ఆ లేఖ వచ్చిన వారం రోజుల్లోనే ఫలక్నుమా రైల్లో మంటలు.. ప్రమాదమా లేక కుట్రా ?

హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లోని మంటలు చెలరేగి ఆరు బోగీలు తగలబడటం వెనక.. ఏమైనా కుట్ర ఉందా లేక ప్రమాదమా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అదృష్ట వశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేకపోవటం ఊపిరిపీల్చుకునే విషయమే అయినా.. ప్రమాదం వెనక అనుమానాలు వ్యక్తం కావటం కలకలం రేపుతోంది. అనుమానాలకు కారణం లేకపోలేదు.. వారం రోజుల క్రితం అంటే.. 2023, జూన్ 30వ తేదీన.. సికింద్రాబాద్ రైల్వే డివిజనల్.. డీఆర్ఎంకు అడ్రస్ లేని ఓ లేఖ వచ్చింది. ఈ లేఖ సారాంశం ఇలా ఉంది..

ఒడిశా రాష్ట్రం బాలాసోర్ దగ్గర జరిగిన రైలు ప్రమాదం లాంటిదో మరో రైలు ప్రమాదం త్వరలో జరుగుతుందని.. రాబోయే రోజుల్లో ఢిల్లీ, హైదరాబాద్ రూట్లో ఈ ప్రమాదం ఉండొచ్చని.. తనకు నమ్మకమైన వ్యక్తులు, వర్గాల ద్వారా ఈ సమాచారం వచ్చిందని ఆ లేఖలో ఉంది. ఈ లేఖ ఎక్కడ నుంచి వచ్చింది అనేది స్పష్టత లేదు. దీంతో రైల్వే అధికారులు.. లేఖ సమాచారాన్ని రైల్వే పోలీసులకు తెలియజేశారు. ఈ లేఖ విషయాన్ని నార్త్ జోన్ పోలీస్ ఉన్నతాధికారులకు చెప్పారు రైల్వే అధికారులు.

రైల్వే అధికారులకు ప్రమాదం జరుగుతుందంటూ లేఖ వచ్చిన సరిగ్గా వారం తర్వాత.. హైదరాబాద్ కు సమీపంలో.. బీబీ నగర్ దగ్గర హౌరా ఎక్స్ ప్రెస్ లో మంటలు రావటం.. ఆరు బోగీలు కాలి బూడిద కావటం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఓ వ్యక్తి సిగరెట్ తాగటం వల్లే జరిగిందనే కొందరు ప్రయాణికులు చెబుతున్నా.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. లేఖ తర్వాత జరిగిన రైలు ప్రమాదం కావటంతో.. ఇందులో కుట్ర ఉందా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అనుకోకుండా.. ప్రమాద వశాత్తు జరిగిందా.. షార్ట్ సర్క్కూట్ వల్ల జరిగిందా లేక ఎవరైనా కావాలనే ఇలా చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. 

ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని రైల్వే ఉన్నతాధికారులు అందరూ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వెళుతున్నారు. ప్రయాణికులను సురక్షితంగా తరలించే పనుల్లో ఉన్నారు. ట్రాక్ ను క్లియర్ చేయాల్సిన బిజీలో ఉన్నారు. ఆ తర్వాత కానీ అసలు విషయం బయటకు రాదు. 

ప్రమాదం అయితే పర్వాలేదు అదే కుట్ర అయితే మాత్రం దీని వెనక ఎవరు ఉన్నారు.. లేఖ ఎక్కడి నుంచి వచ్చింది.. రాసింది ఎవరు.. అతనికి చెప్పింది ఎవరు అనేది కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే అన్నీ అనుమానాలు మాత్రమే.. అది కూడా ఆగంతకుడు చెప్పినట్లే జరగటం అనేది ఆలోచించాల్సిన అంశమే..