ఫైబర్ గ్లాస్ సిలిండర్లు భద్రత ఎక్కువ.. బరువు తక్కువ

ఫైబర్ గ్లాస్ సిలిండర్లు భద్రత ఎక్కువ.. బరువు తక్కువ

HPCL Launches Fiberglass light weight cylindersప్రభుత్వ రంగ సంస్థ హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) కలర్‌‌ఫుల్‌గా సరికొత్త ఎల్‌పీజీ సిలిండర్లను త్వరలో లాంచ్ చేయబోతుంది. దేశవ్యా ప్తంగా మరికొన్ని నెలల్లో ఈ సిలిండర్లు రానున్నాయి. ఫైబర్ తో తయారైన ఈ సిలిండర్లు మోసుకెళ్లడానికి తేలికగా ఉంటాయి. ప్రస్తుత స్టీల్‌ సిలిండర్లు చాలా బరువుగా, మోసుకెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో సరికొత్తగా తేలికైన ఈ కలర్‌‌ఫుల్ సిలిండర్లను లాంచ్ చేయాలని హెచ్‌పీసీఎల్ చూస్తోంది. తేలికగా ఉండటమే కాకుండా, భద్రతరీత్యా తగిన ఏర్పాట్లు కూడా ఈ సిలిండర్లలో హెచ్‌పీసీఎల్‌ అందిస్తోంది. 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీల వంటగ్యాస్ సామర్థ్యంతో ఈ కొత్త సిలిండర్లు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతమున్న మెటల్ సిలిండర్లు 14.2 కేజీల వంటగ్యాస్ తో అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కార్యక్రమం కింద తీసుకొస్తున్న ఈ అధునాతన సిలిండర్లకు ప్రస్తుత సిలిండర్లకు చెల్లిస్తున్న దాని కంటే కాస్త ఎక్కువగానే చెల్లించాలి.

అధునాతన సిలిండర్లను పొందడానికి, కన్జ్యూమర్లు పాత, స్టీల్(మెటల్) సిలిండర్లను తిరిగి ఇవ్వడమే కాకుండా సుమారు వెయ్యి రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ‘ఓజాస్’ రేంజ్‌లో కన్జ్యూమర్ల కుకింగ్‌ అవసరాలకు తేలికైన సిలిండర్లను ప్రవేశపెడుతున్నట్టు హెచ్‌పీసీఎల్ ట్వీట్ చేసింది. ఇవి ప్రస్తుతమున్న మెటల్ సిలిండర్ల కంటే చాలా సౌకర్యవంతంగా వాడుకోవచ్చని పేర్కొంది. మెరుగైన డిజైన్ లో, పూర్తిగా సురక్షితంగా వాడుకునేలా గృహవినియోగదారుల ముందుకు తీసుకొస్తున్నట్టు కూడా తెలిపింది. ఈ కొత్త సిలిండర్లు ప్రవేశపెట్టేందుకు పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించింది. మంటలు చెలరేగి నప్పటికీ ఈ సిలిండర్లు పేలవు. దీనికి వాడిన ఫైబర్‌‌ గ్లాస్ టెక్నాలజీనే దీనికి కారణం.