడెస్టల్ ఫ్యాన్ పెట్టడం వల్ల బయటి నుంచి వచ్చే తాజా గాలి గది అంతటా విస్తరిస్తుంది. అదేవిధంగా వీచేగాలిని మరింత చల్లబరచడానికి పెడెస్టల్ ఫ్యాన్ ముందు ఐస్ క్యూబ్‌లను కూడా పెట్టవచ్చును.
ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో ముఖ్యంగా సూర్యకాంతి పడుతున్నవైపువున్న గాజు కిటికీలను మూసివేసి, కర్టెన్లు వేసి ఉంచడం మంచిది. గాలి ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంటే విద్యుత్ ఫ్యాన్లను వాడవలెను. కానీ, ఫ్యాన్ గాలి నేరుగా శరీరంపై పడేవిధంగా ఉంచకూడదు. ఎందుకంటే ఇది శరీరంలోని నీటి నిర్జలీకరణానికి దారితీస్తుంది. ఓవెన్లు, కుక్కర్లను వాడే సమయంలో ఇంట్లోకి చాలా వేడిని విడుదల చేస్తాయి.
రోజులో అత్యంత వేడిగా ఉండే సమయాల్లో సలాడ్‌లు వంటి చల్లని ఆహార పదార్థాలను తినడం వల్ల అనవసరమైన వేడి ఉత్పత్తిని తగ్గించవచ్చును. ద్విచక్ర వాహనదారులు లేదా పాదచారులు బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎక్కువ నీడ ఉన్న ప్రదేశాల గుండా వెళ్లాలి. వదులుగా ఉన్న కాటన్ దుస్తులను ధరించవలెను. ఈవిధమైన కొన్ని పద్ధతులను అనుసరించడం ద్వారా వేసవికాలం వేడి తీవ్రతను తగ్గించవచ్చును.
- డా.శ్రీధరాల రాము,
ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్