హైదరాబాద్​లో కరెంట్​ పోల్స్​ ఎన్ని ఉన్నయ్..లెక్క తేల్చే పనిలో జీహెచ్ఎంసీ

హైదరాబాద్​లో కరెంట్​ పోల్స్​ ఎన్ని ఉన్నయ్..లెక్క తేల్చే పనిలో జీహెచ్ఎంసీ
  • ప్రతి పోల్​కు క్యూఆర్ కోడ్​తో జియో ట్యాగింగ్
  • 5.48 లక్షలు ఉన్నాయంటూ ప్రతిసారి టెండర్లు
  • అన్నింటికీ బిల్లులు చెల్లిస్తున్న బల్దియా 
  • ఈసారి పక్కా లెక్క చూసి ఆ ప్రకారమే టెండర్లు, బిల్లులు  

హైదరాబాద్ సిటీ, వెలుగు:గ్రేటర్ లోని ప్రతి ఎలక్ర్టికల్ పోల్ ను క్యూఆర్ కోడ్ తో జియో ట్యాగింగ్​చేసి ఎన్ని పోల్స్​ఉన్నాయో లెక్క తేల్చే పనిలో పడింది బల్దియా. 9,103 కిలోమీటర్ల రోడ్లు ఉండగా, 5.48 లక్షల  స్ర్టీట్​లైట్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ సంఖ్య ఆధారంగానే ప్రతిసారి టెండర్లు వేసి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. అయితే, 4 నెలలుగా మహానగరంలో స్ర్టీట్ లైట్లు సగానికి సగం వెలగడంలేదు. రాత్రిళ్లు చీకటిగా ఉన్న ప్రాంతాల్లో యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. 

స్ట్రీట్​లైట్లు వెలగకపోవడం, లైట్లు లేనిచోట్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని జీహెచ్ఎంసీకి వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే, మెయింటెయిన్​ చేస్తున్న సంస్థ మాత్రం 98 శాతం లైట్లు వర్కింగ్​కండిషన్​లో ఉన్నాయని చెప్తోంది. దీంతో అసలు ఎన్ని లైట్లు ఉన్నాయని  కమిషనర్ ఇలంబరితి ప్రశ్నించగా, సుమారు ఐదున్నర లక్షలని సమాధానం వచ్చింది. ఈ విషయంలో కమిషనర్​కు అనుమానం కలగడంతో అసలు గ్రేటర్​లో ఎన్ని పోల్స్​ఉన్నాయో లెక్క తేల్చేందుకు సిద్ధమయ్యారు. 

దీని కోసం రహస్యంగా ఓ సర్వే చేయిస్తున్నారు. ఇందులో స్ర్టీట్ లైట్ల మెయింటనెన్స్​సరిగ్గా చేయడం లేదని తేలింది. అలాగే కమిషనర్​అడిగినట్టు ఒక్కో ఏరియాలో ఎన్ని పోల్స్ ఉన్నాయి? అందులో జీహెచ్ఎంసీవి ఎన్ని? మొత్తం స్ట్రీట్​లైట్స్​ఎన్ని ఉన్నాయన్న ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్ మెంట్​పోల్స్ కు కూడా స్ర్టీట్ లైట్లు ఏర్పాటు చేసి లెక్కలు తారుమారు చేశారన ఆరోపణలు వచ్చాయి. పోల్స్ విషయంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు తెలియడంతో చెక్ పెట్టేందుకు క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు.  

లెక్క తేల్చాకే బిల్లులు..  

చాలా చోట్ల స్ర్టీట్ లైట్లు వెలగకపోవడం, అవసరమైన ప్రాంతాల్లో లైట్లు లేకపోవడంతో 2018లో ఈఈఎస్ఎల్ (ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్)సంస్థకు 5.48 లక్షల స్ర్టీట్ లైట్లు ఏర్పాటుతో పాటు, నిర్వహణ  బాధ్యతలను బల్దియా అప్పగించింది. కొద్ది రోజులు బాగానే మెయింటెయిన్​చేసినా తర్వాత నిర్వహణలో ఈ సంస్థ ఫెయిల్ అవుతూ వస్తోంది. 

రెండేండ్లుగా ఈ సంస్థ సరిగ్గా పనులు చేయడంలేదని, జనంతో పాటు ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు రావడంతో బిల్లుల చెల్లింపులను జీహెచ్ఎంసీ కొంతకాలం నిలిపివేసింది. తర్వాత మళ్లీ బిల్లులు చెల్లించడం మొదలుపెట్టింది. ఈ సంస్థకు ఇప్పటి వరకు ఏడేండ్లలో రూ.450 కోట్లకు పైగా బిల్లులను చెల్లించింది. 

అయితే, ఐదు నెలల క్రితం సమస్య తీవ్రం కావడంతో ప్రత్యామ్నాయంగా బజాజ్ ఎలక్ర్టానిక్స్ సంస్థకు 18 వేల స్ర్టీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. మిగిలిన మెయింటనెన్స్​ఇంకా ఈఈఎస్​ఎల్ సంస్థనే చేస్తోంది. వారి మెయింటనెన్స్​పై ఆరోపణలు రావడంతో అసలు స్ట్రీట్​లైట్లు ఎన్ని ఉన్నాయో తేల్చే పనిలో పడ్డారు. 

ఇకపై పక్కాగా మెయింటెనెన్స్ ఉండేలా ..

గ్రేటర్ లో లైట్ల లెక్క తేల్చిన తర్వాత టెండర్లు పిలిచి వేరే సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు బల్దియా బాస్​సిద్ధమవుతున్నారు. కొత్త వారికి అప్పగించే ముందు స్ర్టీట్ లైట్లు ఎన్ని ఉన్నాయో తేల్చనున్నారు. వాటికి క్యూఆర్ కోడ్ కేటాయించి ఆ కోడ్ ఆధారంగా జియో ట్యాగింగ్​చేయనున్నారు. దీనివల్ల ప్రతి పోల్ వివరాలను హెడ్ ఆఫీసు నుంచి పర్యవేక్షించొచ్చు. జియో ట్యాగింగ్ ద్వారా పోల్స్ వద్ద వైర్, లైట్లు ఏది పాడైనా తెలుస్తుంది. అక్కడ పనులు చేశారా?లేదా అన్న వివరాలు కూడా తెలుసుకోవచ్చు.  

ఆ పోల్ నెంబర్ ఎంట్రీ చేయగానే అక్కడ ఇన్ని రోజులపాటు ఏం పనులు చేశారు? ఎంత సేపు ఆ లైట్ వర్కింగ్ లో ఉందన్నది తెలుస్తుంది. ఇందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ కొనసాగుతోంది. పూర్తిగా జియో ట్యాగింగ్ అయిన తర్వాత నిర్వహణ కోసం టెండర్లు వేసే అవకాశం ఉంది. అప్పుడు వందశాతం స్ర్టీట్ లైట్లు వెలిగేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు.