లంచం.. లంచం.. లంచం.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. మనిషి పుట్టాకతో మొదలయ్యే ఈ లంచం.. చచ్చేదాకా, ఇంకా చెప్పాలంటే చచ్చిన తర్వాత కూడా అంతం కాదు. లంచం తీసుకునే వారికే కాదు.. ఇచ్చేవారికి కూడా ఇకపై కఠిన శిక్షలు పడనున్నాయి. ఈ మాటలు మనం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వింటున్నాం. విన్నప్పుడు బాగానే అనిపిస్తుంది. కానీ ఏదైనా ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లినప్పుడు జేబులకు చిల్లుపడుతున్న పరిస్థితి నేటికీ ఉంది. అవినీతి కట్టడి కోసం దేశంలో చట్టాలు ఉన్నా.. చాలామంది అధికారులు వాటిని లెక్క చేస్తలేరు. దీంతో పాత అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనలు సవరిస్తూ తాజాగా కేంద్రం రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టింది. దీనికి మూజువాణి పద్ధతిలో ఓటింగ్ జరగ్గా, సభ్యులు ఏక గ్రీవంగా మద్దతు తెలిపారు. నిబంధనల సవరణతో ఇకపై లంచం తీసుకునేవారికి మూడు నుంచి ఏడేండ్ల జైలుశిక్ష, జరిమానా విధించొచ్చు. అలానే లంచం ఇచ్చేవారికి కూడా ఇదే తరహాలో ఏడేండ్ల వరకు జైలుశిక్ష, జరిమానా విధించనున్నారు. ఈ నిబంధనలు వ్యక్తులకే కాదు, సంస్థలకి కూడా వర్తించనున్నాయి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో లంచం ఇవ్వాల్సి వచ్చిన వారు వారం రోజుల్లోపు అవినీతి నిరోధక అధికారులకు సమాచారం అందించి శిక్ష నుంచి మినహాయింపు పొందవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు. అవినీతి కేసుల విచారణ వేగవంతంగా పూర్తి చేసేందుకు ఈ మేరకు నియమ నిబంధనలను సవరించినట్లు ఆయన వివరించారు. ఇక ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందాల్సి ఉంది. చట్టాలను పక్కాగా అమలు చేస్తేనే అవినీతి అంతమవుతుంది.
అవినీతి కట్టడికి సరైన చట్టాలు లేని కారణంగా రోజురోజూకీ అది పెచ్చరిల్లిపోతోంది. సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్లి.. చెయ్యి తడపనిదే ఫైల్ కదిలే పరిస్థితి లేదు. అమెరికా కేంద్రంగా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ఏటా వెలువరించే నివేదికలో ప్రపంచ దేశాల్లో మన ఇండియా అవినీతిలో ముందంజలో ఉండటం బాధాకరం. నేపాల్, శ్రీలంక, పాక్ లాంటి దేశాల్లో అవినీతి మన దేశం కన్నా తక్కువే. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ, ట్రెజరరీ, సబ్-రిజిస్ట్రార్, ఆర్టీఏ, పోలీస్, ఫైర్స్, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ, సచివాలయం, అబ్కారీ, వైద్య విధాన పరిషత్, పరిశ్రమల శాఖ, విద్యాశాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, న్యాయస్థానాలు తదితర ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. నిత్యం టీవీల్లో, న్యూస్ పేపర్లలో ఏసీబీ అధికారులు అవినీతిపరులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చూడని రోజంటూ ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు. వేల మంది లంచావతారుల్లో ఒక్కరో, ఇద్దరో దొరుకుతున్నారంతే. అది కూడా లంచం బాధితులు ఇచ్చే సమాచారం పుణ్యమా అని. మిగతా వారు లంచాలు తీసుకుంటూనే ఉన్నారు.
చట్టాల్లో మార్పులు అవసరం
అవినీతి అధికారులను పట్టుకున్నప్పుడు, వారు నిజంగా అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ అయితే వారి యావత్ ఆస్తిపాస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా మన చట్టాల్లో మార్పులు చేయాలి. ఇందుకు కేంద్ర న్యాయశాఖ, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు పార్లమెంటులో కీలక పదవుల్లో ఉన్న అన్ని రాజకీయ నాయకులతోపాటు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. కీలక పోస్టుల్లో ఉన్న అధికారులు కూడా ప్రతి ఆరు లేదా మూడు నెలలకు వారి స్థిర, చరాస్తుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించేలా చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లో నిశితంగా పరిశీలిస్తే అవినీతి మూలంగా సీసీరోడ్లు, ఇతర నిర్మాణ పనులకు నాలుగు నెలలకే పగుళ్లు రావడం, రేషన్ తూకంలో మోసాలు, అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లు, పాలు సహా సరుకులు బ్లాక్ మార్కెట్లోకి తరలడం. రెవెన్యూ పట్టాదారు పాసు పుస్తకాలు, సాదా బైనామాలకు సంబంధించి డబ్బులు ఇవ్వనిదే పనులు కాకపోవడం, హెల్త్ సెంటర్ల నుంచి మందులు ప్రైవేట్ మెడికల్ షాపులకు తరలడం, అక్రమ విద్యుత్ వాడకం, వాటర్ వర్క్స్ అక్రమ నల్లా కనెక్షన్ వరకు అవినీతే వెళ్లూనుకుంది.
సీఎం చెప్పినా..
రెండోసారి బంగారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఓ సభలో మాట్లాడుతూ.. ‘‘లంచం అడిగితే చెప్పుతో కొట్టండి’’ అని అన్నారు. ఆయన మాటలు పత్రికలు, మీడియా మాధ్యమాల్లో వచ్చాయి. అయినా సీఎం మాటలను ఎవరూ ఆచరణలో పెట్టడం లేదు. లంచం తీసుకుంటే ఏమవుతుంది లే అన్న ఉదాసీనత కొందరు అధికారుల్లో కనిపిస్తోంది. అలాంటి వారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం.. ప్రతి ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వ ప్రకటనలు, ప్రభుత్వ యార్డులు, రైతుల పాసుపుస్తకాలు, రేషన్‌కార్డు, ఓటరు కార్డు, ఆధార్ కార్డు, పోస్టర్లు, పౌరసేవా పత్రాల్లో లంచం నిర్మూలించేందుకు ఏసీబీ అధికారుల వివరాలు ప్రజలకు తెలిసేలా ప్రింట్చేయాలి. గ్రామపంచాయతీ గోడలు మొదలుకొని సీఎం ఆఫీసు గోడల దాకా వివరాలు పేర్కొనాలి. పాఠ్యపుస్తకాల్లోనూ ఏసీబీ అధికారుల ఫోన్ నెంబర్లు ముద్రించాలి. అవినీతిపై నిరంతరం పోరాటం మండల ఆఫీసు నుంచి సచివాలయం వరకు సాగాలి. ప్రభుత్వం అవినీతి వ్యతిరేక వ్యవస్థలను ఏర్పాటు చేసి పనిచేయించాలి. ఈ పోరాటంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలి. అవినీతి పరులను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించినప్పుడే అవినీతి అంతం అవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారుల ఆదాయపు పట్టికను ఆ కార్యాలయంలో బోర్డుపై పారదర్శకంగా పెట్టాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తెస్తేనే.. అవినీతి లేని భారతదేశం మార్పునకు నాంది పలుకుతుంది. లేదంటే శ్రీశ్రీ చెప్పినట్లు ‘కాదేదీ అవినీతికి అనర్హం’ అన్న పదాలు ఇంకా మరిన్ని దశాబ్దాలు, శతాబ్దాలు వాడుకలో ఉంటాయి!.
- మన్నారం నాగరాజు రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ