దోస్తుల్లా..హోడీ మోడీ..!

ఒక సమావేశం ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపింది. ఒక సమావేశం ఎన్నో అవకాశాలను కల్పించింది. ఒక సమావేశం చరిత్ర సృష్టించింది. అదే హూస్టన్ లో జరిగిన హౌడీ మోడీ వేడుక. ప్రవాస భారతీయులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశం కొత్తకొత్తగా సాగింది. అమెరికా ప్రెసిడెంట్​ స్పెషల్ గా ఈ భేటీకి రావడం.. ఇద్దరు దేశాధినేతలు ఒకరిని మరొకరు పొగడుకోవడం.. అంతకు మించి ఇండో అమెరికా సరికొత్త స్నేహబంధానికి వేదికైంది.

50 వేల మంది హాజరైన ఈ కార్యక్రమాన్ని చూసి అమెరికన్లు కూడా ఆశ్చర్యపోయారు. పోప్ తర్వాత అమెరికాలో ఒక ఇతర దేశాధినేత పాల్గొనే సమావేశానికి ఇంతలా జనం రావడం కూడా ఇదే తొలిసారి. ఈ ఈవెంట్ లో ట్రంప్ స్పెషల్ గెస్ట్ అయినా,  మోడీనే ఎక్కవ హైలైట్​ అయ్యారు. అయినా 2020లో ఎన్నికలు వస్తుండడంతో ట్రంప్ కు కూడా హోడీ మోడీ కలిసొచ్చినట్టే.

మోడీని వాణిజ్యాంశాలపై పలు సార్లు విమర్శించిన ట్రంప్ హూస్టన్ లో మాత్రం ఆకాశానికెత్తేశారు. మొన్నటికి మొన్న మనదేశానికి ట్రేడ్ విషయంలో సుంకాలు పెంచేసి, వాణిజ్య ప్రాధాన్య హోదా తొలగించిన ట్రంప్ ఇప్పుడు మెత్తబడ్డట్లు  కనిపించారు. అమెరికన్లకు ఉద్యోగావకాశాలు పెంచాలి. ఇది ట్రంప్ కాన్సెప్ట్. అమెరికాలో ఎవరు పెట్టుబడులు పెట్టినా, ఉద్యోగ కల్పనకు అవకాశం ఇచ్చినా చాలు అంటున్నారు ట్రంప్. అందుకే తన ప్రసంగంలో ఇండియా కూడా అమెరికాలో పెట్టుబడులు పెద్ద ఎత్తున పెడుతోందని ప్రస్తావించారు.

అలాగే, మోడీ నాయకత్వ ప్రతిభను ఆకాశానికెత్తేశారు. దేశాన్ని సరికొత్త దిశగా నడిపిస్తున్నారన్నారు. మరోవైపు పాకిస్తాన్ ను పాయింట్ అవుట్ చేసేలా ట్రంప్ మాట్లాడారు. భారత, అమెరికా రెండు దేశాలు సరిహద్దులతో ముడిపడిన అంశాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఇస్లామిక్  టెర్రరిస్టుల నుంచి, సంఘ విద్రోహ శక్తుల నుంచి అమెరికా, ఇండియా తమ బోర్డర్లను, ప్రజలను కాపాడుకోవాలంటూ పిలుపునిచ్చారు. టెర్రరిస్టులపై పోరాటాన్ని ముమ్మరం చేస్తామన్నారు ట్రంప్.

మోడీ తొలి పాయింట్ నుంచి చివరి పాయింట్​ వరకూ చాలా కీలక విషయాలు మాట్లాడారు. ప్రవాస భారతీయులతో ఏదో చిట్ చాట్ అని కాకుండా సమస్యలను దూరం చేసేలా, భారతీయ అమెరికన్లను దగ్గర చేసేలా ప్రసంగించారు. ‘ఆల్ ఈజ్ వెల్’ అంటూ ప్రారంభించిన మోడీ.. తెలుగులోనూ ‘అంతా బాగుంది’ అని అన్నారు. ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఈ వాక్యాన్ని పలికారు మోడీ. దీంతో హిందీ వివాదానికి తెరదింపుతున్నట్లు మొదటి మాటలోనే చెప్పేశారు. అంటే ప్రతి మాట, ప్రతి ఆలోచన చాలా క్లియర్ గా ఉన్నాయి మోడీ ప్రసంగంలో.

యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ను పొగడ్తల్లో ముంచెత్తారు ప్రధాని మోడీ. కంపెనీ సీఈవో నుంచి అమెరికా కమాండర్ ఇన్ చీఫ్ గా ఎదిగిన ట్రంప్ పాలిటిక్స్ నుంచి ఎకానమీ దాకా అన్ని రంగాల్లో తనదైన ముద్రవేశారని మోడీ చెప్పారు. ఎప్పుడు కలిసినా ఫ్రెండ్లీగా, ఎనర్జీగా ఉంటారని అన్నారు. అమెరికాను మళ్లీ గ్రేట్ గా నిలబెట్టేందుకు ట్రంప్ ఎంతో కృషి చేస్తున్నారని పొగిడారు. అక్కడితో ఆగకుండా.. ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ అంటూ పూర్తిస్థాయి మద్దతు ప్రకటించేశారు. సాధారణంగా రెండుసార్లు వరుసగా అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికవడం యూఎస్ లో చాలాసార్లు జరిగింది. ఇప్పుడు కూడా ట్రంప్ రావాలన్న ఉద్దేశంతో మోడీ అలా మాట్లాడి ఉంటారని విశ్లేషిస్తున్నారు. భారత, అమెరికా మధ్య సుంకాల గొడవకు త్వరలోనే పుల్ స్టాప్ పెట్టడం దీని వెనుక ఉద్దేశమని చెబుతున్నారు.

మరోవైపు, పాకిస్తాన్ ను మోడీ టార్గెట్ చేశారు. టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నది ఎవరో ప్రపంచానికంతా తెలుసు అని ట్రంప్ సమక్షంలోనే మాట్లాడారు. ‘అమెరికాలో 9/11ఇండియాలో 26/11 దాడులకు కుట్ర ఎక్కడ జరిగిందో అందరికీ తెలుసు’ అంటూ మాట్లాడారు. ఇండియా అభివృద్ధి చెందుతుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని కామెంట్ చేశారు. ఇదే సభలో కాశ్మీర్ అంశాన్నీ ప్రధాని ప్రస్తావించారు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా కాశ్మీరీలకు రాజ్యాంగబద్ధంగా అన్నీ అందుతాయన్నారు మోడీ.

మొత్తంగా హూస్టన్ సభ ద్వారా అమెరికా భారతదేశాల మధ్య కొత్త అధ్యాయానికి తెరలేపారు మోడీ, ట్రంప్. స్నేహమంటే ఇదే అనేలా మాట్లాడుకున్నారు. చేతిలో చెయ్యేసి తిరిగారు. ‘మాకు మీరు మీకు మేము’ అనుకున్నారు. ట్రంప్ ముఖంలో ఎప్పుడూ సీరియస్ నెస్ కనిపిస్తుంది. కానీ హూస్టన్ ఈవెంట్ లో మాత్రం స్పీచ్ మధ్యమధ్యలో మనస్ఫూర్తిగా నవ్వారు. బహుశా, వచ్చే ఎలక్షన్లకు తనకు మద్దతుగా మోడీ మాట్లాడడమే దీనికి కారణమై ఉంటుంది.