కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 సంబంధించి కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాగా బడ్జెట్ పై పూర్తి అవగాహన అందరికీ ఉండదు. బడ్జెట్ ను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనకు కొన్ని విషయాలు తెలియాలి. వాటి గురించి మీకు క్లుప్తంగా..
ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి..?
మన దేశంలో ఆర్థిక సంవత్సరం ప్రతి ఏటా ఏప్రిల్ 1న ప్రారంభమై.. తర్వాతి ఏడాది మార్చి 31న ముగుస్తుంది.
వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు లేదా పరిమితి అంటే
దేశంలోని వ్యక్తులు ఏడాది కాలంలో సంపాదించే ఆదాయానికి ఎంత వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదో చెప్పేదే పరిమితి
ప్రత్యక్ష పన్నులు:
దేశ ప్రజలు నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులను ప్రత్యక్ష పన్నులు అంటారు. ప్రత్యక్ష పన్నుల భారం నేరుగా ప్రజలపైనే పడుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి జీతం ద్వారా కానీ.. వ్యాపారం ద్వారా కానీ సంపాదించిన మొత్తంపై పడే పన్ను.
పరోక్ష పన్నులు:
దేశ ప్రజలపై ప్రత్యక్షంగా భారం పడని పన్నులను పరోక్ష పన్నులు అంటారు. ఉదాహరణకు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అనగా ఏదైనా వస్తువు కొన్నప్పుడు లేదా ఏదైనా సేవలు పొందినప్పుడు పన్ను కలిపి మనం చెల్లిస్తాం.
మూలధన లాభాలు:
ఏదైనా కొన్న తర్వాత ఏడాదిలోపు వ్యవధిలో వాటిపై పొందే లాభాలను మూలధన లాభాలు అంటారు. వీటిలో స్వల్ప కాలం, దీర్ఘరకాలం అని ఉంటాయి. ఏడాది లోపు వచ్చిన లాభాన్ని స్వల్ప కాల మూల ధన లాభం అంటారు. ఏడాది దాటిన తర్వాత వచ్చే లాభాన్ని దీర్ఘకాల మూలధన లాభం అంటారు.
జీడీపీ అంటే ఏంటి..?
ఒక ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల మొత్తం విలువను జీడీపీ లేదా స్థూల దేశీయోత్పత్తి అంటారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిని ఇది సూచిస్తుంది.
ద్రవ్య లోటు అంటే ఏంటి..?
ప్రభుత్వ వ్యయం రాబడిని మించితే దాన్ని ద్రవ్య లోటు అంటారు.
కరెంటు ఖాతా లోటు:
వస్తు, సేవల ఎగుమతుల విలువ, దిగుమతుల విలువ మధ్య తేడాను కరెంటు ఖాతా లోటు అంటారు.
పెట్టుబడుల ఉపసంహరణ:
ప్రభుత్వ రంగ సంస్థల్లోని తన వాటాలను ప్రభుత్వం అమ్మితే పెట్టబడుల ఉపసంహరణ అంటారు.
ఆర్థిక బిల్లు:
కొత్త పన్నులు.. పాత పన్నుల్లో మార్పులను ఇది సూచిస్తుంది. బడ్జెట్ సమర్పించిన వెంటనే దీనిని ప్రవేశపెడతారు.
రెపో రేటు అంటే ఏంటి..?
ఆర్‌బీఐ తమకు ఇచ్చే రుణాలపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటును రెపో రేటు అంటారు.