
కాఫీ తాగడం మంచిదేనా? రోజుకి ఎన్ని కప్పులు తాగొచ్చు? దీనిమీద చాలానే చర్చలు, పరిశోధనలు జరుగుతున్నాయి. నిజానికి కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్లు సడెన్‌గా మానాలంటే పెద్ద కష్టమే. ఎందుకంటే చాలామందికి ఉదయం పూట కాఫీ తాగకపోతే జీవితం ఆగిపోయినట్టు ఫీలవుతారు. కానీ కొందరిలో మాత్రం కాఫీ తాగాక గాబరా, ఆందోళన, గుండె కొట్టుకునే వేగం పెరుగుతాయి. ఇదే విషయం గురించి డైటీషియన్, న్యూట్రిషనిస్ట్, స్కిన్‌కేర్ స్పెషలిస్ట్‌లు కొన్ని విషయాలు చెప్పారు.
తక్కువ నుంచి ఓ మాదిరి మొత్తంలో కాఫీ తాగితే హెల్త్ పరంగా చాలా రకాల లాభాలే ఉన్నాయి. క్యాన్సర్ డెవలప్ కాకుండా కాఫీ చెక్ పెడుతుంది. యాంటీఆక్సిడెంట్ యాక్టివిటీని క్రమపరుస్తుంది. ఇన్ఫ్లమేషన్, టైప్2 డయాబెటిస్ రిస్క్ వంటివి తగ్గిస్తుంది. న్యూరోడీజనరేటివ్ డిసీజ్(పార్కిన్సన్), డిప్రెషన్, కాలేయ సంబంధిత వ్యాధులను, గాల్‌స్టోన్స్ రిస్క్ కూడా తగ్గిస్తుంది. అయితే కాఫీ తాగడం వల్ల లాభ నష్టాలనేవి కాఫీతో పాటు ఇతర అంశాలతో కలిపి ఉంటాయి. వాస్తవానికి కెఫిన్ వల్ల కంటే కూడా కాఫీబీన్లో ఉండే ఇతర కెమికల్స్, యాంటీఆక్సిడెంట్స్ వల్ల కలిగే లాభం ఎక్కువ అని ఎండోక్రైనాలజిస్ట్‌లు చెప్తున్నారు. కాఫీ తాగడంతో పాటు శరీరానికి అందించే హైడ్రేషన్, నిద్ర సరిగా ఉండాలి. అలాకానీ చేయలేదంటే కాఫీ తాగడం మంచిదా? కాదా? అని ఆలోచించడం మానేయాలి అంటున్నారు రీసెర్చర్లు.
చర్మానికి ఓకేనా?
ఐ–క్రీమ్స్, హెయిర్ కేర్ ఉత్పత్తుల్లో కెఫిన్ ఉంటుంది. స్కిన్ మీద రాసే ప్రొడక్ట్స్ గురించి కాకుండా కాఫీ తాగడం వల్ల చర్మానికి ప్రయోజనమా? అంటే... అవుననే అంటున్నారు డెర్మటాలజిస్ట్‌లు. కాఫీ తాగడం వల్ల చర్మానికి మేలే. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ప్రత్యేకించి క్లోరెజెనిక్ యాసిడ్ ఫ్రీ రాడికల్స్ జతగా ఉంటాయి. కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్... అల్ట్రావైలట్ ఎక్స్పోజర్, కాలుష్యం వల్ల కలిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్నుంచి బయటపడేస్తాయి. అలాగే బేసల్ సెల్ కార్సినోమా అనే స్కిన్ క్యాన్సర్ డెవలప్ కాకుండా అడ్డుపడతాయి.
మానేస్తే ఆరోగ్యమా!
రాత్రిళ్లు నిద్రరాకుండా ఉండాలని చాలామంది కాఫీ తాగుతుంటారు. దీనివల్ల నిద్రమీద ప్రభావం పడుతుంది. ఒక్కొక్కరి బాడీ నేచర్ ఒక్కోలా రెస్పాండ్ అవుతుంది. ఆయా వ్యక్తుల మెటబాలిజమ్, ఇతర రకాల హెల్త్ కండిషన్స్ వంటివి కూడా కారణాల బట్టి అది ఉంటుంది. కాఫీ వల్ల యాంగ్జైటీ, డైజెస్టివ్ డిస్ట్రెస్ అంటే యాసిడ్రిఫ్లెక్స్ లేదా గ్యాస్ట్రిక్స్ వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవేకాకుండా గుండె కొట్టుకునే వేగం, బ్లడ్ ప్రెషర్ పెరుగుతాయి. కాఫీ తాగడం అనేది కొందరి విషయంలో రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటిది. కాఫీకి జీవక్రియలను క్రమపరిచే, శక్తిని పెంచే సామర్ధ్యం ఉంది. దాంతో బరువు తగ్గడంలో సాయం చేస్తుంది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే... ఇది ఆకలిని చంపేస్తుంది. దాంతో శరీరంలోకి అధిక కాలరీలు వెళ్లవు. మెటబాలిజం తగ్గిపోతుంది.
అదే స్కిన్ విషయాన్ని తీసుకుంటే... కాఫీ అనేది డైయూరెటిక్. కాఫీ తాగడం వల్ల శరీరంలో అదనంగా ఉన్న నీరు, ఉప్పు బయటకు పోతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే చర్మం డీహైడ్రేట్ అవుతుంది. అందుకే కాఫీ తాగే వాళ్లు మంచినీళ్లు ఎక్కువ తాగాలి. అలాగే చర్మం నీటిని కోల్పోకుండా, మాయిశ్చరైజర్ వంటి రీహైడ్రేట్ ప్రొడక్ట్స్ వాడాలి. అప్పుడు చర్మానికి పోషణ అందుతుంది అంటున్నారు స్కిన్ స్పెషలిస్ట్‌లు. కాఫీ వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ కాఫీబీన్ మీద ఆధారపడి ఉంటాయి. బ్లాక్ కాఫీ తాగేవాళ్లకి, చక్కెర, పాలు కలిపిన కాఫీ తాగేవాళ్లకి మధ్య చాలా తేడా ఉంటుంది. కాఫీ డికాషన్‌లో పాలు, చక్కెరలు కలుపుకుని తాగితే నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుంది.
రోజూ కాఫీ తాగితే!
కాఫీ తాగడం వల్ల కలిగే లాభాలు మీ ఆరోగ్యం తీరు బట్టి ఉంటుంది. అది తెలుసుకుని కాఫీ తాగితే నష్టం లేదు. ఉదయం వేళల్లో కాఫీ తాగితే నెగెటివ్ ఎఫెక్ట్ తక్కువ. కాఫీ తాగడం వల్ల లాభమా? నష్టమా? రోజుకి ఎన్ని కప్పులు తాగాలి? అనేకంటే ఏదైనా అతి అనర్థమే. ఎవరి ఆరోగ్యం గురించి వాళ్లకే తెలుస్తుంది. దాన్నిబట్టి ఏం తినాలి? ఏం తాగాలనేది? ఎవరికి వాళ్లే సెట్ చేసుకోవాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్.
ఎన్ని కప్పులు?
సెన్సిటివ్ హెల్త్ ఉండేవాళ్లు ఒక కప్పు కాఫీ తాగితే చాలు. అదే మిగతా వాళ్లయితే నాలుగు కప్పుల వరకు ఓకే. కాఫీ బీన్, కాఫీ తయారుచేసే పద్ధతి దృష్టిలో పెట్టుకోవాలి. రోజుకి50 నుంచి 400 మిల్లీగ్రాముల కెఫిన్ తీసుకోవడం వరకు ఓకే. అంతకుమించితేనే అనారోగ్యం” అని హెచ్చరిస్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.