- పెరగనున్న స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సర్వర్లు, లైటింగ్ ప్రొడక్ట్‌ల తయారీ
- మెక్సికోకూ ఆల్టర్నేటివ్‌గా ఇండియా మారే అవకాశం
- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచి, యూఎస్‌తో వాణిజ్య బంధాన్ని బలపర్చుకోవాలని నిపుణుల సలహా
న్యూఢిల్లీ: మెక్సికో, కెనడా, చైనాపై ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌లు వేయనుండడంతో ఇండియాకు మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చైనా గూడ్స్‌పై 10 శాతం టారిఫ్‌ను యూఎస్ వేసింది. దీంతో ఇండియా ఎలక్ట్రానిక్స్ సెక్టార్‌కు లాభపడుతుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇండియాలో తయారైన యాపిల్ ఫోన్లు అమెరికాలో అమ్ముడవుతున్నాయి. చైనా ప్రొడక్ట్‌లపై టారిఫ్‌లు పెరగడంతో, ఇండియా నుంచి మరిన్ని ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌ను యూఎస్ కంపెనీలు దిగుమతి చేసుకునే అవకాశం ఉంది.
మొబైల్ ఫోన్లలో వాడే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్, కెమెరా మాడ్యుల్, యూఎస్‌బీ కేబుల్స్ వంటి కీలక పార్టులపై బడ్జెట్‌లో సుంకాలను కేంద్రం తగ్గించింది. వీటిని దిగుమతి చేసుకునే ఇండియన్ కంపెనీలపై భారం తగ్గుతుంది. లోకల్‌గా ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ ఊపందుకుంటుందని అంచనా. ఈ అవకాశాన్ని వాడుకోవడానికి కొత్త పాలసీ ఒకటి తీసుకురావాలని, ఇండియా–యూఎస్ మధ్య వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు.
గ్లోబల్ బ్రాండ్లకు తయారీ కేంద్రంగా ఇండియా?
యాపిల్, మోటొరోలా వంటి గ్లోబల్ బ్రాండ్లు తమ ప్రొడక్ట్‌లను ఇండియాలో తయారు చేస్తున్నాయి. ఇవి రానున్న కాలంలో యూఎస్‌కు ఎగుమతులు పెంచే అవకాశం ఉంది. ‘ చైనా ప్రొడక్ట్‌లపై యూఎస్ టారిఫ్‌లు వేయడంతో షార్ట్ టర్మ్‌లో ఇండియాకు కొంత మేలు జరుగుతుంది. కానీ, లాంగ్ టర్మ్‌లో లాభపడాలంటే ఇండియా, యూఎస్ మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ మరింత మెరుగవ్వాలి. అప్పుడే లేబర్ ఎక్కువగా అవసరముండే కంపెనీలకు, ప్రీమియం ప్రొడక్ట్‌ల తయారీకి ఇండియా ఆల్టర్నేటివ్‌గా మారుతుంది’ అని డిక్షన్ టెక్నాలజీస్ చైర్మన్ సునీల్ వాచాని అన్నారు.
శామ్‌సంగ్, షావోమి, మోటొరోలా, రియల్‌మీ, గూగుల్, వివో వంటి కంపెనీల కోసం ప్రొడక్ట్‌లను డిక్షన్ తయారు చేస్తోంది. యాపిల్ ఐఫోన్లను మాత్రం ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ తయారు చేస్తున్నాయి. కొన్ని గ్లోబల్ కంపెనీలు మెక్సికోను మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా చూస్తున్నాయి. తాజా టారిఫ్‌లతో ఇండియా మెక్సికోకి ఆల్టర్నేటివ్‌గా మారొచ్చని సునీల్ అన్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేయాలని, రెగ్యులేటరీ అనుమతులను వేగంగా ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సర్వర్లు, లైటింగ్ ప్రొడక్ట్‌లు తయారు చేసే కంపెనీలకు డిమాండ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. యూఎస్ కంపెనీలు ఇండియా నుంచి వీటిని సేకరించొచ్చు.
పెరగనున్న ఐఫోన్ల తయారీ
కిందటేడాది ఇండియా నుంచి రూ.1.75 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి అయ్యాయి. ఇందులో యాపిల్ వాటానే 65 శాతంగా ఉంది. శామ్‌సంగ్ వాటా 20 శాతంగా, మిగిలిన కంపెనీల వాటా 15 శాతంగా ఉంది. యాపిల్ కిందటేడాది రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లను ఇండియాలో తయారు చేసింది. ఇందులో రూ.1.10 లక్షల కోట్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేసింది. శామ్‌సంగ్ రూ.34,400 కోట్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేసింది.
మొత్తం ఐఫోన్లలో 25 శాతం ఇండియాలోనే తయారు చేయాలనే ఆలోచనలో యాపిల్ ఉంది. ఇంకో రెండుమూడేళ్లలో దీన్ని అందుకోవాలని చూస్తోంది. చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని అనుకుంటోంది. ఇందుకోసం 40 ఇండియన్ కంపెనీలతో పార్టనర్‌షిప్ కుదుర్చుకుంది. ఇందులో డిక్షన్ టెక్నాలజీస్, ఏంబర్ ఎలక్ట్రానిక్స్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, మదర్‌సన్ గ్రూప్ వంటివి ఉన్నాయి.