Hyderabad Real Estate: బడ్జెట్ చూశారుగా.. ఈ టైంలో ఇళ్లు, భూములు కొనొచ్చా..?

Hyderabad Real Estate: బడ్జెట్ చూశారుగా.. ఈ టైంలో ఇళ్లు, భూములు కొనొచ్చా..?

కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలను అమలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్రం అమలు చేయబోతున్న కీలక నిర్ణయాల్లో లాంగ్-టర్మ్ కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్లో ( LTCG) చేసిన మార్పు కీలకమైంది. లాంగ్-టర్మ్ కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ను 20 శాతం నుంచి 12.5 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇండెక్సేషన్ బెన్ఫిట్ను తొలగించింది. ఈ రెండు నిర్ణయాలు రియల్ ఎస్టేట్పై ఎలాంటి ప్రభావాన్ని చూపనున్నాయి..? కేంద్ర బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాల వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పుంజుకోనుందా..? మందగించనుందా..? బడ్జెట్ ప్రభావం రియల్ ఎస్టేట్పై ఏ మేరకు ఉంది..? ఈ సమయంలో ప్రాపర్టీ కొనాలన్న ఆలోచన సరైందేనా..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను వివరించే సమగ్ర కథనం..

హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించిందనే చెప్పక తప్పదు. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో.. అంటే 2024 తొలి త్రైమాసికంలో కేవలం ఒకే ఒక్క బిగ్గెస్ట్ ల్యాండ్ డీల్ జరిగింది. 48 ఎకరాల భూ కొనుగోలు జరిగింది. బెంగళూరు నగరంలో 2024 తొలి త్రైమాసికంలో 9 ల్యాండ్ డీల్స్ జరగ్గా.. హైదరాబాద్లో కేవలం ఒక్కటంటే ఒక్క ల్యాండ్ డీలే జరిగిందంటే భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ ప్రస్తుతం ఎంత మందగమన స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 2024 తొలి త్రైమాసికంలో 25 ల్యాండ్ డీల్స్ జరిగాయి. 324.97 ఎకరాల భూ కొనుగోళ్లు జరిగాయి. బెంగళూరు నగరంలోనే అత్యధికంగా 114.13 ఎకరాల ల్యాండ్ డీల్స్ జరిగాయి. 2024 సంవత్సరంలోని తొలి ఆరు నెలలు హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం కుదుపులను చూడాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు.. ఇలా రకరకాల కారణాలు తెలంగాణలో.. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రభావం చూపాయి. అయితే.. కేంద్ర బడ్జెట్ తర్వాత హైదరాబాద్ నగరంలో రియల్టీ వ్యాపారం వేగం పుంజుకునే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కేంద్ర బడ్జెట్పై కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ (CREDAI) హైదరాబాద్ హర్షం వ్యక్తం చేసింది. బడ్జెట్లో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రియల్ ఎస్టేట్ రంగానికి మేలు చేసే విధంగా ఉన్నాయని అభిప్రాయపడింది. అర్బన్ లో నివసిస్తుండే పేద, మధ్య తరగతి ప్రజలకు పీఎం ఆవాస్ యోజన 2.0 కింద కోటి ఇళ్ల నిర్మాణానికి కేంద్రం సంకల్పించిందని.. ఈ నిర్ణయం వల్ల 10 లక్షల కోట్ల పెట్టుబడిని రియల్ ఎస్టే్ట్ రంగం చూడబోతోందని CREDAI హైదరాబాద్ ప్రెసిడెంట్ వి.రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ ప్లానింగ్, ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్ నిర్ణయాలతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరందుకోనుందని ఆయన చెప్పారు. బడ్జెట్ లో భాగంగా కేంద్రం ప్రకటించిన.. హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ నిర్ణయం కూడా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పురోగతికి కారణం కానుందని రియల్టర్లు ఆశిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 2001కి ముందు జరిగిన ల్యాండ్ డీల్ ప్రాపర్టీస్కు సంబంధించి ఇండెక్సేషన్ బెన్ఫిట్స్ ప్రిజర్వ్ చేసినట్లు CREDAI Hyderabad జనరల్ సెక్రటరీ బి.జగన్నాథ రావు తెలిపారు. కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లెక్కగట్టేటప్పుడు వీటిపై వ్యాల్యుయేషన్ ఎడ్జస్ట్మెంట్స్ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు.

కేంద్ర బడ్జెట్పై CREDAI Hyderabad స్పందన ఇలా ఉండగా దేశవ్యాప్తంగా ఉన్న రియల్టీ రంగం నుంచి మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. కొందరు రియల్టర్లు కేంద్ర బడ్జెట్ను స్వాగతించగా, మరికొందరు మాత్రం పెదవి విరిచారు. ఇండెక్సేషన్ బెన్ఫిట్స్ తొలగించడం వల్ల భూ కొనుగోళ్లు తగ్గిపోయే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బెంబేలెత్తిపోతున్నారు. ఇండెక్సేషన్ ఉంటే.. అమ్మకందారులు లాభాలపై తక్కువ పన్ను చెల్లించి ఎక్కువ లాభాన్ని ఆర్జించే అవకాశం ఉండేదని గుర్తుచేస్తున్నారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్పై  (LTCG) (2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు ఉన్న ఆస్తిని విక్రయించడం ద్వారా వచ్చిన లాభంపై విధించే పన్ను) ఇండెక్సేషన్ వర్తించేదని.. దీని వల్ల పెట్టుబడిదారులు అధిక లాభాలు ఆశించి రియల్ ఎస్టేట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేవారని చెప్పుకొచ్చారు. ఇండెక్సేషన్ అనేది రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు ఆకర్షించడానికి ఎంతగానో ఉపయోగపడేదని చెప్పారు. ఇండెక్సేషన్ను కేంద్రం రద్దు చేయడం వల్ల ద్రవ్యోల్పణానికి తగినట్టుగా వ్యాల్యుయేషన్ సర్దుబాటుకు వీలు లేకుండా పోయిందని, పెట్టుబడిదారులు తమ లాభాలను పన్ను రూపంలో కోల్పోక తప్పదని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:-మీ ఏరియాలో కుక్కలున్నాయా?..అయితే ఈ నంబర్కు కాల్ చేయండి