సికింద్రాబాద్ లోని డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్స్ అగ్ని ప్రమాద ఘటనలో గల్లంతైన వారి ఆచూకీ కోసం అధికారులు అధునాతన పరికరాలు వాడుతున్నారు. ఇందులో భాగంగా ఫైర్ సిబ్బంది విక్టిమ్ లొకేషన్ కెమెరా.. వీఎల్సీ ఉపయోగించి వారి జాడ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ విక్టిమ్ లొకేషన్ కెమెరా అంటే ఏమిటి? ఈ డివైజ్ ఎలా పనిచేస్తుంది?
దురదృష్టవశాత్తూ బిల్డింగ్ లు కూలిపోయి ఎవరైనా శిథిలాల కింద చిక్కుకున్నా, ప్రమాదవశాత్తూ చిన్నారులు బోరుబావిలో పడ్డా వారి ఆనవాళ్లు గుర్తించేందుకు విక్టిమ్ లొకేషన్ కెమెరాను ఉపయోగిస్తారు. చూసేందుకు మెషీన్ గన్లా కనిపించే ఈ డివైజ్లో రెండు భాగాలుంటాయి. ఒకటి కెమెరా రాడ్, రెండోది కంట్రోల్ మాడ్యూల్. అల్టా లైట్ వెయిట్ టెలిస్కోపిక్ రాడ్ ను 9 ఫీట్ల వరకు పొడగించుకోవచ్చు. రాడ్ అంచున కెమెరాతో పాటు ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. ఫలితంగా చీకటి ప్రదేశాల్లోనూ విక్టిమ్ ను సులువుగా గుర్తించేందుకు వీలు కలుగుతుంది. కెమెరాను 360 డిగ్రీల్లో రొటేట్ చేసుకోవచ్చు. రాడ్తో పాటు 60 మీటర్ల వైర్ కూడా వస్తుంది. లోతైన ప్రదేశాల్లో గాలింపు కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు.
కెమెరా వద్ద ఎల్ఈడీ లైట్లతో పాటు ఓ స్పీకర్ కూడా ఉంటుంది. శిథిలాల్లో చిక్కుకున్న వారికి మాటల్ని, సూచనల్ని వినించవచ్చు. అంతే కాదు బాధితుల చేసే చిన్న శబ్దాన్ని కూడా ఇవి పసిగడతాయి. విక్టిమ్ బ్రీతింగ్ ను సైతం ఇది రికార్డు చేయగలుగుతుంది. ఇక కంట్రోల్ మాడ్యూల్లోని మానిటర్ ద్వారా బాధితులు ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూసే అవకాశం కలుగుతుంది. ఈ డివైజ్ ను ఏకధాటిగా 3గంటల పాటు ఉపయోగించొచ్చు.