
- వీసా అప్లికెంట్ల సోషల్ మీడియా అకౌంట్లపై నజర్
- అమెరికాలోని ఇండియన్లకు కొత్త చిక్కులు
- డిపోర్టేషన్ తీరుపై జడ్జి విమర్శలు.. నాజీల కంటే ఘోరంగా ట్రీట్ చేస్తున్నారని ఫైర్
వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు కొత్త చిక్కులు మొదలయ్యాయి. ఇప్పటికే అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులు తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలు ఇవ్వాల్సిందేనంటూ కండిషన్ పెట్టిన ప్రెసిడెంట్ ట్రంప్ సర్కార్.. తాజాగా అమెరికాలో ఉంటున్న గ్రీన్‌కార్డ్ హోల్డర్లు కూడా తమ సోషల్ ఖాతాల వివరాలు సమర్పించాలని కొత్త పాలసీని తెరపైకి తెచ్చింది.
ఇమిగ్రేషన్ రూల్స్ ను మరింత కఠినతరం చేసిన ట్రంప్ ప్రభుత్వం ఈ మేరకు కొత్త పాలసీని త్వరలోనే అమలు చేయనుంది. దీని ప్రకారం గ్రీన్ కార్డ్ పై అమెరికాలో నివసిస్తున్నవారు, పర్మనెంట్ రెసిడెన్సీ కోసం లేదా ఆశ్రయం కోసం అప్లై చేసుకునేవారు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్)కు తమ సోషల్ మీడియా అకౌంట్ల ఖాతాలను సరెండర్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల అమెరికాలో ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శించేవారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే అమెరికాలో లీగల్ గా ఉంటూ రెండు దేశాల రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్న ఇండియన్లపైనా ఈ కొత్త పాలసీ ప్రభావం చూపనుంది. ఇకపై ఇలాంటి వారు అమెరికా ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా లేదా రాజకీయపరంగా ఆన్ లైన్లో నెగెటివ్ కామెంట్లు చేస్తే ఇమిగ్రేషన్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఐడెంటిటీ వెరిఫికేషన్, దేశ భద్రత కోసమే..
వీసా అప్లికెంట్ల సోషల్ మీడియా ఖాతాల వెరిఫికేషన్ అంశంపై ట్రంప్ సర్కారు మార్చి 5వ తేదీనే నోటీసు రిలీజ్ చేసింది. దరఖాస్తుదారుల గుర్తింపుతోపాటు అమెరికా జాతీయ భద్రత, పబ్లిక్ సేఫ్టీ, అప్లికెంట్ల స్క్రీనింగ్, వెరిఫికేషన్ ప్రాసెస్‌లో భాగంగా సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించనున్నట్టు అందులో వెల్లడించింది. ఐడెండిటీ వెరిఫికేషన్, జాతీయ భద్రతకు స్క్రీనింగ్‌ను మరింత పకడ్బందీగా చేపట్టడం కోసమే ఈ నిబంధనను ప్రవేశపెట్టినట్టు పేర్కొంది.
విదేశాలకు వెళ్లినా.. జాగ్రత్తగా ఉండాలి
అమెరికాలో ఉంటున్న గ్రీన్ కార్డ్(పర్మనెంట్ రెసిడెంట్లు), హెచ్1బీ వీసా, ఎఫ్1 వీసా హోల్డర్లు విదేశాలకు వెళ్లినప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రంప్ సర్కార్ ఆదేశించింది. ఈమేరకు యూఎస్ ఇమిగ్రేషన్ రూల్స్‌ను వారం క్రితం నుంచి మరింత కఠినతరం చేసింది. పాకిస్తాన్, అఫ్గాన్, భూటాన్ సహా 43 దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి ప్రవేశించకుండా ట్రావెల్ బ్యాన్ విధించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ట్రంప్ సర్కారు ఇటీవలే ప్రకటించింది. ఈ జాబితాలో ఇండియా లేకపోయినా.. ఇప్పటికే గ్రీన్‌కార్డ్, హెచ్1బీ, ఎఫ్1 వీసాలతో అమెరికాలో ఉంటున్నవారు విదేశాలకు వెళితే జాగ్రత్తలు తీసుకోవాలని ఇమిగ్రేషన్ అటార్నీలు ట్రావెల్ రిస్క్ అడ్వైజరీలు జారీ చేశారు.
నాజీలనూ ఇంత ఘోరంగా ట్రీట్ చేయలే.. జడ్జి
అక్రమ వలసదారులను ట్రంప్ సర్కారు తిప్పి పంపుతున్న (డిపోర్టేషన్) తీరు దారుణంగా ఉందని వాషింగ్టన్ లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జేమ్స్ బోస్ బర్గ్ ఫైర్ అయ్యారు. వెనెజులాకు చెందిన గ్యాంగ్ మెంబర్లుగా చెప్తున్న అక్రమ ఇమిగ్రెంట్లను రెండు విమానాల్లో ఈ నెల 15న ఎల్ సాల్వెడార్ లోని జైలుకు తరలించారు. ఈ అంశంపై సోమవారం విచారణ చేపట్టిన జడ్జి జేమ్స్.. వెనెజులా ఇమిగ్రెంట్లను 1798 నాటి ఎలియన్ ఎనిమీస్ యాక్ట్ ప్రకారం అతి కఠినంగా డిపోర్ట్ చేయడం ఏమిటని తప్పుపట్టారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీలను కూడా అమెరికా ఇంత ఘోరంగా ట్రీట్ చేయలేదన్నారు. ఇకపై ఎలియన్ ఎనిమీస్ యాక్ట్ ప్రకారం డిపోర్టేషన్ లు చేపట్టరాదంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఉద్యోగుల తొలగింపుపై సుప్రీంకోర్టుకు..
ప్రభుత్వ ఖర్చులను తగ్గించడంలో భాగంగా తొలగించిన 16 వేలకుపైగా ప్రొబెషనరీ ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ట్రంప్ సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఒక జిల్లా కోర్టు ఇలా ఆదేశించడం ఫెడరల్ ప్రభుత్వ విధులను, అధికారాలను ఉల్లంఘించ డమేనని సొలిసిటర్ జనరల్ అన్నారు. ప్రభుత్వా నికి ఉన్న రాజ్యాంగబద్ధమైన హక్కుపై జిల్లా కోర్టుల దాడిని నిలువరించి, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలన్నారు.
బైడెన్ హయాంలో మూడేండ్లలో 14 ఇంజంక్షన్ ఆర్డర్లు మాత్రమే ఇవ్వగా, ట్రంప్ హయాంలో 2 నెల్లలోనే 40కి పైగా ఆర్డర్లు ఇచ్చారన్నారు. కాగా, మస్క్ నేతృత్వంలోని డోజ్‌కు సెన్సిటివ్ డాక్యుమెంట్లు ఇవ్వొద్దని విద్యా శాఖ అధికారులను మేరీలాండ్ ఫెడరల్ జడ్జి ఆదేశించారు.