టెక్నాలజీ : పాత గాడ్జెట్స్​ పనికొచ్చేలా!

టెక్నాలజీ : పాత గాడ్జెట్స్​  పనికొచ్చేలా!

ఈ మధ్య ఎలక్ట్రానిక్ వేస్ట్​ అనేది బాగా పెరిగిపోతోంది. ఎనిమిదేండ్ల క్రితంతో పోలిస్తే గ్లోబల్​గా 21 శాతం ఎలక్ట్రానిక్​ వేస్ట్ పెరిగిపోయింది. ఇందులో ఫోన్స్​ వంటివి ఎక్కువగా ఉంటున్నాయట. అందుకని కొత్త గాడ్జెట్​ చేతికి రాగానే పాత గాడ్జెట్స్​ ఏం చేస్తున్నాం అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. పాత ఫోన్లు, ల్యాప్​టాప్స్​, కెమెరాలను డొమెస్టిక్​గా ఎన్నిరకాలుగా వాడొచ్చో తెలిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది.


స్మార్ట్ ఫోన్​ని సెక్యూరిటీ కెమెరాగా మార్చుకోవచ్చు. ఈ సెటప్​ కోసం ఒక ట్రైపాడ్​ లేదా మౌంట్​ అవసరం. కెమెరా కోసం అవసరమైన యాప్​ ఇన్​స్టాల్​ చేసుకుంటే చాలు. ఇదే సూత్రం ట్యాబ్లెట్స్​కు కూడా వర్తిస్తుంది. కాకపోతే ట్యాబ్లెట్​ పెద్ద సైజ్​లో ఉంటుంది. కాబట్టి దాన్ని పొజిషన్​ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య వస్తున్న చాలా ఫోన్లు, ట్యాబ్లెట్స్​ వాటర్​ ఫ్రూఫ్​. కాబట్టి వీటిని అవుట్​డోర్స్​లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఎప్పుడూ పవర్​ సప్లయ్​ ఉండేలా చూసుకోవాలి.
పాత ఫోన్​, ట్యాబ్లెట్​ను మీడియా రిమోట్​లా వాడొచ్చు. వైర్​లెస్​ మీడియా స్ట్రీమింగ్​కు బోలెడు మార్గాలు ఉన్నాయి. యాపిల్​ ఎయిర్​ప్లే, గూగుల్​ క్రోమ్​కాస్ట్​ సిస్టమ్​ వాటిలో కొన్ని. ఇవేకాకుండా కొన్ని యాప్స్​ స్పీకర్స్​తో పాటు ఎన్నో సౌకర్యాలను ఇస్తున్నాయి. ఇవి ఉంటే పాత ఫోన్​ లేదా ట్యాబ్లెట్​ను మీడియా రిమోట్​ లేదా హబ్​గా వాడుకోవచ్చు. పాత ఐపాడ్​ను యాపిల్​ టీవీతో జత చేస్తే షోస్, సినిమాలు చూడొచ్చు. అదే పాత ఆండ్రాయిడ్​ ట్యాబ్లెట్​ను  క్రోమ్​కాస్ట్​ డాంగిల్​తో కలిపితే స్పోటిఫై లేదా యూట్యూబ్​ స్ట్రీమింగ్​ చేసుకోవచ్చు. ఇలాచేయడం వల్ల మీ కొత్త ఫోన్​ బ్యాటరీ లైఫ్​ సేవ్​ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాళ్లంతా ఈ డివైస్​ వాడి వాళ్లకి నచ్చింది చూసేయొచ్చు. అప్పుడు లాగిన్స్​ లేదా లాక్​ స్క్రీన్స్​ బాధలు ఉండవు కదా!


పాత ల్యాప్​టాప్​ను మీడియా సెంటర్​గా చేస్తే వీడియోలు చూడొచ్చు. మ్యూజిక్​ వినొచ్చు. దీనివల్ల కొత్త ల్యాప్​టాప్​లో హార్డ్​డ్రైవ్​ స్పేస్​ చాలావరకు ఫ్రీగా ఉంటుంది. ప్లెక్స్​ లేదా కోడి వంటి సాఫ్ట్​వేర్స్​ ఈ టాస్క్​కు బాగా ఉపయోగపడతాయి. ఇంట్లోనే కాకుండా ఇంటి బయట కూడా ఈ డివైస్​ పనిచేస్తుంది. లేదంటే యాపిల్​ ఇచ్చే మ్యాక్​ ఓఎస్​ మ్యూజిక్​, టీవీ యాప్స్​ కూడా వాడొచ్చు. వైర్​లెస్​ స్ట్రీమింగ్​ ప్రొటోకాల్​ ఇందులో సెటప్​ చేసేందుకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.
పాత డిజిటల్​ కెమెరాను వెబ్​ క్యామ్​ చేసేయండి. ఎంతో ఖరీదు పెట్టి కొనుక్కున్న డీఎస్​ఎల్​ఆర్​ కెమెరాను కొత్త మోడల్​ రావడం వల్ల పక్కన పెట్టాల్సి వస్తే కనుక దాన్ని వెబ్​ క్యామ్​గా వాడొచ్చు. నిజానికి చాలా ల్యాప్​టాప్​లు వెబ్​క్యామ్​తో వస్తాయి. కానీ స్ట్రీమ్​ వీడియోను హైక్వాలిటీలో ఇవ్వాలంటే ఈ టెక్నిక్​ బాగా పనిచేస్తుంది. సోనీ, కెనాన్​, ఫుజిఫిల్మ్​ వంటి కెమెరా కంపెనీలు సాఫ్ట్​వేర్​ ఎనేబుల్​ చేస్తున్నాయి. అందుకు అఫీషియల్​ టూల్స్​ ఉన్నాయి. గోప్రోలో ఇందుకోసం ఒక ప్రోగ్రామ్​ కూడా ఉంది. 


పాత ఫోన్​ లేదా ట్యాబ్లెట్​ను ఇ–రీడర్​గా మార్చేయొచ్చు. ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ల్లో ఉన్న కిండల్​, కోబో యాప్స్​ను ఇ–బుక్స్​ చదివేందుకు కొనొచ్చు. ఈ రెండు యాప్స్​ ఆడియో బుక్స్​కు సపోర్ట్​ చేస్తాయి. అదేకాకుండా టెక్స్ట్​, ఆడియో రెండింటికీ పనిచేస్తాయి. ఫిజికల్​ కిండల్​, కోబో ఇ–రీడర్​ కావాలనుకున్నా కూడా వాటిని ఫోన్​ లేదా ట్యాబ్లెట్​తో ఈజీగా సింక్​ చేసేయొచ్చు.


నిజానికి ఇ–రీడింగ్​ వల్ల ఫోన్​ లేదా ట్యాబ్లెట్స్​ బ్రైట్​ స్క్రీన్​ కళ్లకు ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమస్యను ఫిక్స్​ చేయాలంటే స్టాక్​ ఆండ్రాయిడ్​ ఫీచర్​ నైట్​ లైట్​ ఆన్​ చేసుకోవాలి. అదే ఐఓఎస్​లో అయితే నైట్ షిఫ్ట్​ అనే ఫీచర్​ ఎనేబుల్​ చేసుకోవాలి. ఈ ఫీచర్స్​ బ్లూ లైట్ ప్రభావం కళ్ల మీద తక్కువ పడేలా చేస్తాయి. 
మీ ఫోన్​లో ఉన్న ఫొటోలను సంవత్సరంలో ఎన్నిసార్లు చూసుకుని ఉంటారు ఒకసారి గుర్తుతెచ్చుకోండి. ఏందో ఒకట్రెండుసార్లు కదా! మీకు బాగా నచ్చిన ఫొటోలు మీ కళ్ల ముందే ఉండాలంటే పాత ట్యాబ్లెట్​ను ఫొటో ఫ్రేమ్​గా చేసేయండి. ఇంట్లో లేదా ఆఫీసులో దాన్ని పెట్టుకోవచ్చు. కాకపోతే పవర్​సప్లయ్​ కోసం ప్లగ్ పాయింట్​ ఉండాలి. ఇందుకు ఫోటో(Fotoo) అనే సాఫ్ట్​వేర్ కావాలి. ఆండ్రాయిడ్​ ట్యాబ్లెట్స్​కి బెస్ట్​ ఆప్షన్ ఇది​. ఒకవేళ  పాత ఐపాడ్​ వాడుతుంటే కనుక లైవ్​ఫ్రేమ్​ అవసరం. ఫొటో డిస్​ప్లే కోసం ఇవేకాకుండా ఇంకా బోలెడు ఆప్షన్స్​ ఉన్నాయి.

ఓల్డ్​ ల్యాప్​టాప్​ను డంపింగ్​ గ్రౌండ్​గా వాడొచ్చు తెలుసా! ఇంట్లో ఉన్న వేరే కంప్యూటర్ లేదా డివైస్​ల నుంచి ఏ రకమైన ఫైల్స్​ అయినా ఇందులో యాక్సెస్​ చేసుకోవచ్చు.  విండోస్​, మాక్​ ఓఎస్​ రెండింటిలో హోం నెట్​వర్క్​ కాన్​ఫిగరేషన్​ ఈజీ అవుతుంది. పాత ల్యాప్​టాప్​ల హార్డ్​ డ్రైవ్​కి​ కనెక్ట్​ అయిన కంప్యూటర్​లలో  విజిబుల్​గా ఉంటుంది.