- ఎన్నికల్లో విజయంపై కమల, ట్రంప్ ధీమా
- మద్దతుదారులను ఉత్సాహపరుస్తూ ప్రసంగాలు
- ఎన్నికలకు ఇంకొక్కరోజే.. వరుస ర్యాలీలతో బిజీబిజీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. మంగళవారం ఎన్నికలు జరగనుండగా.. సోమవారం చివరి రోజు ప్రచారంలో కీలకమైన మూడు నాలుగు రాష్ట్రాలను చుట్టి వచ్చేందుకు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు. ‘ఈ ఎన్నికల్లో మనమే గెలుస్తాం’ అంటూ ఇటు కమల, అటు ట్రంప్ తమ మద్దతుదారులను ఉత్సాహపరుస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు.
ఎకానమీ, తదితర అంశాలపై అమెరికన్ లకు తమ విధానాలే మేలు చేస్తాయని ఇద్దరు నేతలూ హామీ ఇస్తున్నారు. ఒకవైపు తమ మద్దతుదారులను ఓటు వేసేలా ఉత్సాహపర్చడంతోపాటు తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా ఏ చిన్న అవకాశాన్నీ వదలకుండా వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా కమలా హారిస్ శనివారం పలు చోట్ల ర్యాలీలు నిర్వహించడంతోపాటు రాత్రి సమయంలో న్యూయార్క్ లో ఎన్ బీసీ చానెల్ నిర్వహించిన ‘శాటర్ డే నైట్ లైవ్’ కామెడీ షోలో పాల్గొన్నారు.
ట్రంప్ మాత్రం పూర్తిగా ఎన్నికల ర్యాలీలపైనే దృష్టి పెట్టి ముమ్మరంగా ప్రచారం చేశారు. అయితే, గెలుపోటములను తేల్చే 7 స్వింగ్ స్టేట్స్ పైనే ఇద్దరు అభ్యర్థులూ ఫోకస్ పెట్టారు. రెండు రోజుల నుంచి వీరిద్దరూ స్వింగ్ స్టేట్స్ లోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ ఆ రాష్ట్రాలను తమ వైపు తిప్పుకునేలా తీవ్రంగా శ్రమిస్తున్నారు.
గెలుపుపై ఎవరికి వారే కాన్ఫిడెంట్..
ట్రంప్ శనివారం నార్త్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈసారి అమెరికా చరిత్రలోనే గొప్ప విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అటు ఎలక్టోరల్ ఓట్లతోపాటు ఇటు పాపులర్ ఓట్ లోనూ ఆధిక్యం చాటుతామని చెప్పారు. ‘‘మనం ప్రతి దాడిని, ప్రతి దూషణను, చివరికి రెండు సార్లు హత్యాయత్నాలను కూడా అధిగమించాం. ఇప్పుడు విజయాన్ని సాధించి తీరుతాం” అని ఆయన అన్నారు.
ఇక కమలా హారిస్ శనివారం జార్జియాలో ప్రచారం చేశారు. తాను కొత్త తరం లీడర్ ను అని, అమెరికాకు నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తన మద్దతుదారులంతా ముందస్తు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముందస్తు ఓట్లతో తనను గెలిపించాలని, దేశానికి కొత్త తరం నాయకత్వాన్ని అందించాలని కోరారు.
కమల ఓటుపై నో క్లారిటీ.. రేపు ఓటేయనున్న ట్రంప్
అట్లాంటా ర్యాలీలో అందరూ ముందస్తు ఓటింగ్లో పాల్గొనాలని కమల పిలుపునిచ్చారు. అయితే, ఆమె కూడా ముందస్తు ఓటు వేశారా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు. డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఫ్లోరిడాలో నేరుగా వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకోనున్నట్టు ఆయన టీం వెల్లడించింది.