
తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. తెలుగు పంచాంగం ప్రకారం చైత్రమాసం శుద్ద పాడ్యమి రోజున ఉగాది పండుగతో కొత్త సంవత్సరం ఆరంభం కానుంది. ఈ ఏడాది ఉగాది పండుగ మార్చి 30న వచ్చింది. ఉగాది పండుగ రోజు అందరూ కచ్చితంగా ఉగాది పచ్చడి తినాలని పండితులు చెబుతుంటారు. అసలు ఆ రోజు ఉగాది పచ్చడి ఎందుకు తినాలి. ఎన్ని రోజులు తినాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
వసంత గమన శుభవేళ.. పచ్చగా కళకళలాడే ప్రకృతి పరంగా.. రేవతి నక్షత్ర ప్రవేశంతో.. చైత్ర శుద్ధ పాడ్యమి ఆదివారం రోజున ( మార్చి30) ఉగాది పండుగ .. శ్రీ విశ్వావశు నామ సంవత్సర కాలగమనం ఆరంభమవుతుంది. ప్రమాదాలు, ప్రమోదాలు కలబోతగా గడిచిపోయిన క్రోధినామ సంవత్సరం.. తెలుగు సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. రాబోయే ఏడాదిలో నవ్య కాంతుల్ని నింపాలని మరో వసంతానికి స్వాగతం పలుకుతారు. రైతులు కొత్తగా చేన్లలో సాలు పెట్టుకుంటారు. పంచాంగం వింటారు.
ఉగాది పచ్చడి మహాఔషధం..
ఉగాది పచ్చడి ఒక మహాఔషధమని పెద్దలు చెబుతుంటారు. ఈ ఉగాది పచ్చడిని శ్రీరామ నవమి వరకూ లేదా చైత్ర పౌర్ణమి వరకు ప్రతిరోజూ తీసుకోవాలి. అలా 9 లేదా 15 రోజుల పాటు ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందంటారు. ఉగాది పచ్చడిలో ఉండే వేప పువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది. వేపగాలి ఆటలమ్మ, అమ్మోరు మొదలైన వ్యాధులను దగ్గరకు రానీయదు. మామిడి యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉన్నది. ఇది కఫము, వాతము, పైత్యాలనే మూడు దోషాలను అదుపులో ఉంచుతుంది. మనకు వచ్చే జబ్బుల్లో చాలా వరకూ వీటివల్లే వస్తాయి..
మంచి ఆశయాలతో ముందుకు సాగాలి
'శతాయుర్వజ్ర దేవయ సర్వ సంపత్రాయచ.. సర్వతిష్ట వినాశయ నిబంకదళ బక్షణమ్' అనే శ్లోకం పఠించి ఉగాది ప్రసాదాన్ని స్వీకరించాలి. పంచాంగ శ్రవణం వినాలి. మంచి ఆశయాలతో ముందడుగు వేయాలి. ఈ రోజున (మార్చి 30) పంచాంగాన్ని విన్న పక్షంలో ఏ గ్రహం మనకి అనుకూలంగా లేదో, ఎవరు మనకి సహాయకులో తెలిసి, ఏయే కష్ట నష్టాలో తెలుసుకొని వాటికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలను ఎన్నుకోగలుగుతామని పండితులు చెబుతున్నారు.
►ALSO READ | ఉగాది పిండి వంటలు : భక్ష్యాలు, కొబ్బరి బూరెలు ఇంట్లోనే టేస్టీగా ఇలా తయారు చేసుకోవచ్చు..!